వృద్ధురాలి దారుణ హత్య

18 Jun, 2017 23:25 IST|Sakshi
వృద్ధురాలి దారుణ హత్య
సిమెంట్‌ ఇటుకతో తలపై మోదిన వైనం 
జగ్గంపేట : ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలు పప్పుల మంగ (56) జగ్గంపేట శ్రీరామ్‌నగర్‌లో ఆదివారం తెల్లవారు జాము సమయంలో దారుణ హత్యకు గురైంది. నూతనంగా నిర్మించుకున్న ఇంట్లో ఆమెను గుర్తు తెలియని వ్యక్తులు సిమెంట్‌ ఇటుకతో తల, ఇతర శరీర భాగాలపై బలంగా గాయపర్చడంతో ఆమె మృతి చెంది ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. రోజు మాదిరిగా ఇంటి బయట కనిపించకపోవడంతో ఆదివారం సాయంత్రం ఇరుగు పొరుగుకు వారు లోపలకు వెళ్లి చూడగా మంగ చనిపోయి ఉండడాన్ని గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఎస్సై అలీఖాన్, సీఐ కాశీ విశ్వనాథం, సిబ్బంది సంఘటన స్థలానికి వెళ్లి హత్య జరిగిన తీరును పరిశీలించి, స్థానికులను విచారించారు. మంగ నిద్రించిన మంచం ఇరిగిపోయి ఉండడం, సిమెంట్‌ ఇటుకలకు రక్తపు మరకలు, ఆమె శరీరభాగాలపై బలమైన గాయాలు ఉండడంతో పెనుగులాట జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మృతురాలు శ్రీరామ్‌నగర్‌లో ఉన్న ఇంటిని సుమారు రూ.30 లక్షలకు అమ్ముకుంది. అప్పులు తీర్చివేసి, మిగిలిన సొమ్ములో సుమారు రూ.10 లక్షలతో స్థలం కొనుగోలు చేసుకుని నూతనంగా ఇల్లు నిర్మించుకుంది. ఇంటి పనులు పూర్తికావడంతో ప్రభుత్వం ఇచ్చే హౌసింగ్‌ రుణం కోసం ఎదురు చూస్తోంది. కుమార్తె ఇంటి వద్ద భోజనం చేసి రాత్రిపూట కొత్త ఇంటిలో ఒంటరిగా నిద్రిస్తుంది. మృతురాలికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. శ్రీరామ్‌నగర్‌లో వేరే చోట అల్లుడు, కుమార్తె కానూరి దేవి ఉంటుండగా వారి వద్ద కొడుకు ఉంటున్నాడు. ఆమె ఉంటున్న ఇంటి వద్ద సొమ్ములు గాని, బంగారు వస్తువులు కాని లేకపోవడంతో హత్యకు గల కారణాలు వేరే ఏదైనా కారణమవ్వచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని బలభద్రపురం గ్రామానికి చెందిన మంగ శ్రీరామ్‌నగర్‌లో స్థిరపడింది. హత్యకు గల కారణాలను పోలీసులు అన్వేషిస్తుండగా క్లూస్‌టీమ్‌ ఆధారాలను సేకరించింది. పోలీసు జాగిలాన్ని రంగంలోకి దించారు. వివాహేతర సంబంధం కోసం వేరే మహిళకు తన ఇంటి వద్ద ఆశ్రయం ఇస్తుండడంతో ఆమె భర్త ఈ హత్యకు పాల్పడి ఉండవచ్చనే అనుమానాలు కూడా వ్యక్త మవుతున్నాయి. అన్ని కోణాలలో కేసు విచారిస్తున్నామని, మంగది హత్యేనని నిందితుల గురించి సోమవారానికి స్పష్టత వచ్చే అవకాశం ఉందని సీఐ కాశీవిశ్వనాథం, ఎస్సై అలీఖాన్‌ తెలిపారు. అనుమానస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. 
>
మరిన్ని వార్తలు