కాళ్లకు ట్యాగ్‌లతో పావురాళ్ల విహారం

11 Feb, 2016 10:12 IST|Sakshi
కాళ్లకు ట్యాగ్‌లతో పావురాళ్ల విహారం

మనుబోలు: నంబర్లున్న ట్యాగ్‌లు కాళ్లకు కట్టి ఉన్న పావురాలు రెండు రోజులుగా తీరంలో విహరిస్తుండడాన్ని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలు మండలం కొలనకుదురు గ్రామస్తులు గుర్తించారు. బుధవారం ఓ పావురాయిని ఒక వ్యక్తి  పట్టుకుని పరిశీలించగా దాని కాలికి 1,348 నంబర్ ట్యాగ్ ఉండగా, మరో కాలికి ప్లాస్టిక్ తాడు లాంటిది కట్టి ఉంది. దీంతో గ్రామస్తులు ఏమైవుంటుందో అర్థంకాక ఆందోళన చెందుతున్నారు.

సమీపంలో రాకెట్ కేంద్రం ఉండటంతో వీటి సహాయంతో ఏదైనా కుట్రకు పన్నాగం పన్నుతున్నారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరు.. చెన్నైలో పావురాళ్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తారని వాటిని గుర్తించేందుకు నంబర్ ట్యాగులు కట్టి కొన్ని కిలోమీటర్ల దూరంలో విడిచి పెడతారని వాటిల్లో ఏది ముందు వదిలిన ప్రదేశానికి వెళితే ఆ పావురం గెలిచినట్లు ప్రకటిస్తారని పేర్కొంటున్నారు. దీనిపై రూ.లక్షల్లో బెట్టింగులు జరుగుతుంటాయి. ప్రస్తుతం కొలనకుదురులో కనిపిస్తున్న పావురాళ్లు ఆ కోవకు చెందినవే అయి ఉంటాయని భావిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు