పూర్తయ్యేనా స్వామీ!

30 Jul, 2016 00:44 IST|Sakshi
స్ఫటిక లింగేశ్వర ఆలయం ముందు కొనసాగుతున్న నిర్మాణ పనులు
గద్వాల: కృష్ణా పుష్కరాలకు గడువు సమీపిస్తున్నా.. దేవాదాయశాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న పనులు నత్తనడకన సాగుతున్నాయి. పుష్కరాల కోసం గద్వాల నియోజకవర్గపరిధిలోని పలు ఆలయాలకు ప్రభుత్వం రూ.64లక్షల నిధులు కేటాయించింది. మంజూరైన నిధులతో చేపట్టిన పనులు సైతం నత్తను తలపిస్తున్నాయి. ఈ నిధులతో ఆలయాలన్నింటికీ రంగులు, ఆధునికీకరణ, చలువరాళ్ల ఏర్పాటు, మండపాల ఏర్పాటు, విద్యుదీకరణ, షెడ్ల నిర్మాణం ప్రతిపాదించారు. అధికారులు ఆలస్యంగా టెండర్లు పిలవడంతో పనుల్లో జాప్యం నెలకొంది. బిడ్లు పిలిచి ఒప్పందాలు కుదుర్చుకోవడంలోనే పుణ్యకాలం కాస్త కరిగిపోయింది. ఫలితంగా ఆలయాల పనులు నత్తతో పోటీ పడుతున్నాయి. నెల రోజుల క్రితం ఆలయ నిర్మాణ పనులు చేపట్టారు. అలయాల అభివృద్ధికి, అధికారులు ప్రతిపాదించిన వాటికి, ప్రస్తుతం జరుగుతున్న వాటికి పొంతనలేని పరిస్థితి నెలకొంది. 
 
  •  దివి గ్రామమైన గుర్రంగడ్డలో కొలువైన జమ్ములమ్మ అమ్మవారి ఆలయ మండప నిర్మాణంలో జాప్యం నెలకొంది. రూ.12లక్షల వ్యయంతో నిర్మాణ పనులను చేపట్టారు. ప్రస్తుతం పిల్లర్లు వేసి వదలివేశారు. పుష్కరాలు పూర్తయినా నిర్మాణం పూర్తయ్యే పరిస్థితిలో లేదు. 
  •  నది అగ్రహారంలోని ఆలయాల సముదాయాలకు రూ.20 లక్షలు మంజూరయ్యాయి. వీటితో స్ఫటిక లింగేశ్వర ఆలయం, శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర ఆలయం, రామావధూతల ఆలయాలు, ఆంజనేయస్వామి, సంతాన వేణుగోపాలస్వామి తదితర ఆలయాల మరమ్మతులు కొనసాగుతున్నాయి. స్ఫటిక లింగేశ్వర ఆలయానికి షెడ్ల నిర్మాణం కొనసాగుతోంది. సంతాన వేణుగోపాలస్వామి ఆలయ మండపం పైకప్పు వేశారు. పుష్కరకాలం నాటికి సిమెంట్‌ పనులు మాత్రమే పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది. రంగులు, తదితర ఆధునికీకరణ పనులు ప్రశ్నార్థకంగా మిగిలే అవకాశం ఉంది. 
  •  చింతరేవుల ఆలయ ప్రాంగణంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఆలయ నిర్మాణానికి వేసే చలువరాళ్ల పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఆలయం చుట్టూ పై భాగాన ఆధునికీకరణ పనులు చేపట్టారు. 
  •  జమ్ములమ్మ ఆలయ ప్రాంగణంలో మాత్రమే దాదాపు పనులు పూర్తి కావచ్చాయి. రూ.12లక్షల వ్యయంతో పుష్కర అభివృద్ధి పనులు చేపట్టారు. ఒకటి, రెండు రోజుల్లో పనులు మొత్తం పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 
 
మరిన్ని వార్తలు