ఒక భార్య.. ఇద్దరు భర్తలు

9 Jan, 2017 21:25 IST|Sakshi
 
  • తాడేపల్లిలో 'విచిత్ర ప్రేమాయణం’
  •  తలలు పట్టుకుంటున్న పోలీసులు  
 
మహానాడు (తాడేపల్లి రూరల్‌): పట్టణ పరిధిలోని మహానాడు 5వ లైనులో నివాసం ఉండే వివాహిత భర్తతోపాటు మరో యువకుడితో బంధం ఏర్పాటు చేసుకుని ఆస్తిలో తనకూ హక్కు ఉందంటూ సోమవారం యువకుడి ఇంటికి వెళ్లి గలాటా చేయడంతో యువకుడి బంధువులు ఆ వివాహితను ఇంట్లో నుంచి బయటకు నెట్టివేశారు. దాంతో సదరు యువతి తన అత్తగారింటికి తాను వెళితే, రానీయకుండా బయటకు నెట్టేశారని పోలీసులను ఆశ్రయించింది. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన 'ఒక భార్యా– ఇద్దరు భర్తల' పంచాయితీ మధ్యాహ్నం 3 గంటల వరకూ సాగింది. పోలీసులు సైతం ఏదో గలాటా జరిగిందని, యువకుడి బంధువులను పోలీసు స్టేషన్‌కు పిలిపించి అడిగితే, అసలు విషయాలు బయటపడ్డాయి. భర్త, మూడేళ్ల కుమారుడితో కలిసి ఉండే యువతి అదే ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్‌తో అక్రమ సంబంధం ఏర్పాటు చేసుకుంది. భర్త శబరిమల వెళ్లడంతో, మీ అబ్బాయిని నేను పెళ్లి చేసుకున్నానంటూ యువకుడి (ఆటో డ్రైవర్‌) ఇంటికి వెళ్లి, నాకు కూడా ఈ ఇంటిలో నివసించే హక్కు ఉందంటూ గలాటా చేసింది. ఆటో డ్రైవర్‌ బంధువులు యువతి భర్తతో ఫోనులో మాట్లాడి, నీ భార్య గొడవ చేస్తుంది, ఏం చేయమంటావు? అని అడిగితే, నా భార్యను మీరేమీ అనవద్దు, జరిగిన విషయం నాకు ముందే తెలుసు, అయినా సరే పర్వాలేదు, మేము ముగ్గురం కలిసే ఉంటాం, అని చెప్పడంతో యువకుడి తల్లిదండ్రులకు ఏం చేయాలో అర్థంకాక తలలు పట్టుకున్నారు. ఆటో డ్రైవర్‌ బంధువులకు పోలీసులు తమదైన శైలిలో ఆ యువతిని మీరేమైనా అంటే జైలు పాలవుతారు, మీ అబ్బాయిని నాకు సంబంధం లేదని చెప్పమని, సూచించారు. సదరు ఆటో డ్రైవర్‌ మాత్రం ఆ యువతి లేకపోతే తాను బతకలేనంటూ పోలీసుల కాళ్లా వేళ్లా పడి బతిమిలాడడం విశేషం. పోలీసులు కేసు ఎలా పరిష్కరించాలో అర్థం కాక, యువతి భర్త వచ్చిన తరువాత మాట్లాడదామంటూ, అప్పటి వరకు వారిని కలిసే ఉండనీయమంటూ పంపివేశారు.
 
 
 
 
మరిన్ని వార్తలు