లాడ్జిలో ఉరేసుకుని ఒకరి ఆత్మహత్య

12 Aug, 2016 23:56 IST|Sakshi
  • మృతుడిది బెల్లంపల్లి మండలం ఆకెనపల్లి
  • గతంలో ప్రేమ పెళ్లి.. హైదరాబాద్‌లో నివాసం
  • 20 రోజులుగా కనిపించకుండా పోయిన వైనం
  • మంచిర్యాలలో ఆత్మహత్య.. అంతుచిక్కని కారణాలు
  • మంచిర్యాల టౌన్‌ : మంచిర్యాల బస్టాండు సమీపంలో గల శివసాయి లాడ్జిలో గురువారం రాత్రి సాన మహేశ్‌(26) అనే వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణ సీఐ సుధాకర్, ఎస్సై వెంకటేశ్వర్లు కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
    ప్రేమించి పెళ్లి చేసుకుని..
    బెల్లంపల్లి మండలం ఆకెనపల్లి గ్రామానికి చెందిన సాన మహేశ్, సోమగూడెం సమీపంలోని బొప్పరపల్లికి చెందిన దాసరి శైలజ ప్రేమించుకున్నారు. 2010 సెప్టెంబర్‌ 10న వీరిద్దరూ కుటుంబసభ్యులను ఎదిరించి, సోమగూడెం పోలీస్‌స్టేషన్లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇరువురి కులాలు వేరు కావడంతో, రెండు కుటుంబాల మధ్య అదే సమయంలో పలుమార్లు పంచాయతీలు జరిగాయి. పోలీసుల సహకారంతో పెళ్లి చేసుకున్న మహేశ్, తన భార్య శైలజను తీసుకుని హైదరాబాద్‌లోని లంగర్‌హౌజ్‌కు వెళ్లిపోయాడు. అక్కడే గదికి అద్దెకు తీసుకుని షేడి అనే ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ జీవిస్తున్నారు. వీరికి పిల్లలు లేరు.
    జూలై 22న కనిపించకుండా పోయి..
    ఇదిలా ఉండగా ఈ ఏడాది జూలై 22న కంపెనీలో పనికి వెళ్లి, రాత్రికి ఇంటికి వస్తున్నానని, తన భార్య శైలజకు సమాచారం ఇచ్చిన మహేశ్‌ కనిపించకుండా పోయాడు. సెల్‌ఫోన్‌ కూడా స్విచ్‌ఆఫ్‌ చేయడంతో, అంతటా వెతికిన భార్య శైలజ అదే నెల 24వ తేదీన వనస్థలిపురం పోలీసులకు తన భర్త కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. దీంతో విచారణ ప్రారంభించిన అక్కడి పోలీసులు మహేశ్‌ సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి ముంబయ్‌ వెళ్లేందుకు టిక్కెట్టు కొన్నట్లుగా సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. కానీ అతను ఎక్కడికి వెళ్లింది అంతుబట్టలేదు.
    మూడు రోజులుగా లాడ్జీలోనే ఉంటూ..
    ఈ నెల 9న మహేశ్‌ మంచిర్యాల పట్టణంలోని శివసాయి లాడ్జిలో ఓ గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. గురువారం రాత్రి అదే గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన మృతి విషయాన్ని తన భార్యకు, మామకు, తన సోదరుడికి చేరవేయాలంటూ వారి ఫోను నంబర్లను రాసిపెట్టి మరీ ఉరేసుకున్నాడు. లాడ్జి నిర్వాహకుల సమాచారం మేరకు పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి, కేసు నమోదు చేశారు. మహేశ్‌ ఇంట్లో వారిని విచారించగా, పెళ్లి జరిగిన నాటి నుంచి తమ ఇంటికి రావడం లేదని చెప్పగా, భార్య శైలజ తమకు ఎలాంటి గొడవలు లేవని, కంపెనీలో అప్పుడప్పుడు అక్కడి వారితో గొడవ పడుతుండేవాడని చెప్పింది. దీంతో దర్యాప్తులో ఆత్మహత్యకు గల కారణాలు తెలుస్తాయని, ఇప్పుడే ఏమి చెప్పలేమని సీఐ తెలిపారు.
మరిన్ని వార్తలు