ఆ నోట్లు చిత్తు కాగితాలు కాదు

9 Nov, 2016 23:06 IST|Sakshi
- కాటంనేని భాస్కర్, జిల్లా కలెక్టర్‌
సాక్షి ప్రతినిధి, ఏలూరు ః
కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన రూ.500, రూ.వెయ్యి నోట్ల విలువ తగ్గిపోదని, వాటిని మార్చుకునే అవకాశం ఉందని కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ స్పష్టం చేశారు. ఆ నోట్ల మార్పిడి విషయంలో ఎవరూ కంగారు పడాల్సిన పనిలేదన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో బుధవారం ఆయన ’సాక్షి’తో మాట్లాడుతూ పెద్ద నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో అవి దేనికీ పనికిరావనే ప్రచారం జరుగుతోందని, అందులో వాస్తవం లేదని అన్నారు. రూ.500, రూ. వెయ్యి నోట్లను తక్కువకు మారకం చేయవద్దని ప్రజలకు సూచించారు. శుక్రవారం నుంచి అన్ని బ్యాంకుల్లో వీటిని మార్చుకునే  వెసులబాటును ప్రభుత్వం కల్పించిందన్నారు. ప్రతి బ్యాంకులో రెండు కౌంటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఒక కౌంటర్‌లో వారి అకౌంట్‌లో ఎంత మొత్తమైనా జమ చేసుకునే అవకాశం ఉంటుందని, మరో కౌంటర్‌లో బ్యాంకు ఖాతా లేనివారు నిర్దేశిత పత్రంలో సమాచారాన్ని పొందుపరిచి విడతకు రూ.4 వేల చొప్పున మార్చుకునే అవకాశం ఉందని వివరించారు. ఈ నెల 11వ తేది నుండి అన్ని బ్యాంకు ఏటీఎంలు పూర్తి స్థాయిలో పనిచేస్తాయని, ఖాతాదారులు 18వ తేదీ వరకు రోజుకు రూ. 2 వేల చొప్పున, 19వ తేదీ నుంచి రోజుకు రూ.4 వేల చొప్పున ఏటీఎంల ద్వారా నగదు పొందవచ్చన్నారు. బ్యాంకులో ఖాతా ఉండి నగదు పొందదలుచుకున్న ఖాతాదారుడు రోజుకు రూ.10 వేల చొప్పున వారంలో రూ.20 వేలకు మించకుండా నగదు పొందే సౌకర్యం కల్పించారని తెలిపారు. ఈ విధానం 24వ తేదీ వరకూ కొనసాగుతుందని, అనంతరం తదుపరి రిజర్వు బ్యాంకు ఆదేశాలకు అనుగుణంగా నగదు మొత్తాన్ని పెంచే అవకాశాలు ఉన్నాయని వివరించారు. దేశంలో నల్లధనంతోపాటు నకిలీ నోట్ల చలామణిని పూర్తి స్థాయిలో అరికట్టాలనే సదుద్దేశంతో ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలంతా స్వాగతిస్తున్నారన్నారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల రెండు రోజులపాటు కొన్ని సామాన్య ప్రజానీకం ఇబ్బందులు పడతారని, అయితే దేశ భవిష్యత్‌ దృష్ట్యా ఈ నిర్ణయం ఎంతో కీలకమైందని చెప్పారు.
 
బ్లాక్‌ మనీదారుల ఉచ్చులో పడవద్దు
జిల్లాలో కొంతమంది బ్లాక్‌ మనీదారులు తమ నల్లధనాన్ని చలామణిలోకి తీసుకురావడానికి పేదలను పావులుగా వాడుకునే అవకాశాలున్నట్టు సమాచారం అందుతోందని కలెక్టర్‌ పేర్కొన్నారు. పేదలు అలాంటి వారి ఉచ్చులోపడి నల్లధనాన్ని మార్చడానికి ఇస్తే వాటిని తీసుకోవద్దని సూచించారు. దానివల్ల భవిష్యత్‌లో అనేక చిక్కుల్లో పడతారన్నారు. అక్రమ సొమ్మును పేదలకిచ్చి బ్యాంకు ఖాతాలో వేయించి ఆ డబ్బును తిరిగి తీసుకునేందుకు ప్రయత్నిస్తారని, దీనివలన తాత్కాలికంగా కొంత సొమ్ము ముట్టచెబుతారని తరువాత మాత్రం పేదలు ఇబ్బందులు పడతారని అన్నారు. అటువంటి వారికి జిల్లాలో ఏ ఒక్కరూ సహకరించవద్దని కలెక్టరు హితవు పలికారు. 
 
 
 
>
మరిన్ని వార్తలు