వెంకయ్యా... ఇప్పుడేమంటావయ్యా

15 Dec, 2016 20:20 IST|Sakshi
వెంకయ్యా... ఇప్పుడేమంటావయ్యా

అమరావతి: కేంద్ర ప్రభుత్వం మసిపూసి మారేడుకాయ చేసినంత మాత్రాన రాష్ట్ర ప్రజలు ప్రత్యేక హోదా అంశాన్ని మరిచిపోరని ఏపీ ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి నేతలు కె.రామకృష్ణ, చలసాని శ్రీనివాస్ అన్నారు. ఈ విషయంలో కేంద్రం తీరుతో గాయపడిన హృదయాలు ఇంకా బాధపడుతున్నాయని పేర్కొన్నారు.

గురువారమిక్కడ వారు విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా ఘనత తమదేనంటూ సన్మానాలు, ఆ తర్వాత ప్రత్యేక ప్యాకేజీ అంటూ సన్మానాలు చేయించుకున్న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పుడు కేంద్రం చేసిన ప్రకటనపై ఏమి సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌కు చేయాల్సిందంతా చేశామని, ఇంక చేసేదేమీలేదని పార్లమెంట్‌లో కేంద్ర ప్రణాళిక శాఖ మంత్రి ఇంద్రజిత్‌సింగ్ లోక్‌సభలో చెప్పడం దుర్మార్గమని వారు దుయ్యబట్టారు.

హామీ ఇచ్చారు... హోదా ఇవ్వండి
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ ఏపీ బీసీ సంక్షేమ యువజన సంఘం గురువారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా నిర్వహించింది. విభజన వేళ కేంద్రం, ఎన్నికల ముందు ప్రధాని మోదీ ఇచ్చిన హామీకి అనుగుణంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని రాష్ట్ర బీసీ యువజన సంఘం అధ్యక్షుడు కే. వేణుమాధవ్ డిమాండ్‌చేశారు.

మరిన్ని వార్తలు