అవినీతి చంపేసింది!

18 Aug, 2016 02:24 IST|Sakshi
అవినీతి చంపేసింది!

పై అధికారుల వేధింపులకు కుకునూరుపల్లి ఎస్సై రామకృష్ణారెడ్డి బలి
  పిస్టల్‌తో కణతపై కాల్చుకుని ఆత్మహత్య
  మామూళ్ల కోసం డీఎస్పీ, సీఐ వేధింపులు
మూడు నెలల్లో డీఎస్పీకి రూ.15 లక్షలు, సీఐకి రూ.8 లక్షలు పంపిన ఎస్సై
ఇంకా కావాలంటూ కానిస్టేబుళ్లతో నిఘా
ఆవేదనతో రామకృష్ణారెడ్డి బలవన్మరణం
వేధించిన వారి పేర్లతో ఆరు పేజీల సూసైడ్ నోట్ రాసిన ఎస్సై
శాఖాపరమైన విచారణకు సర్కార్ ఆదేశం


 సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: అవినీతి రక్కసికి ఓ యువ ఎస్సై బలయ్యాడు.. సైనికుడిగా దేశ సరిహద్దుల్లో శత్రువులను ఎదిరించిన రామకృష్ణారెడ్డి.. ధనదాహంతో విషపు కోరలు చాచిన ‘బాస్’లతో గెలవలేక తనువు చాలించారు. లక్షలకు లక్షలు సమర్పించినా..  పైఅధికారులు శాంతించకపోవడంతో చివరకు తన ప్రాణాలనే సమర్పించుకున్నారు. మెదక్ జిల్లా కొండపాక మండలం కుకునూర్‌పల్లి పోలీసుస్టేషన్ లో మంగళవారం అర్ధరాత్రి  ఘటన చోటుచేసుకుంది. ఎస్సై రామకృష్ణారెడ్డి(38) పోలీసు నివాస గృహంలోనే తన సర్వీస్ పిస్టల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన తలలో కుడివైపు నుంచి దిగిన బుల్లెట్ ఎడమ కణత నుంచి బయటకు వచ్చింది. సిద్దిపేట డీఎస్పీ శ్రీధర్, సీఐ వెంకటయ్యలు తనను డబ్బుల కోసం వేధిస్తున్నందునే ఆత్మహత్య చేసుకున్నట్లుగా పేర్కొంటూ సూసైడ్ నోట్ రాసిపెట్టాడు.  గత మూడు నెలల్లోనే డీఎస్పీ శ్రీధర్‌కు రూ.15 లక్షలు, సీఐ వెంకటయ్యకు రూ.8 లక్షలు ఇచ్చానని, ఇంకా అదనపు డబ్బుల కోసం వేధించారని అందులో పేర్కొన్నారు. తనను వేధించిన డీఎస్పీ శ్రీధర్‌తో ఫోన్‌లో మాట్లాడుతూనే రామకృష్ణారెడ్డి పిస్టల్‌తో కాల్చుకోవడం గమనార్హం. రామకృష్ణారెడ్డిని రక్షించుకునేందుకు ఆయన ప్రాణ స్నేహితుడు గజ్వేల్ ఎస్సై కమలాకర్ చేసిన ప్రయత్నం విఫలమైంది.

వసూళ్ల ఒప్పందం: కుకునూరుపల్లి రాజీవ్ రహదారి మీద ఉంటుంది. కరీంనగర్ జిల్లా ఎలగందుల, కొత్తపల్లి, కొదురుపాక, సిరిసిల్ల ఇసుక పారుుంట్ల నుంచి రోజుకు 250 నుంచి 300 వరకు ఇసుక లారీలు ఇదే స్టేషన్  ముందు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తుంటాయని సమాచారం. ఒక్కో లారీ డీఎస్పీకి నెలకు రూ.10 వేలు మామూళ్లివ్వాలి. ఆ లెక్కననెలకు రూ.25 లక్షలు రావాల్సి ఉండగా ఎస్సై రూ.5 లక్షలే ఇస్తున్నాడని డీఎస్పీ కినుక వహించినట్టు తెలుస్తోంది. వాస్తవానికి పాసింగ్ లోడ్ లారీలు మామూళ్లు ఇవ్వడం లేదని, కేవలం ఓవర్ లోడ్ లారీలు మాత్రమే మామాళ్లు ఇస్తున్నాయని.. దాంతో ఆ మేరకే ఎస్సై సొమ్ము పంపుతున్నాడని తెలిసింది. ఇలా వసూలు చేసిన డబ్బును గత మూడు నెలల కాలంలో డీఎస్పీకి రూ.15 లక్షలు, సీఐకి రూ.8 లక్షలు పంపినట్టు ఎస్సై రామకృష్ణారెడ్డి స్వయంగా సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు.

