ఎన్నాళ్లీ.. నడకయాతన

24 Jul, 2016 20:18 IST|Sakshi
ఎన్నాళ్లీ.. నడకయాతన

పండుటాకులకు తప్పని పింఛన్‌పాట్లు
ప్రతినెలా కొమ్మాయిగూడెం నుంచి రామన్నపేటకు వెళ్లాల్సిందే..
350మంది లబ్ధిదారులు రానుబోను 5కి.మీ. మేర కాలినడకనే..

కొమ్మాయిగూడెం (రామన్నపేట)
ఆసరా పింఛన్‌ డబ్బులు పొందేందుకు వృద్ధులకు అవస్థలు తప్పడం లేదు. ప్రతినెలా పింఛన్‌ తీసుకునేందుకు వారి పడే కష్టాలు అన్నీఇన్ని కావు. మండలంలోని కొమ్మాయిగూడెం గ్రామానికి చెందిన ఆసరా పింఛన్‌ లబ్ధిదారులే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. పింఛన్‌ డబ్బులు చేతనైనా కాకపోయినా, ఎండైనా వానైనా మండలకేంద్రానికి కాలినడకన వెళ్లి తెచ్చుకోవాల్సిన దుస్థితి వారిది.
     
   కొమ్మాయిగూడెం.. రామన్నపేట మేజర్‌గ్రామపంచాయతీ పరిధిలోని మధిరగ్రామం. మండలకేంద్రానికి 2.5కిలోమీటర్ల దూరం ఉంటుంది. కొమ్మాయిగూడెంలో 400పైగా కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. జనాభా 2,500 వరకు ఉంటుంది. రామన్నపేట మేజర్‌గ్రామపంచాయతీ పరిధిలో మొత్తం 1,035మంది ఆసరాపింఛన్‌ లబ్ధిదారులు ఉన్నారు. వారిలో 329 వృద్ధాప్య, 439 వితంతువులు, 142 వికలాంగులు, 62 గీతకార్మికులు, 63 చేనేతకార్మికులు ఉన్నాయి. ఇందులో సుమారు 350మంది లబ్ధిదారులు కొమ్మాయిగూడెం గ్రామానికి చెందినవారే కావడం గమనార్హం. గ్రామానికి చెందిన ఆసరా పింఛన్‌ లబ్ధిదారులు పింఛన్‌డబ్బులు పొందాలంటే ప్రతినెలా మండలకేంద్రానికి వెళ్లాలి. ఆర్‌అండ్‌బీకి చెందిన బీటీరోడ్డు ఉన్నప్పటీకీ గ్రామం మీదుగా ఆర్టీసీ బస్సులు, ఆటోలు తిరగవు. దీంతో పింఛన్‌దారులు ప్రలినెలా కాలినడకన మండలకేంద్రానికి వెళ్లవలసి వస్తుంది. పింఛన్‌డబ్బులు పొందడానికి రోజంతా పడుతుంది. సాయంత్రందాక తిండిలేక, తాగడానికి నీళ్లు దొరకక తీవ్ర అసౌకర్యారికి గురవుతూ పింఛన్‌ తెచ్చుకుంటన్నామని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. ఇందులో ముఖ్యంగా ఎండాకాలంలో వృద్ధుల పడే బాధలు వర్ణణాతీతంగా మారాయి.
 సీఎస్‌పీని ఏర్పాటుచేయాలని వేడుకోలు
ఆసరా పింఛన్‌ లబ్ధిదారులు, ఉపాధిహామీ కూలీలకు డబ్బులు చెల్లించేందుకు కొమ్మాయిగూడెంలో సీఎస్‌పీ (కమ్యూనిటీ సర్వీస్‌ ప్రొవైడర్‌)ని ఏర్పాటు చేయాలని వామపక్షపార్టీలు, ప్రజాప్రతిని«ధులు అనేక పర్యాయాలు పంచాయతీరాజ్, పోస్టల్‌ అధికారులకు విజ్ఞప్తి చేశారు. అయినా ఆయాశాఖల నుంచి ఎలాంటి స్పందన లేకుండా పోయిందని పలువురు ఆరోపిస్తున్నారు.  

రోజంతా  పడుతుంది –గుర్జాల బాల్‌రెడ్డి
ఈ మధ్యన నాలుగైదు రోజులే పింఛన్లు పంచుతున్నారు. అందరు ఓకేసారి ఎగబడుతున్నారు. మేం నడుచుకుంటూ వచ్చి సీరియల్‌లో పెట్టడం ఆలస్యం అవుతుంది. దీంతో మా వంతువచ్చి పింఛన్‌డబ్బులు తీసుకోవడానికి రోజంతా పడుతుంది.  

సర్కారోళ్లు పుణ్యం కట్టుకోవాలి – శానగొండ ఈశ్వరమ్మ
మా ఊరుమీదుగా బస్సులు ఆటోలు తిరగవు. నడుచుకుంటూనే పోస్టాఫీసుకు వెళ్లి వస్తాం. రానుబోను ఐదారు కిలోమీటర్లు ఉంటుంది. ఆడాడ చెట్లకింద కూర్చూని నడక సాగిస్తాం. సర్కారోళ్లు మా ఊళ్లోనే పింఛన్‌డబ్బులు ఇప్పించి పుణ్యం కట్టుకోవాలి.
 

>
మరిన్ని వార్తలు