‘అతి’ కారుల వినియోగం

18 Sep, 2016 21:21 IST|Sakshi
‘అతి’ కారుల వినియోగం
  • రంపచోడవరం ఐటీడీఏలో నిబంధనలకు పాతర
  • నిబంధనల మేరకు నడుచుకోవాల్సిన అధికారులే వాటికి తూట్లు పొడుస్తున్నారు. నిబంధనలకు నీళ్లొదిలి ఇష్టానుసారంగా వాహనాలను వినియోగిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. అధికారులు అద్దెవాహనాలను వినియోగించాల్సి వస్తే క్యాబ్‌ రిజిస్ట్రేషన్‌ (పసుపురంగు నంబరు ప్లేటు) ఉన్న వాహనాలను మాత్రమే వినియోగించాలి. కానీ వారు సొంత రిజిస్ట్రేషన్‌ వాహనాల్లో ప్రభుత్వ డ్రైవర్లు వాడుకుంటున్నారు. నిబంధనల ప్రకారం అద్దె వాహనంలో ప్రభుత్వ డ్రైవర్లను వినియోగించరాదు.
     – రంపచోడవరం
     
     
    రంపచోడవరం ఐటీడీఏ ఏపీఓ జనరల్‌ పీవీఎస్‌ నాయుడు రంపచోడవరానికి చెందిన ఒకరి వాహనాన్ని అద్దె వాహనంగా వినియోగిస్తున్నారు. దానికి ఐటీడీఏలో పనిచేసే డ్రైవరును వినియోగించుకుంటున్నారు. వాస్తవానికి వాహనాన్ని అద్దెకు తీసుకుంటే ఆ యజమానే డ్రైవర్‌ను ఏర్పాటు చేయాలి. అయితే ఇక్కడ అలా జరగలేదు. వాహన యాజమాని ఏపీఓ సౌలభ్యం కోసం రెండు వాహనాలపై ఆన్‌ గవర్నమెంట్‌ డ్యూటీ అంటూ పెద్దపెద్ద బోర్డులు పెట్టి అందుబాటులో ఉంచారు. అధికారులకు వాహనాలు ఏజెన్సీలో క్షేత్ర స్థాయిలో పర్యటించేందుకు ఏర్పాటు చేస్తారు. కానీ అధికారులు తమ సొంత పనులకు వాటిని వాడుకుంటున్నారు. దీని కోసం రెండు లాగ్‌ బుక్‌లను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇటీవల గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ సెలవుపై వెళ్లారు. అయితే డీడీ ఇన్‌ఛార్జిగా వ్యవహరించిన ఏపీఓ జనరల్‌ డీడీ వాహనానికి సంబంధించి నెల రోజులు డిజీల్‌ను వినియోగించారు. అంతే కాదు తను వినియోగిస్తున్న అద్దె వాహనాన్ని కూడా వాడుకున్నారు. ఒక అధికారి నెలలో రెండు వాహనాల్లో ఎలా తిరుగుతారో ఐటీడీఏ ఉన్నతాధికారులకే తెలియాలి. అలాగే ఐకేపీ ఏపీఓ శ్రీనువాసుదొర కూడా తన సొంత కారును వాడుకుంటూ ఆ కారుకు మరొకని పేరుతో అద్దె తీసుకుంటున్నారు. సొంత వాహనాన్ని అద్దె కోసం వినియోగించాలంటే ఆర్టీఓ కార్యాలయం నుంచి అనుమతి తీసుకోవాలి. కానీ అలా అనుమతులేవీ తీసుకో లేదు. వాహనాలను వినియోగించే అధికారులు నెలలో ముందుగానే తమ టూర్‌డైరీని సంబంధిత ఉన్నతాధికారికి సమర్పించాలి. వాహనంలో  తిరిగిన తరువాత కూడా టూర్‌డైరీ ఇవ్వాలి. ఇలాంటివి  ఏవీ ఇక్కడ అమలు జరగడం లేదు. రంపచోడవరం కేంద్రంగా ఉన్న అనేక శాఖల ఉన్నతాధికారులు  సొంత వాహనాలను వినియోగిస్తూ క్షేత్ర స్థాయిలో పరిశీలన లేకుండా తమ ఇంటి నుంచి కార్యాలయానికి రావడానికి వాడుకుంటున్నారు. వాటికి బిల్లులు చేసుకుంటున్నారు.
     
    నిర్వహణ లోపంతో షెడ్‌కు
    ఐటీడీఏ కార్యాలయానికి చెందిన అనేక వాహనాలు చిన్నపాటి మరమ్మతులతో షెడ్‌కు చేరుకుంటున్నాయి. వాటిని పట్టించుకోకపోవడంతో సుమారు 20 వరకు వాహనాలు తుప్పుపట్టి భూమిలో కలిసిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. 
     
    గిరిజన యువతకు ఏదీ ప్రోత్సాహం?
    ఐటీడీఏ గిరిజన యువతకు ›ట్రైకార్‌ ద్వారా వాహనాలను ఇస్తున్నారు. కానీ వాటిని ప్రభుత్వ కార్యాలయాలకు అద్దె కోసం పెట్టుకోవడం లేదు. పర్సంటేజీలు ఇచ్చే వారికే ప్రాధాన్యత ఇవ్వడం దారుణం. వాహనాల దుర్వినియోగంపై చర్యలు తీసుకోవాలి.
    –పండా రామకృష్ణదొర, డివిజన్‌ సర్పంచ్‌ల సమాఖ్య అధ్యక్షుడు 
                                                                                                         
     
మరిన్ని వార్తలు