బాలకృష్ణ డౌన్‌ డౌన్‌

5 Sep, 2017 06:45 IST|Sakshi
బాలకృష్ణ డౌన్‌ డౌన్‌

రోడ్లకోసం రోడ్డెక్కిన జనం
సమస్యను వినకుండా వెళ్లిపోయిన ఎమ్మెల్యే బాలకృష్ణపై ఆగ్రహం
నిరసనగా రాస్తారోకో


లేపాక్షి: ‘‘బాలకృష్ణ డౌన్‌...డౌన్‌...మా సమస్యలు పట్టించుకోని ఎమ్మెల్యే రాజీనామా చేయాలి’’ అంటూ పలు గ్రామాల ప్రజలు నినాదాలు చేశారు. ఇంతకీ ఏంజరిగిందంటే... మండలంలోని సి.వెంకటాపురం, ఓబుళాపురం, గలిబిపల్లి గ్రామాల్లో రోడ్ల సమస్య తీవ్రంగా ఉంది. సీసీ రోడ్లు కూడా లేకపోవడంతో వానా కాలం అడుగుతీసి అడుగు వేయాలంటేనే ఇబ్బందిగా మారింది. ఈనేపథ్యంలోనే చాలా రోజుల తర్వాత హిందూపురం వస్తున్న ఎమ్మెల్యే బాలకృష్ణకు తమ సమస్యలు విన్నవించుకోవాలని ఆయా గ్రామాలప్రజలు సిద్ధమయ్యారు. సోమవారం ఎమ్మెల్యే లేపాక్షి నుంచి గలిబిపల్లి క్రాస్‌కు రాగానే స్థానికులంతా ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు.

తమ గ్రామంలో రోడ్లు లేక నడిచేందుకుకూడా ఇబ్బందిగా మారిందనీ, రోడ్ల సమస్య గురించి అనేక మార్లు విన్నవించినా ఎవరూ పట్టించుకోలేదని వాపోయారు. స్పందించిన బాలకృష్ణ అధికారులతో చర్చించి తగునిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం బాలకృష్ణ వాహనం  బిసలమానేపల్లికి చేరుకోగానే వెంకటాపురం, ఓబుళాపురం, బిసలమానేపల్లి గ్రామ ప్రజలుఅడ్డుకున్నారు. బిసలమానేల్లి నుంచి వెంటాపురం, ఓబుళాపురం గ్రామాలకు రహదారి లేదన్న విషయం చెప్పాలని భావించారు. కానీ బాలకృష్ణ వారితో మాట్లాడకుండానే అక్కడి నుంచి వెళ్లి పోయారు.

దీంతో ఆగ్రహించిన ప్రజలు ఎమ్మెల్యే వైఖరిని నిరసనగా రాస్తారోకో చేశారు. ‘‘ఎమ్మెల్యే బాలకృష్ణ డౌన్‌..డౌన్‌...ప్రజా సమస్యలు పట్టని పట్టని ఎమ్మెల్యే రాజీనామా చేయాలి’’ అంటూ నినదించారు. తమ సమస్యకు పరిష్కారం చూపే వరకూ కదిలేది లేదని రోడ్డుపైనే భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో రాకపోకలకు స్తంభించాయి. వెంటనే స్పందించిన పోలీసులు ఆందోళనకారులకు సర్పిచెప్పి రాస్తారోకోను విరమింపజేశారు.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు