ఆరుబయటకే..!

4 Jan, 2017 22:35 IST|Sakshi
ఆరుబయటకే..!

రాష్ట్రంలో అధ్వానస్థితిలో ఉమ్మడి ఆదిలాబాద్‌
దిగువ నుంచి రెండోస్థానం
నాలుగు జిల్లాల్లో సగటున 21.03 శాతం కుటుంబాలకే మరుగుదొడ్లు
బహిరంగ విసర్జన లేని గ్రామాలు కేవలం 66


మంచిర్యాల : స్వచ్ఛభారత్‌ సంకల్పం మన ముందు చిన్నబోతోంది. పారిశుధ్యం తీరు పరిహసింపబడుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్లు లేని జిల్లాల జాబితాలో ఉమ్మడి ఆదిలాబాద్‌ రెండోస్థానంలో ఉంది. మరుగుదొడ్లు లేక బహిరంగ మల, మూత్ర విసర్జనలతో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా మొదటి స్థానంలో ఉండగా, రెండో స్థానం మనదే. 2012 సంవత్సరం వరకు మొత్తం కుటుంబాల్లో 10 శాతం మాత్రమే మరుగుదొడ్లతో అత్యంత దయనీయంగా ఉన్న గ్రామీణ ఆదిలాబాద్‌.. భారత ప్రధాని నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చి స్వచ్ఛభారత్‌ కార్యక్రమానికి ఇచ్చిన ప్రాధాన్యతతో కొంత మెరుగైంది. అయినా రాష్ట్రంలోని పాత పది జిల్లాల పరిధిలో వ్యక్తిగత మరుగుదొడ్లు లేని కుటుంబాలు, గ్రామాలు అధికంగా ఉన్న జిల్లాగా ఆదిలాబాద్‌ నిలవడం దౌర్భగ్యం. కొత్తగా ఏర్పాటైన నాలుగు జిల్లాల సగటును లెక్కిస్తే కేవలం 21.03 శాతం కుటుంబాలకే ఈ సౌకర్యం ఉంది.

ప్రోత్సాహకం పెంచినా..    
మరుగుదొడ్డి అనేది కుటుంబ వ్యక్తిగత అవసరాల్లో ముఖ్యమైనది. వీటి నిర్మాణానికి ప్రభుత్వం ప్రోత్సాహకం కూడా అందిస్తోంది. గతంలో ఇచ్చే మొత్తాన్ని ఏకంగా రూ.12 వేలకు పెంచింది. ఇంత చేసినా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వెనునకబడే ఉంది. ఇప్పుడు నాలుగు జిల్లాలుగా విడిపోగా.. ఇకనైనా పారిశుధ్య ప్రక్రియను వేగవంతం చేయాల్సిన  ఆవశ్యకత కళ్లకు కడుతోంది. మరోవైపు.. కొన్ని మండలాల్లో మరుగుదొడ్లు నిర్మించుకున్నా వినియోగించడం లేదని అధికారులు గుర్తించారు. ఈ లెక్కన కేంద్రం విడుదల చేసిన గణాంకాల ప్రకారం మంచిర్యాలలో 80.91 శాతం, నిర్మల్‌ జిల్లాలో 79.84 శాతం, కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 77.44 శాతం, ఆదిలాబాద్‌ జిల్లాలో 76.06 శాతం గ్రామీణులకు దొడ్లు లేవని గుర్తించారు. కాగా.. నాలుగు జిల్లాల్లో అభివృద్ధిలో మంచిర్యాల ముందు స్థానంలో ఉన్నట్లు లెక్కలు చెపుతుండగా, వ్యక్తిగత మరుగుదొడ్లు లేని గ్రామాల విషయంలో కూడా ముందే ఉండడం గమనార్హం. గోండు తెగకు చెందిన గిరిజనులు, నిరక్షరాస్యులు ఎక్కువగా ఉండే ఆదిలాబాద్, ఆసిఫాబాద్‌లు మిగతా రెండు జిల్లాల కన్నా మెరుగైన స్థితిలో ఉన్నాయి.

పొరుగు జిల్లాలు కరీంనగర్, సిరిసిల్లలో వంద శాతం
ఉమ్మడి ఆదిలాబాద్‌ను ఆనుకొని ఉన్న కరీంనగర్‌ మరుగుదొడ్ల వినియోగంలో ముందు వరుసలో ఉంది. విభజన తరువాత ఏర్పాటైన కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లోని గ్రామాలన్నీ వంద శాతం మరుగుదొడ్లు ఉన్నవిగా గుర్తింపు పొందాయి. మంచిర్యాల పక్కన గోదావరి ఆవల ఉన్న పెద్దపల్లి జిల్లాలోని పల్లెల్లో సైతం 71.65 శాతం మరుగుదొడ్లు ఉన్నాయి. రాష్ట్రంలో మంగళవారం నాటికి 6,17, 297 గృహాల్లో మరుగుదొడ్ల నిర్మాణం జరగగా, మన నాలుగు జిల్లాలో మాత్రం ఆశించిన పురోగతి లేదు. ఇప్పటికైనా కలెక్టర్లు తగిన చర్యలు తీసుకొని స్వచ్ఛ భారత్‌ మిషన్‌ కింద గ్రామాల్లో మరుగుదొడ్లు నిర్మిస్తే ‘అవతలికి’ పోయే బాధ ప్రజలకు తప్పుతుంది. మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడినట్లవుతుంది.  

ఓడీఎఫ్‌ గ్రామాలు 66
వంద శాతం వ్యక్తిగత మరుగుదొడ్లు గల కుటుంబాలు నివసించే గ్రామాలను ఓడీఎఫ్‌ (ఓపెన్‌ డెఫికేషన్‌ ఫ్రీ) గ్రామాలుగా చెబుతారు. రాష్ట్రంలోని 8,700 గ్రామ పంచాయతీల పరిధిలోని 10,969 గ్రామాల్లో 1,524 ఈ కేటగిరీలో చేరాయి. కానీ.. ఉమ్మడి ఆదిలాబాద్‌లో మాత్రం 1,606 గ్రామాలకు గాను 66 గ్రామాలే ఓడీఎఫ్‌ స్థాయిని ప్రకటించుకున్నాయి. వీటిలో 31 గ్రామాలను స్వచ్ఛభారత్‌ మిషన్‌ తనిఖీ చేసి ఆమోదించింది. కరీంనగర్, సరిసిల్ల జిల్లాల స్థాయిలో వందశాతానికి చేరుకోవాలంటే ఎంత కాలం పడుతుందో చూడాలి.

మరిన్ని వార్తలు