ఊరంతా.. ఒకే గణపతి

13 Sep, 2016 10:40 IST|Sakshi
ఊరంతా.. ఒకే గణపతి
కన్నారం (భీమదేవరపల్లి, కరీంనగర్‌) : గణపతి నవరాత్రోత్సవాలు వచ్చాయంటే చాలు.. గ్రామాల్లో ప్రతి కాలనీలో.. వీధిలో గణపతివిగ్రహాలను పోటీపడిమరీ నెలకొల్పుతుంటారు. ఇది ఎప్పటినుంచో ఆనవాయితీగా వస్తున్న ఆచారం. కానీ.. భీమదేవరపల్లి మండలంలోని కన్నారంలో మాత్రం అందుకు పూర్తిగా విరుద్ధం. ఆ ఊరంతా కలిసి ఒకే విగ్రహాన్ని నెలకొల్పి ఐకమత్యాన్ని చాటుతున్నారు. గతేడాది 10 వినాయక విగ్రహాలను నెలకొల్పిన ప్రజలు.. ఈసారి మాత్రం సర్పంచ్‌ కటుకం సదానందం, ఎంపీటీసీ మల్లం నర్సింహులు నవరాత్రికి ముందే.. (15 రోజుల క్రితం) సమావేశమై గ్రామంలో ఒకే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తీర్మానించారు.

తద్వారా ప్రతిష్ఠాపన, నిమజ్జన ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవచ్చని, గ్రామంలో ఐక్యత ఏర్పడుతుందని పేర్కొన్నారు. దీనికి గ్రామస్తులంతా అంగీకరించారు. అదే గ్రామానికి చెందిన సురేందర్‌రెడ్డి విగ్రహాన్ని అందించేందుకు ముందుకొచ్చారు. పొన్నాల సమ్మయ్య అధ్యక్షతన 25మందితో ఉత్సవ కమిటీని నియమించి వినాయకుడిని గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట ప్రతిష్ఠించారు. ఇప్పుడా వినాయకుడి వద్ద ప్రతిరోజూ పండుగ వాతావరణమే కనిపిస్తోంది. ప్రతిరోజు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తూ స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అన్నదానాలు చేస్తున్నారు. ఇందులో ఊరుఊరంతా భాగస్వామ్యం అవుతోంది. ఈనెల 14న వినాయకుడిని నిమజ్జనం చేస్తామని ఉత్సవ కమిటీ నిర్వాహకులు పేర్కొన్నారు. 
కలిసికట్టుగా నిర్ణయం
గ్రామంలో ఏటా పదికిపైనే వినాయక విగ్రహాలను ప్రతిష్టించేవారు. ఈ ఏడాది అందరం కలిసికట్టుగా  ఒకే విగ్రహా ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నాం. గ్రామస్తులందరూ సహకరించారు. ప్రతిరోజూ ప్రత్యేక పూజల్లో పాల్గొంటున్నారు. రానున్న రోజుల్లోనూ ఇదే ఒరవడిని కొనసాగిస్తాం. 
– కటుకం సదానందం సర్పంచ్‌
 
మరిన్ని వార్తలు