ఓఎన్‌జీసీ జీసీఎస్‌ ముట్టడి

29 Aug, 2016 22:08 IST|Sakshi
ఓఎన్‌జీసీ జీసీఎస్‌ ముట్టడి
  • గొల్లపాలెంలో సంస్థ కార్యకలాపాల అడ్డగింత
  • గ్రామాన్ని దత్తత తీసుకోవాలని ధర్నా
  • చర్చలు విఫలం, రిలే దీక్షలు ప్రారంభం
  • గొల్లపాలెం (మలికిపురం) : 
    తమ ప్రాంతం నుంచి చమురు నిక్షేపాలను తరలించుకుపోతున్న ఓఎన్జీసీ తమ గ్రామాభివృద్ధికి ఏమాత్రం సహకరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోమవారం గొల్లపాలెంలోని జీసీఎస్‌ వద్ద గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. సుమారు 25 ఏళ్లుగా గ్రామంలో జీసీఎస్‌ ద్వారా చమురు, సహజవాయువు ఉత్పత్తులను తరలించుకుపోతున్న ఆ సంస్థ.. గ్రామాభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. కోట్లాది రూపాయల విలువైన ఆయిల్, క్రూడాయిల్‌ను తరలించుకుపోతున్న ఓఎన్‌జీసీ ఈ గ్రామాన్ని తక్షణమే దత్తత తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఏటా రూ.3 కోట్ల చొప్పున గ్రాంట్‌ ఇవ్వాలని, గ్రామంలో నిరుద్యోగులకు స్థానిక జీసీఎస్‌లో 50 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పారు. కార్పొరేట్‌ ప్రమాణాలతో గ్రామంలో 20 పడకల ఆస్పత్రిని నెలకొల్పాలని కోరారు. గ్రామంలో పాడైన రోడ్లను పునర్నిర్మించాలని డిమాండ్‌ చేశారు. ఆందోళనకు రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు సంఘీభావం తెలిపారు. రాజమహేంద్రవరం నుంచి వచ్చిన ఓఎన్‌జీసీ అధికారులు.. ఎమ్మెల్యే, ఆందోళనకారులతో చర్చించారు. గ్రామస్తుల డిమాండ్లను ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళతామని, మూడు రోజుల గడువు ఇవ్వాలని కోరారు. ఉన్నతాధికారులు వచ్చే వరకూ ఇక్కడే బైఠాయిస్తామని ఆందోళనకారులు భీష్మించారు. గ్రామానికి చెందిన అనేక మంది రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఆందోళనకారులతో ధవళేశ్వరం సాగునీటి ప్రాజెక్టు కమిటీ చైర్మన్‌ భూపతిరాజు ఈశ్వరరాజు వర్మ, ఏఎంసీ చైర్మన్‌ కాండ్రేగుల బీవీ సత్యనారాయణ, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యుల పాల్గొన్నారు. ఈ ఆందోళనతో సోమవారం సుమారు లక్ష లీటర్ల క్రూడాయిల్‌ సరఫరా నిలిచిపోయింది. ఆందోళన నేపథ్యంలో రాజోలు సీఐ జీవీ కృష్ణారావు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
     
     
మరిన్ని వార్తలు