ఆయిల్‌ ట్యాంకర్, కళాశాల బస్సు ఢీ

29 Jul, 2016 21:07 IST|Sakshi
  • విద్యార్థులకు స్వల్ప గాయాలు
  • తప్పిన పెను ప్రమాదం
  • ఆర్టీఏ జంక్షన్‌లో ఘటన
  • మామునూరు : వరంగల్‌–ఖమ్మం జాతీయ రహదారిపై వెళ్తున్న ఆయిల్‌ ట్యాంకర్‌ను వెనక నుంచి ఓ కళాశాల బస్సు ఢీకొట్టిన ఘటన నాయిడు పెట్రోల్‌ బంక్‌ సమీపంలోని ఆర్టీఏ జంక్షలో శుక్రవారం ఉదయం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. వరంగల్‌ 5వ డివిజన్‌ బొల్లికుంటలోని వాగ్దేవి ఇంజనీరింగ్‌ కళాశాలకు చెందిన బస్సు హన్మకొండలో సుమారు 30 మంది విద్యార్థులను ఎక్కించుకుని కళాశాలకు బయల్దేరింది. ఈ క్రమంలో వరంగల్‌–ఖమ్మం జాతీయ రహదారిపై నాయుడుపెట్రోల్‌ బంక్‌ సమీపంలో ఆర్టీఏ జంక్షన్‌కు బస్సు చేరుకోగానే ఒక్కసారిగా అదుపు తప్పి డీజిల్‌ ట్యాంకర్‌ను వెనుక నుంచి అతివేగంగా ఢీకొట్టింది.
     
    దీంతో విద్యార్థులు స్వల్పగాయాలతో క్షేమంగా బయటపడ్డారు. ఆయిల్‌ ట్యాంకర్‌ వెనుక భాగం పాక్షికంగా ధ్వంసం కాగా బస్సు ముందుభాగం నుజ్జునుజ్జయింది. దీంతో భయాందోళనకు గురైన విద్యార్థులు అక్కడి నుంచి ఆటోల్లో ఆస్పత్రికి తరలివెళ్లగా మరికొందరు విద్యార్థులు వాహనాలపై కళాశాలకు వెళ్లారు. ఒకవేళ ఈ ప్రమాదంలో నిండుగా ఉన్న డీజిల్‌ ట్యాంకర్‌ గనుక పగిలి ఉంటే పెనుప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు అందోళన వ్యక్తం చేశారు. అకస్మాత్తుగా బస్సు బ్రేక్‌ ఫెయిల్‌ కావడంతోనే అదుపు తప్పిందని డ్రైవర్‌ తెలిపారు. మామునూరు పోలీసులు చేరుకుని ప్రమాద తీరును పరిశీలించారు. ట్రాఫిక్‌ జామ్‌ కాకుండా బస్సు, ఆయిల్‌ ట్యాంకర్‌ను రోడ్డుపై నుంచి తొలగించారు. ఆయిల్‌ ట్యాంకర్‌ డ్రైవర్‌ ఫిర్యాదు మేరకు వాగ్దేవి కళాశాలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాంప్రసాద్‌ తెలిపారు. 
మరిన్ని వార్తలు