పెళ్లి పేరుతో ఆన్‌లైన్ మోసం

18 Jun, 2016 18:18 IST|Sakshi
పెళ్లి పేరుతో ఆన్‌లైన్ మోసం

పెనమలూరు: పెళ్లి చేసుకోవాలని ఓ యువతి తన వివరాలు ఓ వెబ్‌సైట్‌లో ఉంచింది. దీనిని ఆసరాగా చేసుకుని ఓ యువకుడు తాను ఆస్ట్రేలియాలో ఉంటానని, పెళ్లి చేసుకుంటానని ఆన్‌లైన్‌లోకి వెళ్లి నమ్మించాడు. అనంతరం ఆమె నుంచి సుమారు రూ. 15 లక్షలు స్వాహా చేశాడు.

 పెనమలూరు సీఐ దామోదర్ తెలిపిన వివరాల ప్రకారం  కానూరుకు చెందిన ఓ యువతి వివాహం చేసుకోవాలని గత ఏప్రిల్‌లో భారతి మేట్రోమోని వెబ్‌సైట్‌లో తన వివరాలు ఉంచింది. డామ్‌నిక్ సంజయ్ అనే వ్యక్తి ఆన్‌లైన్‌లో ఆమె వివరాలు తెలుసుకుని ఆమెతో మాట్లాడాడు. తాను ఆస్ట్రేలియాలో ఉంటానని, మంచి ఉద్యోగం చేస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించాడు. పెళ్లికి అయ్యే ఖర్చు భరించే స్థోమత తన వద్ద లేదని యువతి తెలుపగా తాను రూ. 50 వేల డాలర్లు పంపుతానని, పెళ్లి ఏర్పాట్లు చేయాలని కోరాడు. సొమ్ము బార్సిలీ బ్యాంకు ద్వారా పంపుతానని నమ్మించాడు.

 కొద్ది రోజులకు బార్సిలీ బ్యాంకు ఢిల్లీ శాఖ నుంచి ఆమెకు ఫోన్ వచ్చింది. రూ. 50 వేల డాలర్లు మీ పేరున వచ్చాయని, మనీ ట్రాన్సఫర్ ఫీజు చెల్లించాలని చెప్పారు. దీంతో ఆమె రూ 1,26,300లను బ్యాంకు ఎకౌంట్‌కు జమ చేసింది. మరలా బ్యాంకు నుంచి కొద్ది రోజులకు ఫోన్ వచ్చింది. ఇన్‌కంట్యాక్స్ కింద రూ.1,65,500,  బ్యాంక్ అప్రూవల్‌కు రూ. 5,10,820, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిత్వ శాఖ నుంచి క్లియరెన్స్‌కు రూ. 2.50 లక్షలు, మరో డిపాజిట్ కింద రూ. 2,99,100, ఇతర ఖర్చులకు మిగిలినవి కలిపి మొత్తం రూ. 15లక్షలను ఆమె జమ చేసింది. ఆ తరువాత బ్యాంకు నుంచి కాని, డామినిక్ సంజయ్ నుంచి కాని ఎటువంటి ఫోన్ రాకపోవడంతో యువతికి అనుమానం వచ్చి సంజయ్‌కు ఫోన్ చేయగా ఫోన్ పలకలేదు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ దామోదర్ దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు