సారూ... బతికే ఉన్నా

30 Jun, 2017 14:23 IST|Sakshi
సారూ... బతికే ఉన్నా

► చనిపోయిందని పింఛన్‌ రద్దు చేసిన అధికారులు
► ఇప్పించాలని మహిళ వేడుకోలు


హత్నూర(సంగారెడ్డి): దశాబ్ధకాలంగా పొందుతున్న వితంతు పింఛన్‌  అధికారుల నిర్లక్ష్యం వల్ల రద్దు అయ్యింది. బతికే ఉన్నప్పటికీ  చనిపోయినట్లు ధ్రువీకరించి పింఛన్‌ను రద్దు చేసిన వైనం ఆలస్యంగా వెలుగు చూసింది. హత్నూర మండలం కొన్యాల గ్రామానికి చెందిన గుడ్లు లక్ష్మి (50) అనే మహిళ భర్త మొగులయ్య పదేళ్ల క్రితమే మృతి చెందాడు. నాటి నుంచి ఆమె వితంతు పింఛన్‌ పొందుతోంది. గత మూడు నెలలు నుంచి రాకపోవడంతో అధికారుల చుట్టూ తిరిగినా పింఛన్‌ రాలేదు.

దీంతో బాధితురాలు లక్ష్మి కుటుంబీకులు హత్నూర ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చి విచారించగా లక్ష్మి చనిపోయినందునే పెన్షన్‌ను కొట్టివేసినట్టు అధికారులు చెప్పడంతో ఒక్క సారిగా లక్ష్మి కుటుంబీకులు, బంధువులు అవాక్కయ్యారు. బతికి ఉన్న లక్ష్మిని చనిపోయినట్లు డెత్‌ సర్టిఫికెట్‌ ఎలా ఇచ్చారు?  వితంతు పెన్షన్‌ ఎలా తొలగించారని అ«ధికారులను నిలదీశారు. దీంతో విషయం బయటకు వచ్చింది. బతికి ఉన్న తనను అధికారులు చంపివేశారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తనకు పింఛన్‌ను మంజూరు చేయాలని అధికారులను వేడుకుంది.

విచారణ చేస్తున్నాం
ఈ విషయమై ఎంపీడీఓ ప్రమీల నాయక్‌ను సంప్రదించగా కంప్యూటర్‌ పొరపాటు జరిగిందని , విచారణ చేస్తున్నామని తెలిపారు.  కొన్యాల గ్రామంలో లక్ష్మి అనే మహిళ చనిపోయిందని దీంతో గుడ్లు లక్ష్మి చనిపోయినట్లు పొరపాటును పెన్షన్‌ను తొలగించడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఆమెకు తిరిగి పెన్షన్‌ వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని ఎంపీడీఓ పేర్కొన్నారు.  – ఎంపీడీఓ ప్రమీల నాయక్‌

మరిన్ని వార్తలు