‘ఉత్త’ర్వు... కసరత్తు కరువు..!

1 Nov, 2015 01:43 IST|Sakshi
‘ఉత్త’ర్వు... కసరత్తు కరువు..!

♦ గందరగోళంగా నంబర్ ప్లేట్ల వ్యవహారం
♦ జీవో ఇచ్చి పదిరోజులైనా ఖరారు కాని విధివిధానాలు
♦ ఆర్టీఏ కార్యాలయాల చుట్టూ వాహనదారుల ప్రదక్షిణలు
♦ తమకే స్పష్టత లేదంటూ తిప్పిపంపుతున్న అధికారులు
 
 సాక్షి, హైదరాబాద్: ‘తాళం వేశా.. కానీ గొళ్లెం మరిచా..’ అన్నట్టు తయారైంది టీఎస్ సీరీస్‌లోకి వాహనాల నంబర్ ప్లేట్ల వ్యవహారం. ఏదైనా జీవో జారీచేయాలంటే ముందుగా దాని అమలుపై కసరత్తు చేస్తారు. కానీ, ఏపీ సీరీస్‌తో రిజిస్టర్ అయిన వాహనాలను కొత్తగా అమల్లోకి వచ్చిన టీఎస్ సీరీస్‌లోకి మార్చే ముఖ్యమైన వ్యవహారంలో మాత్రం ఇది పూర్తిగా రివర్స్ అయింది. స్టేట్ కోడ్, జిల్లా కోడ్ మార్పును ఎలా అమలు చేయాలి, కొత్త ఆర్‌సీని ఉచితంగా ఇవ్వాలా, లేక ఫీజు వసూలు చేయాలా?... నేరుగా వాహనదారులు దరఖాస్తు చేసుకోవాలా- ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసే వెసులుబాటు కల్పించాలా, వాటికి కచ్చితంగా హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు అమర్చాలా వద్దా, అమరిస్తే ఫీజు ఎంత ఉండాలి... ఇలాంటి కసరత్తు లేకుండా రవాణా శాఖ పది రోజుల క్రితం హడావుడిగా ఉత్తర్వు జారీ చేసింది.

దీంతో వాహనదారులు రవాణాశాఖ కార్యాలయాలకు పోటెత్తుతున్నారు. కానీ... పై సందేహాలపై ప్రభుత్వం నుంచి అధికారులకు ఎలాంటి ఆదేశాలు, సూచనలు అందకపోవటంతో వారు వాహనదారులను తిప్పి పంపుతున్నారు. ప్రభుత్వం విధివిధానాలు ఖరారు చేసిన తర్వాత పత్రికాముఖంగా ప్రకటిస్తామని చెపుతున్నారు. రవాణాశాఖ కార్యదర్శి, కమిషనర్ మూడు పర్యాయాలు దీనిపై భేటీ అయినా విధివిధానాలను మాత్రం తేల్చలేకపోయారు.

 ఆన్‌లైన్‌లో మార్పు చేసుకునే వెసులుబాటు...
 అయితే రాష్ట్రంలో ఏపీ సీరీస్ రిజిస్ట్రేషన్ ఉన్న వాహనాలు లక్షల సంఖ్యలో ఉన్నందున వాటన్నింటినీ మార్చేందుకు వాహనదారులు నేరుగా కార్యాలయాలకు రావాలని చెబితే పని ఒత్తిడిని తట్టుకోవడం అసాధ్యమని అధికారులు తేల్చేశారు. దీంతో ఎవరికి వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేలా ఏర్పాటు చేయాలని...  ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్న సమయంలోనే రవాణాశాఖ నిర్ణయించింది. ఆర్‌సీ కార్డుకు నిర్ధారించే ఫీజును ఈ-సేవలో చెల్లించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేలా ఇప్పటికే ఓ ప్రణాళికను ఖరారు చేసి పెట్టుకున్నారు.

అయితే ఫీజు వసూలు చేస్తే వాహనదారుల నుంచి వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. త్వరలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలుండడం, జీహెచ్‌ఎంసీ పరిధిలోనే దాదాపు 30 ల క్షల వాహనాలున్నందున అది ఎన్నికలపై ప్రభావం చూపుతుందేమోన న్న సందేహాన్ని అధికారపార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. రుసుము లేకుండానే చూస్తామని ఇప్పటికే రెండుమూడు చోట్ల రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. కానీ, దానిని అధికారికంగా మాత్రం ప్రకటించలేదు.

మరిన్ని వార్తలు