పెరిగిన ఉల్లి సాగు విస్తీర్ణం

16 Aug, 2016 19:13 IST|Sakshi
పెరిగిన ఉల్లి సాగు విస్తీర్ణం

వేముల :ఈ ఏడాది ఉల్లి సాగు గణనీయంగా పెరిగింది. పులివెందుల నియోజకవర్గంలో 2650 ఎకరాలకుపైనే ఉల్లి సాగైంది. సాగుకు పెట్టుబడులు అధికమైనా.. ఆశాజనకంగా ధరలు ఉంటాయనే నమ్మకంతో ఉల్లిపైనే దృష్టి పెట్టి సాగు చేశామని రైతులు అంటున్నారు. కాగా నియోజకవర్గంలో వేముల మండలంలోనే ఉల్లి సాగు ఎక్కువగా సాగైంది. మామూలుగా ఉల్లిని మే నెలలోనే రైతులు సాగు చేస్తారు. అయితే ఈ ఏడాది ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటంతో సాగుకు అనుకూలించలేదు. సాగు చేసినా.. అధిక వేడికి ఉల్లి మొలక రాకపోతే నష్టపోతామని రైతులు సాగుకు ఆలస్యం చేశారు. దీంతో జూన్‌ నెలలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉల్లి పంటను రైతులు సాగు చేసుకున్నారు. అంతేకాక గత ఏడాది తుఫాన్‌ ప్రభావంతో నవంబరు నెలలో కురిసిన వర్షాలకు వాగులు, వంకలు ప్రవహించాయి. దీని ప్రభావంతో బోర్లలో భూగర్భజలాలు ఉండటంతో వ్యవసాయ బోర్ల కింద ఉల్లి పంటను సాగు చేశారు.
పెరిగిన విస్తీర్ణం :
గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది 20శాతం మేర ఉల్లి సాగు పెరిగింది. గత ఏడాది 2150 ఎకరాల్లో సాగైతే.. ఈ ఏడాది 2650ఎకరాల్లో సాగైంది. పంట కాలం ఎక్కువైనా రైతులు ఉల్లి సాగుకే మొగ్గు చూపారు. గత ఏడాది ముందుగా ఉల్లి సాగు చేసుకున్న రైతులు అధిక ఆదాయం పొందారు.  ఎకరాకు రూ.3లక్షల నుంచి రూ.5లక్షల వరకు ఆదాయం వచ్చింది. అందుకే ఈ ఏడాది కూడా కొంతమంది రైతులు ముందస్తుగానే అనుకున్న సమయానికి దిగుబడులు వచ్చేలా సాగు చేసుకున్నారు.
పెట్టుబడులు అధికమైనా.. :
ఉల్లి సాగులో పెట్టుబడులు ఎక్కువైనా.. సాగుకు రైతులు వెనుకాడలేదు. సాగు చేసే సమయంలో ఎకరాకు రూ.10వేలకుపైనే పెట్టుబడులు అవుతున్నాయి. అలాగే ఉల్లిలో దిగుబడులు చేతికొచ్చేవరకు పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. ఉల్లి ఎక్కువగా నీటి తడులు అందించాల్సి రావంతో గడ్డి ఎక్కువగా ఉంటుంది. ఇందుకోసం కూలీల ఖర్చు తడిసి మోపెడవుతోంది. పంట కాలం 6నెలలు కావడంతో పంటను పీకివేసే వరకు కలుపు తీయాల్సి ఉంటుంది. అంతేకాక అదనంగా ఎరువులు వేయడంతో పెట్టుబడులు పెరిగిపోతున్నాయని రైతులు అంటున్నారు.
ఆశాజనకంగా ధరలు ఉంటాయని.. :
దిగుబడులు చేతికందే సమయానికి ఆశాజనకంగా మార్కెట్‌ ధరలు ఉంటాయనే ఉల్లి సాగు చేశామని రైతులు అంటున్నారు. దీంతో పెట్టుబడులు అధికమవుతున్నా రైతులు వెనుతిరిగి చూడలేదు. అంతేకాక సాగులో దిగుబడులు తగ్గినా ధరలతో మంచి ఆదాయం ఉంటుందని రైతులు భావిస్తున్నారు.
భూగర్భజలాలు ఉండటంతోనే.. :
ఈ ఏడాది బోర్లల్లో భూగర్భజలాలు ఉండటంతో ఉల్లి సాగు పెరిగింది. సాగులో దిగుబడులు వచ్చే సమయానికి ధరలు ఉంటాయని రైతులు భావిస్తున్నారు. దీంతోనే నియోజకవర్గంలో ఉల్లి సాగు గణనీయంగా పెరిగింది. గత ఏడాదితో పోల్చుకుంటే 20శాతం మేర ఉల్లి సాగు పెరిగింది.– రాఘవేంద్రారెడ్డి(హెచ్‌వో), పులివెందుల .

>
మరిన్ని వార్తలు