కానిస్టేబుళ్లను ఇన్‌ఫార్మర్లుగా పెట్టుకున్న డీఎస్పీ!
ఎక్కువ డబ్బు వసూలు చేసి తమకు తక్కువగా ఇస్తున్నాడనే అనుమానంతో డీఎస్పీ అదే స్టేషన్ లో పనిచేస్తున్న ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లను, ఇద్దరు కానిస్టేబుళ్లను తన ఇన్ ఫార్మర్లుగా పెట్టుకున్నారు. ఎన్ని లారీలు, వాహనాలు ఆపుతున్నారు.. ఎక్కడెక్కడ డబ్బులు వసూలు చేస్తున్నారో గమనించి చెప్పే పని అప్పగించారు. వారు చెప్పే విషయాల ఆధారంగా తన వాటా తనకు పంపాలంటూ డీఎస్పీ నిత్యం వేధించేవారని తెలుస్తోంది. ఇక డీఎస్పీ ఇన్‌ఫార్మర్లుగా పెట్టిన నలుగురు కూడా రామకృష్ణారెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తూ వివాదాల్లోకి లాగడం, ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేయడం మొదలుపెట్టారు. ఇటీవల గజ్వేల్ మండలం కొడకండ్లలో జరిగిన ఓ బైక్ ప్రమాదంలో ప్రమాదానికి గురైన వాహనాలకు బదులు ఇతర వాహనాలను చేర్చి డబ్బులు వసూలు చేశారని... రెండు నెలల కింద ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న ఇసుక లారీలను పట్టుకున్నా.. డబ్బులు తీసుకుని వదిలేశాడని ఫిర్యాదులు చేశారు. ఇటీవల మల్లన్నసాగర్ ముంపు బాధితులపై గాల్లో కాల్పులు, భాష్పవాయువు ప్రయోగం, లాఠీచార్జి ఘటనకు కూడా ఎస్సైని బాధ్యుడిని చేస్తూ ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే రామకృష్ణారెడ్డి తీవ్ర ఆవేదనకు గురై ఆత్మహత్యకు సిద్ధపడ్డట్లు తెలుస్తోంది.

సూసైడ్ చేసుకుంటున్నా..
‘కమలాకర్.. నేను సూసైడ్ చేసుకుంటున్నా..’ అంటూ తన మిత్రుడైన గజ్వేల్ ఎస్సైకి మంగళవారం అర్ధరాత్రి ఫోన్  చేశారు. దీంతో ఆందోళనకు గురైన కమలాకర్ ‘అలా చేయొద్దు.. ఇప్పుడే అక్కడికి వస్తున్నా’నంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కొద్దిసేపటికే కుకునూర్‌పల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు కూడా. కానీ ఆయన పోలీస్‌స్టేషన్  గేటు తీస్తున్న సమయంలో ఎస్సై రామకృష్ణారెడ్డి క్వార్టర్ నుంచి రివాల్వర్ పేలిన శబ్దం వినబడింది. లోపలికి వెళ్లేసరికి రామకృష్ణారెడ్డి కుడివైపు కణతకు గురిపెట్టి కాల్చుకుని.. రక్తపుమడుగులో పడి ఉన్నారు. రామకృష్ణారెడ్డిని ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించే లోపే తుదిశ్వాస విడిచారు.

ఆరు పేజీల మరణ వాంగ్మూలం
ఘటనా స్థలంలో ఆరు పేజీలకుపైన ఉన్న సూసైడ్ నోట్ లభించింది. అందులో ఎస్పీకి తన బాధను వివరిస్తూ తన చావుకు సిద్దిపేట డీఎస్పీ శ్రీధర్, తొగుట సీఐ రామాంజనేయులు, సిద్దిపేట రూరల్ సీఐ (గతంలో తొగుట సీఐ) వెంకటయ్యలతోపాటు ఏఎస్సై ప్రకాశ్, హెడ్ కానిస్టేబుళ్లు ముత్యం, సంధాని, కానిస్టేబుళ్లు రాజు, యాదవరెడ్డి, నాగిరెడ్డిలు కారణమని పేర్కొన్నారు. వారంతా తనను వేధిస్తున్న తీరును కళ్లకుకట్టినట్లు వివరించారు. తన పైఅధికారులకు మూడు నెలల కాలంలోనే రూ.15 లక్షల వరకు ముట్టజెప్పానని, అరుునా ప్రతి నెలా డబ్బులు కావాలని వేధించారని పేర్కొన్నారు.

