బతికుండగానే చంపేశారు

27 Apr, 2016 16:16 IST|Sakshi

  వైకల్యంతో మంచానికే పరిమితం
  మానవత్వాన్ని మరిచిన అధికారులు, జన్మభూమి కమిటీ సభ్యులు
  ఈ అభాగ్యురాలిని ఆదుకునేవారెలేరా?   

 
భర్త ఉండగా అన్ని చూసుకున్నాడు. ఆరేళ్ల క్రితం ఆయన అనారోగ్యంతో కాలం చేశాడు. అప్పటి నుంచి అనారోగ్యంతో ఆమె వైకల్యానికి గురై మంచానికే పరిమితమైంది. గత ప్రభుత్వం ఆమెకు వితంతు పింఛన్ మంజూరు చేసింది. కానీ ఈ ప్రభుత్వంలోని అధికారులు, జన్మభూమి కమిటీ సభ్యులు ఆమెను బతికుండానే రికార్డుల్లో చంపేశారు. వితంతు పింఛన్ నిలిపేశారు. వైకల్య భారంతో కార్యాలయాలకు వెళ్లలేకపోయినా.. అష్టకష్టాలు పడుతూ అధికారులు చుట్టూ అనేక మార్లు తిరిగినా కనికరం కలగలేదు. ఆదుకునేవారు లేక ప్రాణం నిలుపుకునేందుకు నాలుగు మెతుకుల కోసం ఆరాటపడుతున్న ఓ అభాగ్యురాలు ధీనగాథ ఇది.
 
పెళ్లకూరు :  నెల్లూరుజిల్లా పెళ్లకూరు మండలంలోని పునబాక పంచాయతీ, చవటకండ్రిగ దళితకాలనీకి చెందిన కత్తి సుబ్బమ్మ (38) శారీరకంగా బాగానే ఉండేది. భర్త తిరుపాలు బతికున్నాళ్లు ఏ ఇబ్బంది లేకుండా జరిగిపోయింది. ఆరేళ్ల కిందట అతను అనారోగ్యంతో మృతి చెందాడు. వితంతువైన సుబ్బమ్మ అనారోగ్యంతో మంచానికి పరిమితమైంది. ఈ క్రమంలో ఆమె వైకల్యానికి గురైంది. ఆదుకునేవారు లేక దిక్కుతోచని స్థితిలో ప్రాణం నిలుపుకోవడానికి ఆరాటపడుతూ మంచంలోనే సజీవిగా పడి ఉంది. ఈ క్రమంలో ఆమెకు గత ప్రభుత్వం వితంతు పింఛన్ మంజూరు చేసింది. అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం పింఛన్లు తగ్గించేందుకు అధికారులు, జన్మభూమి కమిటీ సభ్యులు (టీడీపీ కార్యకర్తలు) కలిసి 2015 డిసెంబరు నుంచి పింఛన్ నిలిపేశారు. వైకల్యంతో ఇబ్బంది పడుతున్నా.. పింఛన్ కోసం స్థానికుల సహకారంతో మండల కార్యాలయం చుట్టూ పలుమార్లు తిరిగింది. కానీ చివరకు అక్కడి అధికారులు సుబ్బమ్మ మృతి చెందినట్లుగా జాబితాలో నమోదు చేసినట్లు చెప్పి పంపేశారు. తన పింఛన్‌ను పునరుద్ధరించమని ఐదు నెలలుగా ప్రాధేయపడుతున్నా.. అధికారులు కనీసం స్పందించకపోవడం మానవత్వాన్ని ప్రశ్నిస్తుంది. తనను ఆదుకునే అధికారులు, పాలకులు లేరా అంటూ ఆ అభాగ్యురాలు కన్నీటి పర్యంతమవుతోంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు మానవతా దృక్పథంతో స్పందించి న్యాయం చేయాలని ఆమె కోరుతుంది. ఈ విషయమై ఎంపీడీఓ సరళని వివరణ కోరగా పరిశీలించి చర్యలు చేపడుతామన్నారు.
 
 
 

మరిన్ని వార్తలు