దోస్త్‌మేరా దోస్త్‌..

6 Aug, 2016 22:30 IST|Sakshi
దోస్త్‌మేరా దోస్త్‌..
  • అప్యాయతల అనుబంధం...
  • ఏతోడు లేకున్నా.. చేదోడుగా నిలిచేది ‘నేస్తం’
  • సోషల్‌ మీడియాలో సందడి
  • మార్కెట్లో గిఫ్ట్‌లు, ఫ్రెండ్‌షిప్‌ బాండ్‌ల హల్‌చల్‌
  • నేడు ఫ్రెండ్‌షిప్‌ డే 
  • కమాన్‌చౌరస్తా : మనల్ని ఎప్పుడు ప్రేమిస్తూ, అభిమానిస్తూ ఉంటారు... కానీ ప్రేమికులు కారు... ప్రాణంగా, కంటికి రెప్పలా చూసుకుంటారు కానీ... కుటుంబసభ్యులు కారు. జీవితంలోని ఆటుపోట్లు, కష్టాలను కన్నీళ్లలో పాలుపంచుకుంటారు... కానీ రక్తం పంచుకుని పుట్టినవారు కాదు.. వారే మన మేలు కోరే హితులు...స్నేహితులు. తరాలు మారినా... కాలాలు గడిచినా.. ఎల్లలు దాటినా.. అనురాగానికి, అనుబంధానికి అసలైన అర్థం.. ఆప్యాయతకు మరోభావం స్నేహం... కుల,మతాల కతీతంగా విరబూస్తున్న స్నేహంపై ప్రత్యేక కథనం.
     
    మన తల్లిదండ్రులను కూడా ఎంచుకునే వీల్లేని మనకు స్నేహితులను మాత్రం స్వయంగా ఎంచుకునే అవకాశం దేవుడు ప్రసాదించిన అపూరమైన వరం. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమిస్తాడు. తప్పు చేస్తే సరైన దారిలో నడిపిస్తూ మార్గదర్శకుడవుతాడు. ప్రమాదపుటంచుల్లో ప్రాణవాయువు అవుతాడు. ఆపదలో తోడుంటాడు. భయంలో, నైరాశ్యంలో ధైర్యమిస్తుంది స్నేహం. తుది ఊపిరి విడిచేవరకు వెన్నంటే ఉండే మహత్తర బాంధవ్యం స్నేహం.. ప్రపంచమంతా కలిసి ఎదురై వచ్చినా తన స్నేహితుడిని రక్షించేందుకు ప్రాణమివ్వడానికైనా సిద్ధపడుతుంది అసలుసిసలైన స్నేహం.
     
    వాట్సాప్‌ గ్రూపుల్లో సందడే సందడి
    ఫ్రెండ్‌షిప్‌ డే సందర్భంగా రెండు, మూడురోజులనుంచి సోషల్‌మీడియా వాట్సాప్‌లో సందడి మొదలైంది. పాత స్నేహితులందరూ గ్రూప్‌గా అప్యాయతను పంచుకుంటూ స్నేహితులు దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. ఫేస్‌బుక్, వాట్సాఫ్, ట్విట్టర్, హైక్‌ మెసెంజర్, లైన్‌తోపాటు పలు సోషల్‌ మీడియాల్లో ఫ్రెండ్‌షిప్‌ డే సందర్భంగా స్నేహితులకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మధుర క్షణాలను నెమరువేసుకోవడానికి ఆధునిక సాంకేతికతను వాడుకుంటున్నారు. తమ క్లాస్‌మేట్‌లు అందరూ కలిసి వాట్సాప్‌లో ఒకగ్రూప్‌గా ఏర్పడి రోజు టచ్‌లో ఉంటున్నారు. దీనిద్వారా అ‘పూర్వ’ సమ్మేళనాలు జరుపుకుని పాత స్నేహితులను కలుసుకుని సరదాగా పాత జ్ఞాపకాలు నెమరువేసుకుంటున్నారు.
     
    స్నేహానికి.. కానుక
    కానుక మదిలో భావాన్ని వ్యక్తపరిచే అందమైన సాధనం. అనురాగంలోని గాఢతను వెల్లడించే అపురూప మాధ్యమం. అలాంటి కానుక స్నేహితులు పదికాలాలపాటు మదిలో పదిలపర్చుకునేలా ఉండాలని కోరుకుంటూ అందమైన కానుకలను స్నేహితులకు బహుకరించాలని భావిస్తున్నారు. ఈ సందర్భంగా మార్కెట్లో కేకులు, గ్రీటింగ్‌కార్డులు, బాండ్‌లు, వాచ్‌లు, టాయ్స్, సీనరీస్, చాక్లెట్స్, సబ్లినేషన్‌ ప్రింట్‌ ఆర్టికల్స్‌తోపాటు పలు రకాల గిఫ్ట్‌ ఆర్టికల్స్‌ మార్కెట్లో సందడి చేస్తున్నాయి. స్వీట్‌షాపులు స్నేహితుల కోలాహలంతో మారుమోగుతున్నాయి. నగరంలోని పలు బేకరీలలో ఫ్రెండ్‌షిప్‌ డే కేకులు రెyీ గా ఉన్నాయి. 
     
    లిసా నా బెస్ట్‌ ఫ్రెండ్‌
    –మునిఫల్లి ఫణిత, లిసా 
    లిసా నాబెస్ట్‌ ఫ్రెండ్‌. పదేళ్లుగా మేము స్నేహితులం. యూఎస్‌ఏలోని ఆర్కానాస్‌ రాష్ట్రాం, లిటిల్‌రాక్‌ ప్రాంతానికి చెందిన లీసా నాకు ఆత్మీయురాలు. ప్రతీవిషయంలో వెన్నంటి ఉండే నా చెలిమి. స్నేహితులు అందరికీ ఉంటారు. నేను ఇండియా, తను అమెరికా అయినా భాష, దేశంతో సంబంధం లేకుండా మా అనుబంధం కొనసాగుతోంది. స్నేహం కన్నా గొప్పది మరొకటి ఉండదని నా అభిప్రాయం. నేను చేస్తున్న సేవా కార్యక్రమాలలో తన సలహాలు,సూచనలు ఎప్పటికప్పుడు ఇస్తుంది. మన దేశ సంస్కృతి, సంప్రాదాయాలంటే చాలా గౌరవం.
     
     
    స్నేహితులు లేనివారుండరు
    –జె.సాగర్, జి.భరద్వాజ్, ఎం.వెంకటసాయి 
    స్నేహితులు లేని వారు ఎవరుండరు. స్నేహమంటే ఈ లోకంలో చాలా విలువైన బంధం. మేము ముగ్గురం చిన్ననాటి నుంచి అంటే సుమారు  20 ఏళ్లనుంచి స్నేహితులం. తల్లిదండ్రులతో చెప్పుకోని విషయాలు, అనుభూతులు స్నేహితులతో పంచుకుంటాం. ఏటా స్నేహితులు దినోత్సవాన్ని ఘనంగా జరపుకుంటాం. మేమే కాకుండా మా స్నేహితులందరం కలిసి పరస్పరం అభినందనలు తెలుపుకుని స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకుంటాం. 
     
     
     
     
మరిన్ని వార్తలు