ఎన్నో సార్లు ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి
పోలీస్ శాఖలో తనను కొన్నేళ్లుగా వేధిస్తున్నారని రామకృష్ణారెడ్డి కొన్ని నెలలుగా ప్రజాప్రతినిధులను వేడుకున్నారు. ఏదో రకంగా వివాదాల్లో ఇరికించి సస్పెండ్ చేయడానికి సిద్దిపేట డీఎస్పీ శ్రీధర్ కుట్ర పన్నుతున్నాడని, ఇందుకోసం సీఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లతో ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఫిర్యాదు చేశారు. ఇటీవలే మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డినికలసి విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. తాను మాట్లాడి ఈ వ్యవహారాన్ని చక్కదిద్దుతానని ఆయన హామీ ఇచ్చినట్లు సమాచారం. రామకృష్ణారెడ్డి ఆత్మహత్యకు పాల్పడిన రాత్రి 10 గంటల సమయంలో మెదక్ డీసీసీబీ చైర్మన్  చిట్టి దేవేందర్‌రెడ్డి, కొండపాక ఎంపీపీ పద్మ భర్త అనంతుల నరేందర్‌లకు సైతం ఫోన్  చేసి తన బాధను చెప్పుకొన్నట్లు తెలుస్తోంది. బుధవారం ఉదయం ఎస్పీతో మాట్లాడతామని డీసీసీబీ చైర్మన్ భరోసా ఇచ్చినట్లు సమాచారం. కానీ రామకృష్ణారెడ్డి బలవన్మరణానికి పాల్పడడం విషాదాన్ని నింపింది. తన సోదరుడి ఆత్మహత్య విషయం తెలుసుకున్న తహసీల్దార్ లచ్చిరెడ్డి వెంటనే అక్కడికి చేరుకున్నారు. అదే సమయంలో విచారణ పేరుతో అక్కడున్న సిద్దిపేట డీఎస్పీ శ్రీధర్ సూసైడ్‌నోట్‌ను తీసుకోవడానికి ప్రయత్నించారని.. లచ్చిరెడ్డి వారించి తనవద్ద భద్రపర్చుకున్నారని తెలిసింది. ఉన్నతాధికారుల వేధింపుల వల్లే రామకృష్ణారెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడని పేర్కొంటూ.. ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు గజ్వేల్‌లో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. గజ్వేల్-తూప్రాన్  రహదారిపై బైఠారుుంచడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించిపోయింది. చివరకు పోలీసులు ఆందోళనకారులను సముదారుుంచి రామకృష్ణారెడ్డి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేరుుంచారు. బంధువులు బుధవారం మృతదేహాన్ని స్వగ్రామం నల్లగొండ జిల్లా మఠంపల్లి మండలం బక్కమంతులగూడెంకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు.

విచారణ అధికారిగా నిజామాబాద్ ఏఎస్పీ
 రామకృష్ణారెడ్డి ఆత్మహత్యపై ఉన్నతాధికారులు శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. నిజామాబాద్ ఏఎస్పీ ప్రతాప్‌రెడ్డిని విచారణ అధికారిగా నియమించారు. రామకృష్ణారెడ్డి మృతిపై కుకునూరుపల్లి పోలీసుస్టేషన్ లో 174 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. సూసైడ్ నోట్‌లో ప్రస్తావించిన డీఎస్పీ, ఇద్దరు సీఐలు, ఇద్దరు హెడ్‌కానిస్టేబుళ్లు, ఇద్దరు కానిస్టేబుళ్లపై పోలీసులు ఎలాంటి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదు. విచారణ అనంతరం సూసైడ్ నోట్‌లో ప్రస్తావించిన వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు.

ఆర్మీలో పనిచేసి..
 ఆత్మహత్యకు పాల్పడ్డ ఎస్సై రామకృష్ణారెడ్డి స్వస్థలం నల్లగొండ జిల్లా మఠంపల్లి మండలం బక్కమంతులగూడెం. తల్లిదండ్రులు అంజిరెడ్డి, లక్ష్మమ్మ. ఆయన 1996లో పదోతరగతి పూర్తికాగానే కొంతకాలం ఆర్మీలో పనిచేశారు. తర్వాత 2006-07లో డిగ్రీ పూర్తి చేసి.. ఎస్సైగా ఎంపికయ్యారు. హైదరాబాద్‌లోని సుల్తాన్ బజార్, లక్డీకాపూల్, గజ్వేల్, తొగుట పోలీస్‌స్టేషన్లలో ఎస్సైగా పనిచేశారు. 2015 మార్చిలో కొండపాక మండలం కుకునూర్‌పల్లి పోలీస్‌స్టేషన్ కు బదిలీ అయ్యారు. ఆయనకు భార్య ధనలక్ష్మి, కుమారులు శ్రీవర్ధన్ రెడ్డి, ఆశీష్‌రెడ్డి ఉన్నారు. రామకృష్ణారెడ్డి పెద్ద సోదరుడు సోమిరెడ్డి హైదరాబాద్‌లో ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా.. రెండో సోదరుడు లచ్చిరెడ్డి హైదరాబాద్ కలెక్టరేట్‌లో తహసీల్దార్‌గా పనిచేస్తున్నారు.

మరిన్ని వార్తలు