అక్రమార్కులకు ‘హామీ’

14 Sep, 2016 23:32 IST|Sakshi
అక్రమార్కులకు ‘హామీ’

→   ‘ఉపాధి’ నిధుల దుర్వినియోగం
→   30 మండలాల్లోనే రూ.13 కోట్లకు పైగా స్వాహా
→   సామాజిక తనిఖీల్లో బట్టబయలు
→   కూలీల పొట్ట కొడుతున్న అక్రమార్కులు
→   టీడీపీ అధికారంలోకి వచ్చాక మితిమీరిన అవినీతి


‘తిక్కోడి పెళ్లిలో తిన్నోడే బుద్ధిమంతుడు’ అన్నట్లు మారింది జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా)పరిస్థితి. ఈ సంస్థలో నిధులకు ఏ మాత్రమూ కొదవలేదు. దీని ఆధ్వర్యంలో చేపడుతున్న పనుల్లో అక్రమార్కులు అందినకాడికి దండుకుంటున్నారు. ఈ క్రమంలో కూలీల పొట్టకొట్టేందుకు సైతం వెనుకాడడం లేదు. వలసల నివారణే ధ్యేయంగా అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకాన్ని అవినీతికి కేరాఫ్‌గా మార్చేశారు. క్షేత్రస్థాయి నుంచి పైస్థాయి వరకు ఎక్కడికక్కడ నిధుల దోపిడీయే లక్ష్యంగా పని చేస్తుండడంతో ఈ పథకం లక్ష్యం నీరుగారిపోతోంది.

అనంతపురం టౌన్‌ : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల్లో అక్రమాలు ఆగడం లేదు. ఏటా చేపడుతున్న సామాజిక తనిఖీల్లో ఈ విషయం బహిర్గతమవుతూనే ఉంది. అయినప్పటికీ అక్రమాల నివారణకు అధికారులు పటిష్ట చర్యలు చేపట్టలేకపోతున్నారు. జిల్లాలోని 63 మండలాల్లో చేపట్టిన ఉపాధి పనులపై ఇప్పటి వరకు ఎనిమిది విడతల సామాజిక తనిఖీలు ముగిశాయి. తనిఖీ బందాలు రూ.40 కోట్ల వరకు అవినీతిని గుర్తించాయి. అధికారులు మాత్రం రూ.3.60 కోట్లు జరిగినట్లు చెబుతున్నారు. ఇది వాస్తవ విరుద్ధం. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న తొమ్మిది, పదో విడత తనిఖీల్లో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి.

30 మండలాల్లో ముగిసిన తనిఖీలు
2014–15 ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన పనులకు సంబంధించి తొమ్మిదో విడత, 2015–16లో జరిగిన పనులపై పదో విడత సామాజిక తనిఖీలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. తనిఖీ బందాలు క్షేత్రస్థాయిలో పనులు పరిశీలించి..గుర్తించిన అక్రమాలపై ఓపెన్‌ ఫోరం నిర్వహిస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి ప్రారంభమైన తనిఖీలు వచ్చే ఏడాది మార్చి 31 వరకు కొనసాగుతాయి.

ఏప్రిల్‌లో బొమ్మనహాళ్, గాండ్లపెంట, తనకల్లు, శెట్లూరు, మేలో పరిగి, ఓడీ చెరువు, కంబదూరు, నార్పల, అనంతపురం, బుక్కరాయసముద్రం, గోరంట్ల, అమడగూరు, జూన్‌లో హిందూపురం, కదిరి, నల్లమాడ, కూడేరులో సామాజిక తనిఖీలు పూర్తయ్యాయి. జూలైలో పెనుకొండ, మడకశిర, గార్లదిన్నె, పుట్లూరు, సోమందేపల్లి, రామగిరి, గుంతకల్లు, కుందుర్పి, ఆగస్టులో తలుపుల, పెద్దవడుగూరు, పెద్దపప్పూరు, శింగనమల, రొళ్ల, తాడిపత్రి, సెప్టెంబర్‌కు సంబంధించి ఈ నెల 14వ తేదీ నాటికి కనగానపల్లిలో తనిఖీలు ముగిశాయి.

రూ.కోట్లు కొల్లగొట్టారు!
క్షేత్రస్థాయిలో పనులు పరిశీలిస్తున్న సామాజిక తనిఖీ బందాలు అక్రమాల పరంపరను చూసి అవాక్కవుతున్నాయి. పనులు చేయకున్నా చేసినట్లు రికార్డుల్లో చూపడం, కొలతల్లో తేడాలు, కూలీలు పనులకు రాకున్నా మస్టర్లు సష్టించడం.. ఇలా అనేక అక్రమాలు బయటపడుతున్నాయి. ప్రస్తుతం రూ.126.10 కోట్ల పనులకు సంబంధించి ఆడిట్‌ నిర్వహించగా.. ఏకంగా రూ.13.34 కోట్ల అవినీతి జరిగినట్లు గుర్తించారు. పైగా ఓపెన్‌ ఫోరం నిర్వహించి అవినీతిని బయటపెట్టాక.. రికవరీ చేసిన మొత్తం రూ.21 వేలు మాత్రమే. ఈ అవినీతి వ్యవహారం వెనుక ఫీల్డ్‌ అసిస్టెంట్‌ స్థాయి నుంచి ఉన్నత స్థాయి అధికారుల వరకు అందరూ భాగస్వాములయ్యారన్న ఆరోపణలు బలంగా విన్పిస్తున్నాయి. ఇంకా 33 మండలాల్లో తనిఖీలు చేయాల్సి ఉంది. ఇవన్నీ పూర్తయితే మరో రూ.15 కోట్ల వరకు అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. 

మరిన్ని వార్తలు