ప్రాజెక్టు పరిధిలో చేపల సంచారంపై పరిశీలన

26 Apr, 2017 22:04 IST|Sakshi
ప్రాజెక్టు పరిధిలో చేపల సంచారంపై పరిశీలన
పోలవరం : పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యాక గోదావరి నదిలో చేపల సంచారానికి ఇబ్బందులు లేకుండా ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే విషయమై ప్రాజెక్టు ఇంజినీరింగ్, మత్స్యశాఖ అధికారులు బుధవారం సాంకేతికంగా పరిశీలించారు. అనంతరం ట్రాన్స్‌ట్రాయ్‌ అతిథి గృహంలో సమావేశం నిర్వహించి, ఇంజనీరింగ్‌ అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా మత్స్యశాఖ డీడీ ఎంఏ యాకూబ్‌ బాషా మాట్లాడుతూ కొన్ని రకాల చేపలు కాలువల నుంచి నదిలోకి మైగ్రేషన్‌ ఉంటుందన్నారు. ఏ నెలల్లో ఏఏ రకాల చేపలు అందుబాటులో ఉంటాయి? సంచరిస్తాయి? అనేది ఫీల్డ్‌ విజిట్‌ చేశామన్నారు. చేపల సంచారానికి వీలుగా స్పిల్‌వేలో ఎక్కడ డిజైన్‌ చేయాలనేది ఇంజినీరింగ్‌ అధికారుల సమావేశంలో చర్చించటం జరిగిందన్నారు. స్పిల్‌వే ప్రాంతాన్ని కూడా పరిశీలించామన్నారు. స్పిల్‌వే 1, 2 బ్లాక్‌ల మధ్య చేపల సంచారానికి వీలుగా ఏర్పాట్లు చేయటంపై ఇంజినీరింగ్‌ అధికారులు చర్చించారన్నారు. ప్రధానంగా బొచ్చె, శీలావతి, మోసు, గండుమేను, ఇసుకదొందులు, జెల్ల, పులస, వాలుగు, కొర్ర మేను, రొయ్యలు, బొమ్మిడాయి జాతులు   ఉంటాయన్నారు. సైజును బట్టి అవి ప్రయాణం చేస్తాయన్నారు. సెంట్రల్‌ ఇన్‌లాండ్‌ ఫిషరీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు వి.సురేష్, డాక్టర్‌ మాన్‌సన్, మత్స్యశాఖ డీడీ  ఎస్‌.అంజలి, ఏడీలు పి.రామ్మోహన్, డి.గోపిరెడ్డి, పోలవరం అథారిటీ సీఈ ఎ.పరమేశ్వరన్, ప్రాజెక్టు ఎస్‌ఈ వీఎస్‌.రమేష్‌బాబు సమావేశంలో పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు