రేషన్‌ దుకాణాల్లో ’నగదు రహితం’

4 Jan, 2017 22:31 IST|Sakshi
రేషన్‌ దుకాణాల్లో ’నగదు రహితం’
జిల్లాలో 1,932 షాపుల్లో అమలు
జేసీ కోటేశ్వరరావు 
 
కొవ్వూరు: జిల్లాలోని 1,932 రేషన్‌ దుకాణాల్లో నగదు రహిత లావాదేవీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని జాయింట్‌ కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు తెలిపారు. రేషన్‌ దుకాణాల్లో సరుకులు పంపిణీని పరిశీలించేందుకు బుధవారం ఆయన కొవ్వూరులో పర్యటించారు. పట్టణంలో మసీదు వీధిలోని ఏడో నెంబర్‌ చౌక దుకాణాన్ని పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జన్మభూమిమా ఊరు కార్యక్రమంలో అందిస్తున్న కొత్త రేషన్‌కార్డు లబ్ధిదారులకు కూడా చంద్రన్న సంక్రాంతి కానుక అందిస్తున్నామన్నారు. జిల్లాకు 20 శాతం సరుకులు అదనంగా కేటాయించినందున పంపిణీకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం లేదన్నారు. సర్వర్లలో సాంకేతిక లోపాల కారణంగా సరుకులు పంపిణీలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పారు. 
 
37 శాతం సరుకుల పంపిణీ పూర్తి
జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు చౌకదుకాణాల్లో సరుకుల పంపిణీ 37.26 శాతం, చంద్రన్న కానుకల పంపిణీ 27.92 శాతం పూర్తయ్యిందని జేసీ చెప్పారు.  కొత్త రేషన్‌కార్డుల్లో పేర్లు గల్లంతైన వారి వివరాలను తహసీల్దార్ల ద్వారా చేర్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. 
 
జిల్లాలో 67 వేల కొత్త రేషన్‌కార్డులు 
జిల్లాలో కొత్తగా 67 వేల రేషన్‌కార్డులు అందిస్తున్నామని జేసీ చెప్పారు. మొదటి విడతలో ప్రింటింగ్‌ ప్రకియ పూర్తయిన వాటిని అందించామని, మిగిలిన ప్రాంతాలకు బుధవారం పంపిణీ చేశామని చెప్పారు. డిసెంబర్‌ 29 వరకు వచ్చిన దరఖాస్తులకు సంబంధించి తొలుత 49,700 కొత్త రేషన్‌కార్డులు అందించామన్నారు. మరికొంత మంది లబ్ధిదారులు ఉండటంతో జనవరి 2 వరకు ఆన్‌లైన్‌ చేసిన వారిలో అర్హత గల వారందరికీ కార్డులు అందిస్తామని చెప్పారు. జిల్లాలోని రేషన్‌దుకాణాల్లో ఈ నెలలో రూ.49 వేల లావాదేవీలు నిర్వహించామన్నారు. 
 
నగదు రహిత లావాదేవీలకు ఏర్పాట్లు
జిల్లాలో 1,932 చౌకదుకాణాల్లో బయోమెట్రిక్‌ విధానం ద్వారా నగదు రహిత లావాదేవీలు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని జేసీ చెప్పారు. బ్యాంకు ఖాతాల్లో సొమ్ములుండి, ఖాతాలకు ఆన్‌లైన్‌ అనుసంధానం అయి ఉంటే వేలిముద్రల ద్వారా రేషన్‌ సరుకులు పొందవచ్చన్నారు. లబ్ధిదారులకు రేషన్‌ సరుకులతో పాటు చంద్రన్న కానుకలు కూడా అందించాలని ఆదేశించారు. డీలర్లు సొంతంగా నిర్ణయాలు తీసుకుంటే ఊరుకోబోమని హెచ్చరించారు. అనంతరం దొమ్మేరులో ఆయన పర్యటించారు. తహసీల్దార్‌ కె.విజయకుమార్, సీఎస్‌డీటీ ఎం.కమల్‌ సుందర్, ఆర్‌ఐ పి.రమేష్‌ ఆయన వెంట ఉన్నారు.
 
మరిన్ని వార్తలు