టీడీపీలో కుట్ర మంటలు

13 Jun, 2017 00:47 IST|Sakshi
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ప్రభుత్వ విప్‌ చింతమనేని ప్రభాకర్‌ హత్యకు కుట్ర చేసిన వ్యవహారం టీడీపీలో మంటలు రేపుతోంది. ఏలూరు, దెందులూరు నియోజకవర్గాలకు చెందిన టీడీపీ శ్రేణుల్లో చీలిక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. టీడీపీ అధికార ప్రతినిధి, వెంకటాపురం మాజీ సర్పంచ్‌ రెడ్డి అప్పలనాయుడుపై టీడీపీ అధిష్టానం విధించిన సస్పెన్షన్‌ ఎత్తివేయకపోతే పార్టీకి 5వేల మంది రాజీనామా చేస్తారంటూ ఆయన వర్గం అల్టిమేటం ఇచ్చింది. చింతమనేని ప్రభాకర్‌ హత్యకు కుట్ర పన్నారంటూ అప్పలనాయుడును పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం విదితమే. ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ కుట్ర పన్ని అప్పలనాయు డును అరెస్ట్‌ చేయించారని మాజీ ఎంపీపీ రెడ్డి అనురాధ అరోపిస్తున్న సంగతి తెలిసిందే. 
 
అండగా ఉండాల్సిందిపోయి కుట్రలా..
ఈ వ్యవహారం అనంతరం టీడీపీలో రెండు వర్గాల వారు రోడ్డెక్కినా పార్టీ అధినాయకత్వం తనకేమీ తెలియనట్టే నటిస్తోంది. అప్పలనాయుడును చింతమనేని కావాలనే ఇరికించారని, కుట్రకు బలైన తమకు అండగా నిలవాల్సింది పోయి చర్యలు తీసుకోవడం ఏంటని ఆయన వర్గం ప్రశ్నిస్తోంది. ఇసుక మాఫియా నేతలకు, పోలీసులపై దాడులకు దిగిన వారికి, ప్రజలపై దౌర్జన్యాలు చేస్తున్న వారికి, అక్రమాలకు పాల్పడుతున్న వారికి పార్టీ అధిషా ్టనం ఎలా కొమ్ము కాస్తోందని వారు ప్రశ్నిస్తున్నారు. అప్పలనాయుడుపై క్రమశిక్షణ చర్యలను వెనక్కి తీసుకుని, అక్రమ కేసులు ఎత్తివేయకపోతే వెంకటాపురం, చుట్టుపక్కల ఉన్న 5వేల మంది కార్యకర్తలు పార్టీకి రాజీనామా చేస్తారని ప్రకటించారు. చింతమనేని, అప్పలనాయుడు వర్గాల మధ్య తలెత్తిన ఈ వివాదంతో ఏలూరు నియోజకవర్గ టీడీపీలో సంక్షోభం తలెత్తింది. దెందులూరు నియోజకవర్గానికీ ఇది పాకింది. 
 
అప్పలనాయుడుకు తూర్పుకాపు సంఘం మద్దతు
మరోవైపు తూర్పు కాపు సంఘం రెడ్డి అప్పలనాయుడుకు మద్దతుగా నిలిచింది. ఆయనపై కక్షసాధింపు చర్యలు ఆపకపోతే తామంతా పార్టీకి దూరమవుతామని ఆ వర్గం నేతలు హెచ్చరిస్తున్నారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి తమకు అండగా ఉన్నారని, ఆయన సాయంతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావును, ముఖ్యమంత్రిని కలిసే ప్రయత్నం చేస్తామంటున్నారు. ఇదిలావుంటే.. చింతమనేని ప్రభాకర్‌ వర్గం దీనిపై ఆగ్రహంగా ఉంది. తమ నేతను హత్య చేయడానికి కుట్ర పన్నిన వారికి ఏలూరు ఎమ్మెల్యే ఎలా అండగా ఉంటారని ప్రశ్నిస్తోంది. దీంతో రెండు నియోజకవర్గాల నేతల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి.  మరోవైపు వెంకటాపురం గ్రామ పంచాయతీలో అక్రమాలపై చర్యలు తీసుకోవాలని పోరాటం చేస్తున్న తనకు  అప్పలనాయుడు నుంచి ప్రాణహాని ఉందంటూ దళిత హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు జిజ్జువరపు జయరాజు జిల్లా ఎస్పీ భాస్కరభూషణ్‌కు సోమవారం విజ్ఞప్తి చేశారు. తన ప్రాణ రక్షణ కోసం తుపాకీ లైసెన్స్‌  ఇప్పించాలని ఎస్పీని కోరారు. 
 
పోలీసులకు తలనొప్పి
చింతమనేని ప్రభాకర్, రౌడీషీటర్‌ జుజ్జువరపు జయరాజు, కోమర్తి మధులను హత్య చేసేందుకు అధికార పార్టీకి చెందిన రెడ్డి అప్పలనాయుడు కుట్ర పన్నిన వ్యవహారం పోలీసులకు తలనొప్పిగా మారింది. ఒక వర్గం రెడ్డి అప్పలనాయుడుపై కఠినంగా వ్యవహరించాలని పోలీసులపై ఒత్తిడి తెస్తుంటే.. మరో వర్గం ఈ కేసు నుంచి అప్పలనాయుడును బయట పడేసేందుకు ప్రయత్ని స్తోంది. ఇరువర్గాల మధ్య తాము నలిగిపోతున్నామని పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పలుసార్లు తుపాకీ లైసెన్స్‌ కోసం చింతమనేని దరఖాస్తు చేసుకున్నా పోలీసులు ఆ అవకాశం కల్పించలేదు. తనకు గన్‌మెన్లు వద్దని, ఎస్కార్ట్‌ కావాలని అడిషనల్‌ డీజీ ఏబీ వెంకటేశ్వరరావును గతంలో చింతమనేని కోరారు. దీనికి సానుకూల స్పందన రాలేదు. ఇప్పుడు హత్యకు కుట్ర పన్నిన వివాదం ముందుకు రావడంతో దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాలి్సన పరిస్థితి ఏర్పడింది. చింతమనేనిపై రౌడీషీట్‌ ఉండటం, అతని వ్యవహార శైలి కారణంగా తుపాకీ లైసెన్స్‌ ఇవ్వడానికి పోలీసు శాఖ అంగీకరించడం లేదు. మరోవైపు రౌడీషీటర్‌ జయరాజు కూడా తనకు తుపాకీ లైసెన్స్‌కావాలని కోరడం గమనార్హం. దీనిపై పోలీసు శాఖ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే. 
 
మరిన్ని వార్తలు