ఆర్టీఏలో ఆన్‌లైన్‌

12 Dec, 2016 15:06 IST|Sakshi
ఆర్టీఏలో ఆన్‌లైన్‌

– చిల్లరనోట్లు ఉన్నా ఇబ్బందిపడ్డ వాహనదారులు
– అధికారుల హడావుడి నిర్ణయాలే కారణమంటూ ఆవేదన

అనంతపురం సెంట్రల్‌ : రోడ్డు రవాణాశాఖ అధికారులు తీసుకున్న హడావుడి నిర్ణయాల వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. శుక్రవారం నుంచి నగదు రహిత లావాదేవీలు చేపట్టాలని ఉన్నఫలంగా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం వాహనదారులకు కాదు కదా.. అశాఖలో పనిచేసే చిన్నస్థాయి ఉద్యోగులకు కూడా తెలియక పోవడం గమనార్హం. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వాహన రిజిస్ర్టేషన్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఇతర సమస్యలపై వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.  చిల్లర నోట్లు తెచ్చుకున్నా అధికారులు తీసుకోకపోవడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

వివరాలు.. రోడ్డు రవాణాశాఖలో(ఆర్టీఏ) డ్రైవింగ్‌ లైసెన్స్, రిజిస్ట్రేషన్, వాహనాలకు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్స్, అపరాధ రుసుం చెల్లించేందుకు రోజూ వందల మంది వస్తుంటారు. కేంద్ర ప్రభుత్వం  రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేసిన తర్వాత చిల్లర సమస్య తీవ్రంగా ఏర్పడింది. కొద్ది రోజుల క్రితం విజయవాడ నుంచి రవాణశాఖ అధికారులు స్వైప్‌ మిషన్‌ తెప్పించారు. గురువారం వరకూ అకౌంట్లలో డబ్బు ఉన్న వాహనదారులు స్వైప్‌ మిషన్‌ ద్వారా,  చిల్లర నోట్లు ఉన్న వాహనదారులు చలానా కోసం నేరుగా డబ్బు చెల్లించేవారు. దీంతో రవాణాశాఖలో ఎలాంటి సమస్య ఉత్పన్నం కాలేదు. శుక్రవారం మాత్రం అన్ని లావాదేవీలు నగదు రహితంగా స్వైప్‌ మిషన్‌ ద్వారా చేపట్టాలని నిర్ణయించారు. రవాణాశాఖలో నేరుగా డబ్బులు తీసుకోరనే అంశం ప్రజలకు తెలియపర్చలేదు. కనీసం పత్రికా ప్రకటన కూడా విడుదల చేయలేదు. ఉన్నట్లుండి శుక్రవారం ఉదయం డబ్బులు తీసుకోం.. అని చెప్పేసరికి వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. కొంతమంది నిరాశతో వెనుతిరగగా.. మరికొందరు దగ్గర్లో తెలిసిన వ్యక్తులు ఉంటే వారి ఖాతాల నుంచి చాలానాలు చెల్లించారు.
ఇక్కడకు వచ్చాక చెప్పారు

    బొలెరో వాహనానికి ఫిట్‌నెస్‌ సర్టిఫికేషన్‌ కోసం కార్యాలయంకు వచ్చా. ఇక్కడికొచ్చాక డబ్బులు తీసుకోమని చెబుతున్నారు. దీంతో దగ్గర్లో తనకు తెలిసిన వారు ఉంటే వారి అకౌంట్‌ నుంచి నగదు చెల్లించాను. ముందస్తుగా తెలియజేయకుండా నిర్ణయం తీసుకోవడంతో చాలా మంది వెనక్కుపోయారు. -  : అయూబ్‌ఖాన్, పేరూరు, రామగిరి మండలం

ముందుగా చెప్పలేదు
ఆటోకు జరిమానా వేశారు. డబ్బులు చెల్లించి ఆటోను విడిపించుకుందామని వస్తే డబ్బులు తీసుకోలేదు. దీంతో గుత్తి నుంచి నా అల్లుడుని రమ్మని చెప్పా. అధికారులు ముందుగా చెప్పకుండా నిర్ణయం తీసుకోవడం వలన ఒక పనికి రెండు పనులు అయ్యాయి. - మహ్మద్‌వలి, ఆటోడ్రైవర్, గుత్తి

ప్రభుత్వ ఆదేశాల మేరకే
నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలని ప్రభుత్వం, కలెక్టర్‌ నుంచి ఉత్తర్వులు వచ్చాయి. ఆ ఆదేశాల అనుసరించి శుక్రవారం నుంచి నగదు రహిత లావాదేవీలు చేపట్టాం. తాత్కాలికంగా ఇబ్బంది పడ్డా .. భవిష్యత్‌లో చిల్లర నోట్ల సమస్య పరిష్కారం అవుతుంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సమస్యలు పరిష్కరించాం.-  : శ్రీధర్, ఆర్టీఏ, అనంతపురం

>
మరిన్ని వార్తలు