ఆరిపోయిన ఇంటి దీపం

1 Nov, 2016 00:28 IST|Sakshi
ఆరిపోయిన ఇంటి దీపం

సీతారామాపురం(చాపాడు): ఆ యువకులు దీపావళి పర్వదినాన్ని ఆనందంగా జరుపుకోవాలనుకున్నారు. అందరూ కలిసి కుందూనది ఒడ్డున విందు ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత సరదాగా ఈత కొట్టేందుకు నదిలోకి దిగారు. వీరిలో ఓ యువకుడు నీటి గుంతలో ఇరుక్కోగా.. అతన్ని రక్షించేందుకు మరో యువకుడు ప్రయత్నించాడు. ఇద్దరూ నీటిలో గల్లంతయ్యారు.  సోమవారం మధ్యాహ్నం ఓ యువకుడి మృతదేహం లభ్యం కాగా, మరో యువకుడి కోసం గాలింపు కొనసాగుతోంది.  
సెల్ఫీ తీసుకున్నారు.. గల్లంతయ్యారు..
చాపాడు మండలంలోని సీతారామాపురం గ్రామానికి చెందిన ఉండేల శ్రీనాథరెడ్డి, బొర్రా తరుణ్‌రెడ్డి, వీరి తమ్ముళ్లు సురేంద్ర, వంశీలతో పాటు రాజా, సునీల్, సురేష్, లోకేశ్వర్‌రెడ్డి, ప్రసాద్,  చాపాడుకు చెందిన ఉప్పలూరి వినోద్, చియ్యపాడుకు చెందిన ఓంకార్‌లతో పాటు మరొకరు కలసి 12 మంది కుందూనది ఒడ్డున ఆదివారం విందు ఏర్పాటు చేసుకున్నారు. మధ్యాహ్నం 2గంటలకు అందరూ కలిసి భోజనం చేస్తూ ’సెల్ఫీ’ తీసుకున్నారు. తర్వాత నదిలో ఈత కొట్టాలనుకున్నారు. తొలుత ఐదారు మంది నదిలో దిగి అవతలి ఒడ్డుకు చేరుకున్నారు.  ఈ క్రమంలో వరుణ్‌కుమార్‌రెడ్డి ముందు వెళుతుండగా, వెనకాలే వస్తున్న సరిగా ఈత రాని శ్రీనాథరెడ్డి నదిలో ఇరుక్కున్నాడు. దీన్ని గమనించిన వరుణ్‌ స్నేహితుడి కోసం వెనక్కు వెళ్లి రక్షించే క్రమంలో ఇద్దరూ నదిలో గల్లంతయ్యారు. ఒడ్డున ఉండి గమనించిన వీరిద్దరి తమ్ముళ్లు సురేంద్ర, వంశీలు గట్టిగా కేకలు వేశారు. నది అవతలవైపు ఉన్న వారందరూ నదిలోకి వచ్చి గాలించినా ఫలితం లేదు. సోమవారం ఉదయం నుంచి గ్రామస్తులు నదిలో వెతకగా మ«ధ్యాహ్నం 12గంటల ప్రాంతంలో శ్రీనాథ్‌రెడ్డి మృత దేహం కనిపించింది. వరుణ్‌కుమార్‌ రెడ్డి ఆచూకి లభ్యం కాలేదు. చాపాడు ఎస్‌ఐ శివశంకర్‌ కేసు నమోదు చేసుకున్నారు. తహసీల్దార్‌ పుల్లారెడ్డి, వీఆర్వో మాబుహుస్సే పరిస్థితిని ఆరా తీశారు.
ఆ ఇద్దరూ రెండు కుటుంబాల్లో పెద్ద కుమారులే..
నదిలో గల్లంతైన ఇద్దరు యువకులిద్దరూ వారి కుటుంబాల్లో పెద్ద కొడుకులు. ఉండేల రమణారెడ్డి కుమారుడు శ్రీనాథరెడ్డి  మైదుకూరులోని కడప రోడ్డులో సెల్‌ పాయింట్‌ నిర్వహిస్తూ కుటుంబానికి ఆసరాగా ఉన్నాడు. బొర్రు వెంకటేశ్వర్‌రెడ్డి పెద్ద కుమారుడైన   వరుణ్‌కుమార్‌రెడ్డి ఇటీవల ఎంబిఏ పూర్తి చేసుకుని నాలుగు నెలల క్రితమే బెంగళూరులో ఓ సాప్‌్టవేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. దీపావళి పండుగ కోసం స్వగ్రామానికి వచ్చాడు.  వారి తమ్ముళ్ల కళ్ల ముందే వీరు నదిలో గల్లంతు కావడంతో ఆ రెండు కుటుంబాలతో పాటు గ్రామం శోకసంద్రంలో నిండిపోయింది.

మరిన్ని వార్తలు