బదిలీలను నిలుపుదల చేయించాలి

5 Jun, 2017 22:57 IST|Sakshi
బదిలీలను నిలుపుదల చేయించాలి
జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ను కోరిన నర్సులు 
కాకినాడ వైద్యం : ప్రత్యేక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని తమ బదిలీలను నిలుపుదల చేయించాలని కోరుతూ కాకినాడ ప్రభుత్వాసుపత్రి హెడ్‌ నర్సులు, స్టాఫ్‌ నర్సులు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎం.రాఘవేంద్రరావును సోమవారం కలుసుకుని విపతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఏపీ గవర్నమెంట్‌ నర్సుల సంఘం జిల్లా అధ్యక్షురాలు అనూరాధ మాట్లాడుతూ రాజమహేంద్రవరంలోని జేడీ కార్యాలయంలో  శుక్రవారం నిర్వహించిన కౌన్సెలింగ్‌లో జీజీహెచ్‌కు చెందిన 76 మంది హెడ్, స్టాఫ్‌ నర్సులకు బదిలీలు జరిగాయన్నారు. భార్యాభర్తల ఉద్యోగం, అనారోగ్యం వంటి అంశాల్లో బదిలీల నిబంధనలకు  ప్రభుత్వం ఇచ్చిన మినహాయింపులను సైతం అధికారులు పరిగణనలోకి తీసుకోలేదన్నారు. సూపర్‌ స్పెషాలిటీస్‌ సేవలు అందించేందుకు ప్రత్యేక శిక్షణ తీసుకున్న వారికి బదిలీల్లో ప్రభుత్వం కొన్నిరకాల మినహాయింపులు ఇచ్చిందని వాటిని సైతం పరిగణనలోకి తీసుకోకపోవడం విచారణకరమన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న పలువురి నర్సులకు మినహాయింపు ఇవ్వలేదని వాపోయారు. స్టాఫ్,హెడ్‌ నర్సుల కోసం గతంలో ప్రభుత్వం విడుదల చేసిన జీవోలను అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్‌కి విజ్ఞప్తి చేశారు. కేన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న తమకు బదిలీలో మినహాయింపు ఇవ్వాలని కోరినా కౌన్సెలింగ్‌ అధికారులు పట్టించుకోలేదని ఓ స్టాఫ్‌ నర్సు కన్నీటి పర్యంతమైంది. ఈ విషయమై డైరెక్టర్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ) దృష్టికి తీసుకెళతానని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాఘవేంద్రరావు వారికి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గవర్నమెంట్‌ నర్సుల యూనియన్‌ సభ్యులు ఆనీ, నర్సింగ్‌ సూపరింటెండెంట్లు జెసు ప్రియ, అక్కమ్మ, పలువురు ఏపీఎన్‌జీవో నేతలు పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు