పారిన పారదర్శక పాచిక

23 Jun, 2016 13:22 IST|Sakshi

 ముందు ఆఫ్‌లైన్... తర్వాత వెబ్‌లైన్
 ఆరోపణలున్న వారికి కీలక స్థానాలు
 పనిచేసిన వారికి ప్రాధాన్యం లేని ప్రాంతాలు
 పాలకపక్ష నేతల సిఫార్సులకే పెద్దపీట
 తహసీల్దార్లు, ఎక్సైజ్ శాఖ డీసీ బదిలీలపై వాడీవేడి చర్చ

 
 అనుకున్న పనులు సాగాలంటే... అనుకూలమైన అధికారులు ఉండాలి. అనుయాయుల హవా సాగాలంటే... చెప్పినట్టు వినే సిబ్బంది ఉండాలి. అలా అయితేనే ముందుకు వెళ్లగలరు. పారదర్శకత పేరుతో తాజా బదిలీల్లో ఇదే సూత్రం అమలు చేశారు. తొలుత ఆఫ్‌లైన్‌లో అన్నీ చేసేసి... ఆనక వెబ్‌లైన్‌లో మమ అనిపించేసి... రకరకాల విన్యాసాలు చేసి... చివరకు తమకు నచ్చినవారిని తెచ్చుకుని... నచ్చనివారిని తప్పించేలా చూసుకున్నారు. ఫలితంగా ఆరోపణలున్నవారికి కీలకస్థానాలు దక్కాయి... పనిచేయగల సమర్థులకు ప్రాధాన్యం లేని చోటు లభించింది. జిల్లాలో బదిలీలు పాలకుల భవిష్యత్తు ఆలోచనలను చెప్పకనే చెబుతున్నాయి.
 
 సాక్షి ప్రతినిధి, విజయనగరం : పారదర్శకతకు కొత్త అర్థం చెప్పారు. కావలసిన అధికారుల్ని తెచ్చుకునేందుకు పాచికగా మలచుకున్నారు. భవిష్యత్తు అవసరాలకోసం ఉపయోగపడే వారిని నియమించుకునేందుకు బదిలీల అంశాన్ని అనుకూలంగా మలచుకున్నారు. పారదర్శకత... ఆన్‌లైన్... వెబ్‌కౌన్సెలింగ్... అంతా ఒట్టిదేనని తేలిపోయింది. వ్యూహాత్మకంగానే జరిగినట్టు అన్పిస్తోంది. కొన్ని శాఖల్లో ఆఫ్‌లైన్‌లో కానిచ్చేసి ఆ తర్వాత వైబ్‌లైన్‌లో ఓకే చేశారు. మరికొన్ని శాఖల్లో ఎవరెక్కడో నేతలే నిర్ణయించగా, వాటి ప్రకారం వెబ్‌లో ఆప్షన్ పెట్టి బదిలీలు చేశారు.  రెవెన్యూలోనైతే పైరవీలకే పెద్ద పీట వేసినట్టు ఆరోపణలు గుప్పుమన్నాయి.
 
 ముందస్తు ప్రణాళికలో భాగంగానే...
 ఎవరెక్కడికెళ్లాలో, ఎవరెక్కడికి రావాలో అధికార పార్టీ నేతలు ముందే నిర్దేశించారు. వాటి ఆధారంగానే అధికారులు పావులు కదిపారు. చెప్పి, ఒప్పించి బదిలీల తతంగాన్ని దాదాపు చేపట్టారు. నేతల ఒత్తిళ్లు ఉన్నాయని, వారి సూచనల మేరకు చేయక తప్పదని, వారికి ఇష్టం లేకుండా వేసినట్టయితే ఇబ్బందులొస్తాయని ముందే హితబోధ చేసేశారు. అందుకు తగ్గట్టుగా ముందుగానే ఆఫ్‌లైన్‌లో ప్రాంతాలను ఖరారు చేసుకుని, వాటి ఆధారంగా వెబ్‌లైన్‌లో ఆప్షన్లు పెట్టి బదిలీలను కానిచ్చేశారు. వెబ్‌లైన్ పేరుతో సిఫార్సులే జరిగాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.
 
 కలెక్టరేట్‌కు వచ్చి మరీ పైరవీలు
 రెవెన్యూ శాఖలో జరిగిన బదిలీల్లో తహసీల్దార్లను తమ ప్రాంతాలకు వేయించుకునేందుకు సాక్షాత్తూ ఎమ్మెల్యేలే కలెక్టరేట్‌కు వచ్చి పైరవీలు సాగించారన్న ప్రచారం సాగుతోంది. మరికొందరు  ఎమ్మెల్యేలు, నాయకులు ఫోన్ ద్వారా తమకు అనుకూలురైన వారిని తహసీల్దార్లు, ఆర్‌ఐలుగా నియమించాలని ఒత్తిడి చేసినట్టు తెలిసింది. అందుకు తగ్గట్టుగానే మంగళవారం బదిలీలు జరిగిన సమయంలో టీడీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే ఏకంగా కలెక్టరేట్‌లో తిష్టవేశారు. ఊహించినట్టుగానే ఆ నియోజకవర్గ పరిధిలో ముగ్గురు తహసీల్దార్లకు బదిలీలు జరిగాయి. తనకు అనుకూలమైన వ్యక్తులకు పోస్టింగ్‌లు వేయించుకోగలిగారు. దీనిపై రెవెన్యూ వర్గాల్లో వాడీ వేడి చర్చ జరుగుతోంది. ఈ బదిలీల్లో పనితీరును ప్రామాణికంగా తీసుకోలేదని, సిఫార్సులకే పెద్ద పీట వేసారన్న  ఆరోపణలు గుప్పుమన్నాయి.
 
 చెప్పినమాట విననివారిని అప్రాధాన్యస్థానానికి...
 జిల్లా ఉన్నతాధికారి ఒకరు ఈ మధ్య తమ చేతికి మట్టి అంటకుండా ప్రతీదీ మౌఖికంగా చెప్పి పని చేయించుకోవడం అలవాటుగా పెట్టుకున్నారు. భవిష్యత్‌లో ఇబ్బందులొస్తే కింది స్థాయి వాళ్లు పోవాలే తప్ప తమకెలాంటి సమస్య ఉత్పన్నం కాకూడదన్న ఉద్దేశంతోనే దీనిని అమలు చేస్తున్నారు. కొందరు సరే అంటూ చెప్పిన పని చేసేస్తుంటే... కొందరు అభ్యంతరం చెబుతున్నారు. సరే అన్నవారిని తనవారిగా... కాదన్నవారిని పరాయివారిగా భావిస్తున్నారు. ఆయన సతాయింపు భరించలేక కొందరు ఇబ్బంది పడుతున్నారు. తాజాగా జరిగిన బదిలీల్లో ఆయన్ను వ్యతిరేకించేవారిని ప్రాధాన్యం లేని స్థానాలకు పంపేసినట్టు బాహాటంగానే విమర్శలు వచ్చాయి.
 
 ఎక్సైజ్ డీసీ బదిలీపై ‘కుల’కలం
 ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ వై.చైతన్య మురళి బదిలీ విషయం రాష్ట్ర ప్రభుత్వ నిజస్వరూపం బయడపడింది. ఆదర్శ భావాలు గల ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. కాపు ఉద్యమానికి అంతర్గతంగా తన వంతు సహకారం అందిస్తున్నారని, తానొక వ్యవస్థను నడుపుతున్నారన్న అభిప్రాయంతో రాష్ట్రప్రభుత్వం ఆయన్ని ఆకస్మికంగా బదిలీ చేసినట్టు సమాచారం. ఒక అధికారిగా కాకుండా సామాజిక సేవలందిస్తున్న చైతన్య మురళిని ఎనిమిది నెలలు తిరక్కుండానే బదిలీ చేయడంపై ఎస్సీ, ఎస్టీ, కాపు, మైనార్టీ సంఘాలు తీవ్రంగా నిరసిస్తున్నాయి. ఇదే ప్రభుత్వంలో ఇంతకుముందు సామాజిక కోణంలోనే చర్యలు తీసుకుందని, ఇప్పుడూ అదే పంథా సాగిస్తోందని ఆయా సంఘాలు మండిపడుతున్నాయి. దీనిపై ఆందోళన చేసేందుకు సిద్ధమవుతున్నాయి.
 

మరిన్ని వార్తలు