ఇక గ్రాట్యుటీ వంతు...

8 Nov, 2015 04:24 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: పీఆర్సీ ప్రకటించి ఇప్పటికి 11 నెలలు కావస్తున్నప్పటికీ ఇందుకు సంబంధించిన జీవోలను జారీ చేయకుండా ఉద్యోగులను ముప్పుతిప్పలు పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు గ్రాట్యుటీ విషయంలో వారికి వెన్నుపోటు పొడవడానికి సమాయత్తమవుతోంది. పదవీ విరమణ చేసిన తర్వాత ఇచ్చే గ్రాట్యుటీ గరిష్ట పరిమితిని రూ.8 లక్షల నుంచి రూ.12 లక్షలకు పెంచాలని పదో పీఆర్సీ సిఫారసు చేయగా, దాన్ని రూ.10 లక్షలకే పరిమితం చేయడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రతిపాదనలు రూపొందించినట్లు సమాచారం.

గ్రాట్యుటీ గరిష్ట పరిమితిని రూ.10 లక్షలకు పరిమితం చేస్తూ రూపొందించిన ఫైలును రహస్యంగా ఉంచారని, సంబంధిత సెక్షన్‌లో కిందిస్థాయి అధికారులకు సైతం తెలియనీయకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిసింది. పీఆర్సీ సిఫారసుకు భిన్నంగా గరిష్ట పరిమితిని తగ్గిస్తే.. ఉద్యోగుల నుంచి నిరసన వ్యక్తమయ్యే అవకాశం ఉందని, ప్రభుత్వంపైన ఒత్తిడి పెరుగుతుందని, అందుకోసమే రహస్యంగా ఫైలును రూపొందించారని విశ్వసనీయ వర్గాలద్వారా తెలిసింది.

 రూ.15 లక్షలకు పెంచాలని ఉద్యోగుల డిమాండ్
 పదో పీఆర్సీ సిఫారసు ప్రకారం కనీస మూలవేతనం రెట్టింపయిన నేపథ్యంలో రిటైర్‌మెంట్ గ్రాట్యుటీ గరిష్ట పరిమితిని రూ.15 లక్షలకు పెంచాలని ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది.

 అదనపు పెన్షన్‌కు అనుమతించని సర్కారు
  గ్రాట్యుటీకి కోత వేయడానికి సిద్ధమైన ప్రభుత్వం.. పెన్షనర్ల సంక్షేమానికీ కోత పెట్టనుంది. 70 ఏళ్లు నిండిన పెన్షనర్లకు 15 శాతం అదనపు పెన్షన్ ఇవ్వాలని పదో పీఆ ర్సీ సిఫారసు చేసింది. దీన్ని ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఫిట్‌మెంట్ ప్రకటించిన సమయంలో.. ఈ సిఫారసును పరిగణనలోకి తీసుకోకుండానే పింఛనర్లకు పెన్షన్‌ను ఖరారు చేసిన విషయం విదితమే. పీఆర్సీ నివేదికను పూర్తిగా అమలు చేసే సమయంలోనూ ఈ సిఫారసును పరిగణనలోకి తీసుకోకూడదనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు సమాచారం.

 గ్రాట్యుటీ అంటే..: ఉద్యోగి పదవీ విరమణ ప్రయోజనాల్లో గ్రాట్యుటీ ముఖ్యమైనది. ఉద్యోగి ఒక సంవత్సరం సర్వీసు కాలానికి 15 రోజుల జీతాన్ని గ్రాట్యుటీగా ఇస్తారు. ఉదాహరణకు ఒక ఉద్యోగికి 30 సంవత్సరాల సర్వీసు ఉంటే.. 15 నెలల జీతాన్ని గ్రాట్యుటీగా చెల్లిస్తారు. అయితే దీనికి గరిష్ట పరిమితి ఉంటుంది. గరిష్ట పరిమితి ప్రస్తుతం రూ.8 లక్షలు ఉంది. అంటే.. గ్రాట్యుటీ గణింపు సూత్రం ప్రకారం రూ.8 లక్షలు దాటినా, ఉద్యోగికి రూ.8 లక్షలే చెల్లిస్తారు. ఈ పరిమితిని రూ.12 లక్షలకు పెంచాలని పీఆర్సీ సిఫారసు చేసింది. ఈ మేరకు పెంచినప్పటికీ.. సగటు ఉద్యోగి గ్రాట్యుటీ ఈ పరిమితిని దాటుతుంది. దాన్ని రూ.10 లక్షలకే పరిమితం చేస్తే.. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల్లో దాదాపు అందరూ నష్టపోక తప్పదు.

>
మరిన్ని వార్తలు