-

రుద్రమ్మ కోటలో రాతియుగం నాటి సమాధులు

14 Dec, 2016 22:14 IST|Sakshi
రుద్రమ్మ కోటలో రాతియుగం నాటి సమాధులు
 నిర్ధారించిన పురావస్తు శాఖ
వేలేరుపాడు :
పశ్చిమ గోదావరి జిల్లా వేలేరుపాడు మండలం రుద్రమ్మకోట గ్రామంలో రాతియుగం నాటి సమాధులను పురావస్తు శాఖాధికారులు బుధవారం గుర్తించారు. ఇవి 22 వేల సంవత్సరాలకు పూర్వం నాటి ఆది మానవుల సమాధులని నిర్ధారించారు. వీటిని ’మెగాలితిక్‌ బరియల్స్‌’ అంటారని అధికారులు తెలిపారు. ఆదిమానవుల కాలంలో ఎవరు చనిపోయినా పెద్ద గొయ్యి తీసి.. దానిచుట్టూ రాళ్లు పేర్చి దానిపై పెద్ద బండను మోపేవారని, చనిపోయిన వ్యక్తులకు సంబంధించిన సామగ్రి అంతా అందులోనే పూడ్చిపెట్టేవారని వివరించారు. 15 ఏళ్ల క్రితమే ఈ సమాధులు ఉన్నట్టు గుర్తించామని, వీటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నామని చెప్పారు. వేలేరుపాడు మండలం పోలవరం ప్రాజెక్ట్‌ ముంపు ప్రాంతంలో ఉన్నందున ఈ సమాధులు, వాటి చరిత్ర కనుమరుగు కాకుండా ఉండేందుకు తగిన చర్యలు చేపడతామన్నారు. నీటి పారుదల శాఖ అదికారుల అనుమతి పొంది, వీటి తవ్వకాలు చేపడతామని వివరించారు. రాతి యుగం నాటి సమాధులను పరిశీలించిన వారిలో కాకినాడ పురావస్తు శాఖాధికారులు తిమ్మరాజు, భాస్కర్‌నాయక్‌ , డీవీ సుబ్బారావు ఉన్నారు.
 
మరిన్ని వార్తలు