మొక్కు బడి

21 Mar, 2016 04:11 IST|Sakshi
మొక్కు బడి

జిల్లా మొత్తం కోటి మొక్కల పెంపకం లక్ష్యం
అరకొర నిధులు.. కొరవడిన పర్యవేక్షణ
నీరుగారుతున్న అటవీ శాఖ ఆశయం

జిల్లాలో కోటి మొక్కలు పెంచాలి.. పచ్చదనం కనువిందు చేయాలి.. హరిత వనం ఆహ్లాదాన్ని పంచాలి.. పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలి.. ఇదీ అటవీ శాఖ సంకల్పం. ఆశయం వరకు బాగానే ఉంది.. ఆచరణలోకొచ్చేసరికి అంతా తుస్సు మంటోంది. మొక్కల పెంపకం మొక్కుబడిగా సాగుతోంది.. నిధుల విడుదల అంతంతమాత్రంగానే ఉంది. వెరసి అటవీ శాఖ.. సామాజిక అటవీ శాఖ ఆధ్వర్యంలో మొక్కల పెంపకం ప్రహసనంగా మారుతోంది.

కడప అర్బన్:  అటవీశాఖ, సామాజిక అటవీశాఖ ఆధ్వర్యంలో నర్సరీలు ఏర్పాటుచేసి వాటి ద్వారా జిల్లాలో పచ్చదనం తీసుకు రావాలని చేస్తున్న ప్రయత్నాలు అంతంత మాత్రంగానే కొనసాగుతున్నాయి. కోటి మొక్కలు పెంచాలనే లక్ష్యంతో లక్షలాది రూపాయలను ఖర్చు చేసి నర్సరీల్లో మొక్కలను పెంచుతున్నప్పటికీ సరైన పర్యవేక్షణ  లేని కారణంగా అవి చెట్లుగా మారడం అనుమానంగా కనిపిస్తోంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మినహా మిగతా పథకాల నుంచి నిధులు రాకపోవడంతో నర్సరీలు నత్తనడక న సాగుతున్నాయి.   కడప నగర శివార్లలోని రాజీవ్ స్మృతివనం ఇందుకుఠ నిదర్శనంగా నిలుస్తోంది.  కడప నగర వనంలో ప్రస్తుతానికి మొక్కలు నాటేందుకు గుంతలు మాత్రమే తవ్వారు. ఇంకా మొక్కలను నాటేందుకు సమయం పడుతుందని వేచి చూస్తున్నారు. నర్సరీల నుంచి ఆయా ప్రాంతాలకు మొక్కలు వెళ్లినప్పటికీ వర్షాభావ పరిస్థితుల వల్ల  పెరుగుదల లేదని తెలుస్తోంది.

జిల్లాలో నర్సరీల వివరాలు ఇలా..
జిల్లాలో 11 సెంట్రల్ నర్సరీ యూనిట్లు ఉన్నాయి. సామాజిక అటవీ విభాగంలో  2014 -15 సంవత్సరాలకు సంబంధించి 35 లక్షల మొక్కలను అభివృద్ధి చేయాలనే లక్ష్యం కాగా, 29. 5 లక్షల మొక్కలను పెంచారు.
2015- 16 సంవత్సరాలకు గాను, 40 లక్షలు లక్ష్యం కాగా, 30 లక్షల మొక్కలను పెంచారు.
కడప, ప్రొద్దుటూరు, రాజంపేట డివిజన్‌ల వారీగా మొత్తం 60 లక్షల మొక్కలను పెంచేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు.

 కడప సబ్ డివిజన్ పరిధిలో
కడప సబ్ డివిజన్ పరిధిలో 25 లక్షల మొక్కలను ఈ ఏడాది పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. దాదాపు తొమ్మిది నర్సరీలలో మొక్కలను పెంచుతున్నారు. అటవీశాఖ పరిధి లో కడప రాజీవ్ స్మృతివనం, కనుమలోపల్లె, ఒంటిమిట్ట, సిద్దవటం, రాయచోటి, వేంపల్లె పరి ధుల్లో నర్సరీలు ఉన్నాయి. మొక్కలను పెంచడంలోగానీ, వాటిని వినియోగించడంలోగానీ, జాబ్‌కార్డులు ఉన్న వారికి మాత్రమే ప్రాధాన్యత కల్పిస్తున్నారు. 

 ప్రొద్దుటూరు డివిజన్ పరిధిలో
ప్రొద్దుటూరు డివిజన్ పరిధిలో గత ఏడాది అటవీశాఖ ఆధ్వర్యంలో 15 లక్ష లు, స్కూలు నర్సరీల పరిధిలో 10 లక్షల మొక్కలను పెంచారు. ఈ ఏడాది 150 హెక్టార్లలో 1.66 లక్ష లు మాత్రమే స్కూలు నర్సరీల్లోనూ, రెండు లక్ష ల మొక్కలు అటవీశాఖ పరిధిలోని నర్సరీలలో  పెంచుతున్నారు. ఇక్కడ నర్సరీలన్నీ ఉపాధి హామీ పథకం నిధులతో నడుస్తున్నాయి. అయితే వీటిలో చాలా చోట్ల నిర్వహణ సరిగా లేకపోవడంతో మొక్కలు ఎండిపోయాయి. దీం తో లక్షలాది రూపాయలు వృథా అవుతున్నాయి.

 రాజంపేట పరిధిలో
రాజంపేట అటవీ శాఖ పరిధిలో 10 లక్షల మొక్కలు పెంచాలని లక్ష్యంగా నిర్దేశించారు. నర్సరీల ద్వారా 11 లక్షల మొక్కలను పెంచారు.   రాజంపేట ఫారెస్టు డివిజన్ పరిధిలో సామాజిక అటవీశాఖ ఆధ్వర్యంలో పుల్లంపేట మండలంలోని పుత్తనవారిపల్లె వద్ద 15 యేళ్ల క్రితం ఏర్పాటు చేసిన సామాజిక అటవీశాఖ నర్సరీ కేంద్రాన్ని ఎత్తివేశారు.  ఈ నర్సరీ కేంద్రానికి లక్షలాది రూపాయలు వెచ్చించి ఇప్పుడు నిరుపయోగంగా మార్చేశారు. అక్కడి నీటి సమస్య ఉందనే కారణాన్ని చూపి ఆ శాఖ అధికారులు మొక్కల పెంపకాన్ని నిలిపివేసినట్లు తె లుస్తోంది.

వర్షాలు ప్రారంభమైతే ఉచితంగా మొక్కలు
ప్రస్తుతం అన్ని నర్సరీలలో మొక్కలు ప్రాథమిక దశలో పెరుగుతున్నాయి. కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపించిన వెంటనే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మొక్కలను పెంచుకునేందుకు అవసరమైన మేరకు నిధులు సమకూరుస్తున్నారు. జాబ్‌కార్డు ఉన్న వారికే కాకుండా అవసరమైన వారికి మొక్కలు పెంచడంలోగానీ, పంపిణీలోగానీ అవకాశం కల్పిస్తే మెరుగ్గా ఉంటుంది. వర్షాలు ప్రారంభమైతే అవసరమైన వారందరికీ ఉచితంగా మొక్కలు పంపిణీ చేస్తాం.     - మహమ్మద్ దివాన్ మైదిన్, కడప డీఎఫ్‌ఓ

మరిన్ని వార్తలు