ఒట్టి హడావుడే

5 Jan, 2017 23:04 IST|Sakshi
ఒట్టి హడావుడే
- తూతూ మంత్రంగా జన్మభూమి గ్రామసభలు 
-  కోడుమూరు మండలంలో
   సభను బహిష్కరించిన టీడీపీ నేతలు
 
కర్నూలు(అగ్రికల్చర్‌): జన్మభూమి కార్యక్రమం జిల్లాలో నిరసనలు, అసంతృప్తుల మధ్య సాగుతోంది. సభల్లో జన్మభూమి గ్రామ కమిటీ సభ్యుల హడావుడి తప్ప ఇతరత్రా ఏమీ కనిపించడం లేదు. పింఛన్‌ రావాలన్నా, రేషన్‌ కార్డు ఇవ్వాలన్నా జన్మభూమి కమిటీ సభ్యుల ఆమోదం తప్పనిసరి కావడంతో వీరికి ప్రాధాన్యం ఏర్పడింది. వీరిని ప్రసన్నం చేసుకుంటేనే ప్రభుత్వ పథకాలు అందుతాయనే అభిప్రాయం ఉండడంతో వీరు అడ్డుగోలు వసూళ్లకు పాల్పడుతున్నారు. నాలుగు రోజులుగా జరిగిన జన్మభూమి కార్యక్రమం 510 నివాస ప్రాంతాల్లో ముగిసింది. కోడుమూరు మండలం అమడగుండ్లలో అధికార తెలుగుదేశం నేతలే జన్మభూమి కార్యక్రమాన్ని అడ్డుకోవడం గమనార్హం. అధికార పార్టీకి చెందిన తమకే ఎంపీడీఓ, ఇతర అధికారులు తగిన గుర్తింపు ఇవ్వడం లేదంటూ గ్రామ నాయకులు మాదన్న, సుంకన్న తదితరులు అధికారులపై తీవ్రంగా ధ్వజమెత్తారు. వీరి తీరు కారణంగా జన్మభూమి కార్యక్రమం  అర్ధాంతరంగా ముగిసింది.  గ్రామ సభల్లో అధికారులు, ఉద్యోగుల హడావుడి ఎక్కువగా ఉండగా ప్రజలు తక్కువగా ఉన్నారు. ఆదోని, అళ్లగడ్డ, డోన్, పత్తికొండ, నంద్యాల తదితర మండలాల్లో గ్రామ సభలు తూతూ మంత్రంగా జరుగుతున్నట్లు సమాచారం. టీడీపీ నేతల హంగామ అధికంగా ఉండడంతో  ప్రభుత్వ కార్యక్రమం  పార్టీ కార్యక్రమంగా మారిందన్న విమర్శలున్నాయి. 
మరిన్ని వార్తలు