చేయి తడపాల్సిందే !

12 Sep, 2017 13:03 IST|Sakshi

ముడుపులు చెల్లిస్తేనే సబ్సిడీ యూనిట్‌ మంజూరు..?
చుక్కలు చూపిస్తున్న వ్యవసాయ అధికారులు
లేనిపక్షంలో బడ్జెట్‌ లేదంటారు.. క్షేత్రస్థాయిలో ఇబ్బంది పడుతున్న రైతులు
స్థానిక ప్రజాప్రతినిధుల అండతోనే చెలరేగుతున్న అధికార గణం


వ్యవసాయ యాంత్రీకరణ, రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన, గ్రామీణ విత్తన  ఉత్పత్తి వంటి పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోంది. వీటి కోసం రూ.కోట్లలో నిధులు వెచ్చిస్తోంది. వీటికి దరఖాస్తు చేసుకునే రైతులకు కొందరు అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. ముడుపులు చెల్లించిన వారికే ప్రాధ్యానత ఇస్తూ యూనిట్లు మంజూరు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అడిగినంత సమర్పించుకోలేని పక్షంలో ఈ ఏడాది మండలానికి కేటాయించిన బడ్జెట్‌ అయిపోయిందని, వచ్చే బడ్జెట్‌లో చూద్దామంటూ అధికారులు దాటవేస్తున్నారని రైతన్నలు వాపోతున్నారు.

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌ :
జిల్లాలో కొందరు వ్యవసాయశాఖ అధికారుల తీరు విమర్శలకు దారితీస్తోంది. చేయి తడపనిదే రైతులకు సంక్షేమ పథకాల యూనిట్లు మంజూరు చేయ డం లేదనే ఆరోపణలు గుప్పుమంటున్నా యి. వచ్చే నామమాత్ర సబ్సిడీ యూనిట్లకు ముడుపులు చెల్లించడం తప్పనిసరి కావడంతో తమకు ఒరిగేదేంటని  రైతులు వాపోతున్నారు. ముడుపులు ఇచ్చుకోలేని చిన్న, సన్నకారు రైతులకు అసలు యూ నిట్లు మంజూరు కావడం లేదనే విమర్శలున్నాయి. అడిగినంత సమర్పించుకోని పక్షంలో ఈ ఏడాది మండలానికి కేటాయించిన బడ్జెట్‌ అయిపోయిందని, వచ్చే బడ్జెట్‌ లో చూద్దామంటూ దాటవేస్తున్నారని రైతన్న లు వాపోతున్నారు.

ముఖ్యంగా ఆర్మూర్, భీంగల్‌ వ్యవసాయ డివిజన్లలో కొందరు అధికారుల తీరు ఇలా ఉందని తెలుస్తోంది. తమకున్న రాజకీయ పలుకుబడిని వినియోగించుకుని కొందరు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆ శాఖ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. స్థానిక ప్రజాప్రతినిధులకు జీ హుజూర్‌ అంటూ ఎలాగైనా ఉండొచ్చనే ధోరణితో వ్యవహరిస్తుండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.  

జిల్లాను నిజామాబాద్‌ అర్బన్, రూరల్, బోధన్, ఆర్మూర్, భీంగల్‌ మొత్తం ఐదు వ్యవసాయ డివిజన్లుగా విభజించారు. వర్ని, రుద్రూర్, కోటగిరి మండలాలు బాన్సువాడ డివిజన్‌లో ఉన్నాయి. వీటి పరిధిలో అసిస్టెంట్‌ డైరెక్టర్లు, మండల వ్యవసాయశాఖాధికారులు, వ్యవసాయ విస్తీర్ణాధికారులు పని చేస్తున్నారు. ప్రభుత్వం ఈ శాఖ ద్వారా పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. వ్యవసాయ యాంత్రీకరణ, రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన, గ్రామీణ విత్తన  ఉత్పత్తి వంటి పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోంది. వీటి కోసం రూ.కోట్లలో నిధులు వెచ్చిస్తోంది. వీటికి దరఖాస్తు చేసుకునే రైతులకు కొందరు చుక్కలు చూపిస్తున్నారు. బడ్జెట్‌ లేదంటూ దాటవేస్తున్నారు. నిబంధనల ప్రకారం ఆయా పథకాలకు సంబంధించిన బడ్జెట్, యూనిట్ల వివరాలు.., సమాచారం రైతులకు అందుబాటులో ఉంచాలి.

కానీ పారదర్శకత లేకుండా ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో పథకాలు అమలు కావడంతో  చిన్న, సన్నకారు రైతులు ఈ పథకాల ద్వారా లబ్ధి పొందలేకపోతున్నారు. గతంలో ఈ శాఖలో పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడిన అధికారిపై అప్పట్లో శాఖాపరమైన విచారణ జరిగింది. ఈ అవకతవకలు వాస్తవమని తేలడంతో షోకాజ్‌ నోటీసులు జారీ అయ్యాయి. తమకున్న పలుకుబడిని వినియోగించుకుని సదరు అధికారి తనపై తదుపరి చర్యలు లేకుండా చేసుకున్నారన్నది ఆ శాఖలో అప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ అధికారి ఇప్పుడు మళ్లీ తన తీరు మార్చుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై ‘సాక్షి’  జిల్లా వ్యవసాయశాఖాధికారి వాజీద్‌ హుస్సేన్‌ వివరణ కోరగా అలాంటిదేమీ లేదన్నారు. ఎక్కడా రైతుల నుంచి ఫిర్యాదులు రాలేదని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు