అడుగడుగునా నిర్లక్ష్యం

16 Oct, 2016 20:19 IST|Sakshi
అడుగడుగునా నిర్లక్ష్యం
  విజయవాడ (ఇంద్రకీలాద్రి) : పౌర్ణమి.. ఆదివారం సెలువు రోజు.. పైగా ఈ  పౌర్ణమి నుంచి అమ్మవారు స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా దర్శనం.. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నప్పటికీ దుర్గగుడి అధికారులు ఏర్పాట్ల గురించి పెద్దగా పట్టించుకోలేదు. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎండలోనే మండిపోయారు. ప్రసాదాలు కూడా లభించక నిరాశకు గురయ్యారు. సాధారణంగా దసరా ఉత్సవాల తర్వాత రెండు, మూడు రోజులు భక్తులు, భవానీల రద్దీ కొనసాగుతుంది. ఈ ఏడాది అనూహ్యంగా ఉత్సవాలు ముగిసి ఐదు రోజులైనా భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గలేదు. భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రసాదాలు, అన్నదానం, మంచినీరు, షామియానాల ఏర్పాటు వంటి సదుపాయాల గురించి పట్టించుకోకపోవడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికారులు కేవలం ఆలయ ప్రాంగణంలోని గాలిగోపురం వద్ద రెండు చిన్న షామియానాలు ఏర్పాటు చేసి చేతులు దులిపేసుకున్నారు. 
ఒకవైపు రద్దీ.. మరోవైపు క్యూలైన్‌ తొలగింపు... 
దసరా అనంతరం భక్తుల రద్దీ కొనసాగుతున్నా, క్యూలైన్లను హడావుడిగా తొలగిస్తున్నారు. ఆదివారం అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగింది. ఘాట్‌ రోడ్డులోని పొంగలి షెడ్డు వరకు భక్తులు బారులు తీరారు. అయినా ఒకవైపు నుంచి క్యూలైన్‌లు తొలగిస్తూ ఉండటంతో భక్తులు ఎండలోనే పడిగాపులు పడ్డారు.
కానరాని సిబ్బంది... 
భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పటికీ ఆలయ సిబ్బంది కనిపించలేదు. ఉచిత దర్శనానికి విచ్చేసిన భక్తులను నియంత్రించేందుకు దేవస్థానం ఏర్పాటు చేసిన సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు విధి నిర్వహణలో కనిపించలేదు. ఆలయ ప్రాంగణంలోని గాలిగోపురం వద్ద ఉచిత క్యూలైన్‌ వద్ద భక్తులు గుంపులు గుంపులుగా చేరారు. దీంతో చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధుల తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాట్లు చేయాల్సిన సూపరింటెండెంట్లు, సెక్షన్‌ ఇన్‌చార్జిలు అసలు ఉన్నారా.. లేరా.. అని భక్తులు మండిపడ్డారు.  
దర్శనానికి నాలుగు గంటలు 
ఆదివారం స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు నాలుగు గంటలకు పైగా సమయం పట్టింది. దసరా ఉత్సవాల్లో సైతం రెండు నుంచి మూడు గంటల్లోనే అమ్మవారిని దర్శించుకుని కొండ దిగి వెళ్లామని నగరానికి చెందిన సత్యవతి అనే మహిళా భక్తురాలు తెలిపారు. ఇప్పుడు మాత్రం ఏర్పాట్లు సక్రమంగా చేయకపోవడంతో దర్శనానికి కూడా ఆలస్యమైందని ఆమె చెప్పారు. దర్శనానంతరం కొండ దిగువకు చేరుకున్న భక్తులు ప్రసాదం కోసం మరో క్యూలో వేచి ఉండాల్సి వచ్చింది. భక్తుల రద్దీకి తగినట్టుగా ప్రసాదాలను తయారు చేయించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. ఉత్సవాల తర్వాత నుంచి ఆదివారం వరకు ప్రతి భక్తునికి రెండు లడ్డూల చొప్పున రేషన్‌ విధించి విక్రయిస్తున్నారు. కొన్నిసార్లు అసలు ప్రసాదం లేదంటూ భవానీ ప్రసాదాలను  బలవంతంగా అంటగడుతున్నారని భక్తులు తెలిపారు.  
 
 
 
 
 
మరిన్ని వార్తలు