గడ్డికీ... ఆన్‌లైన్‌...!!

2 Aug, 2017 22:44 IST|Sakshi
గడ్డికీ... ఆన్‌లైన్‌...!!

– రాయితీ గడ్డి కావాలంటే ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు
– కొత్త యాప్‌ తయారీలో నిమగ్నమైన పశుసంవర్ధకశాఖ

అనంతపురం అగ్రికల్చర్‌: రాయితీపై గడ్డికావాలనుకునే రైతులు ఇక నుంచీ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. తొలిసారిగా అనంతపురం జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ఆ విధానం అమలు చేయనుంది. డైరెక్టరేట్‌ నుంచి పశుసంవర్ధకశాఖకు రెండు రోజుల కిందట ఉత్తర్వులు అందాయి. ఈ క్రమంలో రాయితీతో పశుగ్రాసం పంపిణీకి కొత్త యాప్‌ సిద్ధం చేసేలో అధికారులు నిమగ్నమయ్యారు.  ఆన్‌లైన్‌ విధానంలో ఈ ఏడాది రైతులకు సైలేజ్‌ బేల్స్‌ (మాగుడి గడ్డి), దాణామృతం (టీఎంఆర్‌–టోటల్‌ మిక్స్‌డ్‌ రేషన్‌) పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు. సైలేజ్‌ బేల్స్‌ రాయితీ పోనూ కిలో రూ.2 ప్రకారం, టీఎంఆర్‌ గడ్డి రాయితీ పోనూ కిలో రూ.3.50 ప్రకారం రైతులు చెల్లించాల్సి ఉంటుంది.

ఆన్‌లైన్‌ పద్ధతి ఎలా అంటే...
గడ్డి అవసరమైన రైతులు మొదట పశువైద్యాధికారిని సంప్రదించి అక్కడ ఆన్‌లైన్‌లో పేరు, ఊరు, పశువుల వివరాలు, ఫలానా కంపెనీ నుంచి గడ్డి కావాలని నమోదు చేయాల్సి ఉంటుంది. అదే సమయంలో కంపెనీ గడ్డి నిల్వలు ఎంత ఉంది, ఎప్పటిలోగా సరఫరా చేసే అవకాశం ఉందని, ఎంత చెల్లించాలనే సమాచారం రసీదు రూపంలో ఇస్తారు. రసీదును తీసుకెళ్లి మీ–సేవా కేంద్రంలో డబ్బులు చెల్లిస్తే... డబ్బు కట్టిన వివరాలు పశువైద్యాధికారికి, కంపెనీకి వెళుతుంది. అంతా అయిన తర్వాత వారం లేదా పది రోజుల్లోగా రైతులకు గడ్డి అందుతుంది. దీనికి సంబంధించి కొత్త యాప్‌ సిద్ధం చేయగా, ఇప్పటికే పశువుల ఆస్పత్రుల్లో ఇన్‌స్టాల్‌ చేశారు.  రేపోమాపో మీ–సేవా కేంద్రాలకు అందజేయనున్నట్లు తెలుస్తోంది. కాగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులపై రైతులు పెదవి విరుస్తున్నారు. సర్వర్‌ సమస్యలు, ఆస్పత్రులు, మీ–సేవా కేంద్రాలకు నాలుగైదు సార్లు తిరగాల్సిన పరిస్థితి ఉందంటున్నారు. అంతేకాకుండా ఒకరిద్దరు రైతులకు సరఫరా చేయడం ఖర్చుతో కూడుకున్నదనీ, గ్రామం లేదా పరిసర గ్రామాల నుంచి కనీసం ఒక లారీకి సరిపడా గడ్డి ఇండెంట్‌ ఉంటే కాని సరఫరా చేసే పరిస్థితి లేదంటున్నారు.

మరిన్ని వార్తలు