వృద్ధురాలిని ఇలా కాపాడారు..

13 Oct, 2016 21:00 IST|Sakshi
వృద్ధురాలిని ఇలా కాపాడారు..
* కృష్ణానదిలో దూకి ఆత్మహత్యాయత్నం
పోలీసుల సొంత ఖర్చులతో వైద్యం
 
ప్రకాశం బ్యారేజి (తాడేపల్లి రూరల్‌): కృష్ణానదిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసిన ఓ వృద్ధురాలిని మత్స్యకారులు కాపాడగా... పోలీసులు వెంటనే స్పందింది ఆమెకు తక్షణ వైద్యం అందించి కోలుకునేట్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ప్రకాశం బ్యారేజి కృష్ణానది ఎగువ ప్రాంతం జీరో పాయింటు వద్ద  గురువారం ఓ వృద్ధురాలు నీటిలో దూకింది. ఇది గమనించిన మత్స్యకారులు ఆమెను కాపాడి ఒడ్డుకు చేర్చారు. అనంతరం సమాచారం అందుకున్న తాడేపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి అపస్మారక స్థితిలో ఉన్న ఆ వృద్ధురాలిని వైద్యం నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి సొంత ఖర్చులతో వైద్యం చేయించారు. రెండు మూడు గంటలసేపు ఆ వృద్ధురాలికి∙ సేవలు అందించారు. ఆమె  కోలుకున్న తరువాత వివరాలు అడిగితే చెప్పేందుకు నిరాకరించింది. ఎలాగోలా ఆమెను బతిమిలాడి, భోజనం పెట్టి, బంధువుల వివరాలు అడిగేందుకు పోలీసులు ప్రయత్నించినా వృద్ధురాలు మాత్రం నోరు విప్పలేదు. పేరు కూడా విచిత్రంగా ‘అమ్మోరు’ అని చెప్పిందని అన్నారు. బస్సు టికెట్‌ ఆధారంగా ఆమె బందరు నుంచి వచ్చినట్టు పోలీసులు నిర్ధారించారు. సాయంత్రం వరకు ఆ వృద్ధురాలికి సేవలు అందించిన పోలీసులు  మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు నులకపేటలోని మేరీ హౌస్‌కు తరలించారు.
మరిన్ని వార్తలు