పుర పన్నులకు ఒకే నోటీసు

29 Apr, 2017 00:41 IST|Sakshi
ఏలూరు (మెట్రో)/తణుకు : నగరాలు, పట్టణాల్లోని పన్ను చెల్లింపుదారులకు వచ్చే వరుస నోటీసులకు ఇకపై కాలం చెల్ల నుంది. ఇప్పటివరకు నీటి పన్నుకు ఒకటి.. ఇంటి పన్ను మరొకటి.. ఖాళీ స్థలాలుంటే ఇంకొకటి చొప్పున మున్సిపాలిటీలు నోటీసులు ఇస్తూ వస్తున్నాయి. మీరు వినోదపు పన్ను పరిధిలోకి వస్తారా అంటూ అడపాదడపా తాఖీదులు సైతం అందుతున్నాయి. ఇకపై ఇలాంటి వరుస నోటీసులకు స్వస్తి పలికి.. అన్నిటికీ కలిపి ఒకే నోటీసు జారీ చేసేందుకు పురపాలక శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఏలూరు నగరపాలక సంస్థ, పురపాలక సంఘాలు, నగర పంచాయతీలకు ఆదేశాలు జారీ చేసింది.
 
ఈ ఆర్థిక సంవత్సరం నుంచే..
నగర, పురపాలక సంఘాల్లో ప్రజలు చెల్లించే పన్నులు వివిధ రకాలుగా ఉంటాయి. తొలుత ఇంటి పన్ను డిమాండ్‌ నోటీసులుజారీ అయ్యేవి. నాలుగైదు రోజుల అనంతరం నీటిపన్ను, ఖాళీ స్థలాల పన్ను, వినోద పన్ను, ప్రకటనల పన్ను నోటీసులు ఒకదాని వెనుక ఒకటిగా వచ్చిపడేవి. దీనివల్ల పన్ను చెల్లింపుదారులు అయోమయానికి, ఆందోళనకు గురవుతున్నారు. ఈ పరిస్థితికి విరుగుడుగా అన్నిరకాల పన్నులకు ఒకే డిమాండ్‌ నోటీసు జారీ చేసేందుకు రంగం సిద్ధమైంది. దీనిని సమీకృత పన్ను విధానం అనే పేరుతో పిలుస్తున్నారు. ఇకపై ఆరు నెలలకు ఒకటి చొప్పున ఏడాదికి రెండు నోటీసులు మాత్రమే ఇస్తారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచే ఈ విధానం అమల్లోకి రాబోతోంది. దీనివల్ల తరచూ నోటీసులు ఇవ్వడం ద్వారా ప్రజలు పడే ఇబ్బందులు తొలగిపోతాయి. మున్సిపల్‌ సిబ్బందికి పనిభారం తప్పుతుంది. మున్సిపాలిటీలకు కాగితం, ప్రింటింగ్‌ ఖర్చులు సైతం ఆదా అవుతాయి.
 
ప్రజలకు ఎంతో ఉపయోగం
నూతన పన్ను విధానం ప్రజలకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. గతంలో విడివిడిగా ఇచ్చే పన్ను నోటీసులను ఒకే నోటీసుగా ఇవ్వడం వల్ల అటు సిబ్బందికి, ఇటు ప్రజలకు ఇబ్బందులు తప్పుతాయి. ఏలూరులో ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చాం. ఈ నెలాఖరు నాటికి ఈ రూపంలో పన్నులు చెల్లిస్తే 5 శాతం తగ్గింపు కూడా ఇస్తున్నాం.
– వై.సాయిశ్రీకాంత్, కమిషనర్, ఏలూరు నగరపాలక సంస్థ 
 
మరిన్ని వార్తలు