వైద్యం చేయలేం!

15 Mar, 2017 23:14 IST|Sakshi
వైద్యం చేయలేం!

లబ్బీపేట (విజయవాడ తూర్పు) : రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకంతో కార్పొరేట్‌ ఆస్పత్రులు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. బ్యాంకు ఖాతాలు ఓవర్‌ డ్రాఫ్ట్‌కు చేరడంతో ఈ నెలలో సిబ్బందికి ఇంకా జీతాలు కూడా చెల్లించలేని దయనీయ స్థితి నెలకొంది. ఎన్టీఆర్‌ వైద్య సేవ పథకం ద్వారా నిరుపేదలకు అందిస్తున్న వైద్యానికి సంబం«ధించిన బిల్లుల చెల్లింపులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడమే ఇందుకు కారణం. రెండు నెలలుగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, బయటకు చెప్పలేని స్థితిలో ఆస్పత్రుల నిర్వాహకులు కొట్టుమిట్టాడుతున్నారు. ఇలాగైతే వైద్యం ఎలా చేయాలని వారు ప్రశ్నిస్తున్నారు. ఇదే వైఖరి అవలంబిస్తే వైద్య సేవ పథకాన్ని అమలు చేయడం తమవల్ల కాదని స్పష్టం చేస్తున్నారు. ఈ విషయంపై ఏ ఆస్పత్రి నిర్వాహకుడైనా ప్రశ్నిస్తే వారిపై ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

రెండు జిల్లాలకు రూ.250 కోట్ల బకాయి
కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబంధించి ఎన్టీఆర్‌ వైద్య సేవ, ఈహెచ్‌ఎస్‌ పథకం ద్వారా వైద్య సేవలు అందించిన ఆస్పత్రులకు రూ.250 కోట్లు బకాయి ఉన్నట్లు సమాచారం. రెండు జిల్లాల్లో వంద వరకూ నెట్‌వర్క్‌ ఆస్పత్రులు ఉండగా, ప్రతి ఆస్పత్రికి రూ.3 కోట్ల నుంచి రూ.5కోట్ల వరకూ బకాయి ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మధ్య త రహా ఆస్పత్రులకు సైతం ఒక్కోదానికి రూ.3 కోట్లు బకాయి ఉండటంతో నిర్వహణ కష్టతరంగా మారిందన్నారు.

సమ్మె నోటీసు ఇస్తే కొద్దిగా విదిల్చారు
జనవరిలో ఎన్టీఆర్‌ వైద్య సేవ, ఈహెచ్‌ఎస్‌ పథకం సేవలు నిలిపివేస్తామని ఆంధ్రప్రదేశ్‌ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌(ఆషా) ఆధ్వర్యాన సమ్మె నోటీసు ఇచ్చిన సమయంలో కొద్ది మొత్తంలో బిల్లులు విడుదల చేసినట్లు వైద్యులు తెలిపారు. అప్పటికే రూ.3 కోట్లకు పైగా బకాయి ఉన్న ఆస్పత్రులకు రూ.30లక్షల నుంచి రూ.50 లక్షల వరకూ విడుదల చేశారని చెప్పారు. ప్రభుత్వం తమ బకాయిలు ఎప్పటికప్పుడు విడుదల చేయకపోతే నిర్వహణ కష్టతరంగా మారుతుందని వాపోతున్నారు. ఇదే వైఖరి అవలంబిస్తే రానున్న కాలంలో సేవలు నిలిపివేయడం మినహా మరోమార్గం లేదని పేర్కొంటున్నారు.

తక్కువ ప్యాకేజీలైనా...
ఎన్టీఆర్‌ వైద్యసేవ ప్యాకేజీలు తొమ్మిదేళ్ల కిందట నిర్ణయించినవే నేటికీ కొనసాగిస్తున్నారు. అప్పటికీ... ఇప్పటికీ ఆస్పత్రి నిర్వహణ వ్యయం మూడు రెట్లు పెరిగిందని వైద్యులు చెబుతున్నారు. తమకు ఏమాత్రం ప్రయోజనం లేకపోయినా పేదలనే సేవా భావంతో వైద్యం చేస్తున్నామని తెలిపారు. అయినప్పటికీ బిల్లులు చెల్లించడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.  

బిల్లులు తక్షణమే విడుదల చేయాలి
రాష్ట్రంలోని ఎన్టీఆర్‌ వైద్యసేవ ఎంపానల్‌మెంట్‌ ఆస్పత్రులకు ప్రభుత్వ బకాయిలు కొండలా పేరుకుపోతున్నాయి. దీంతో ఆస్పత్రుల నిర్వహణ కష్టతరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో పథకం కూడా నిర్యీర్యం అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే పలు వ్యాధులకు చికిత్స చేసేందుకు ప్రభుత్వాస్పత్రులే దిక్కుగా మారాయి. పేదలకు మెరుగైన వైద్యం కలగానే మారే రోజులు వస్తాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆస్పత్రులకు ఉన్న బకాయిలను తక్షణమే చెల్లించి పేదలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలి.
– డాక్టర్‌ మెహబూబ్‌ షేక్,వైఎస్సార్‌ సీపీ వైద్య విభాగం కృష్ణా జిల్లా అధ్యక్షుడు

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా