సర్వీసు రూల్స్‌పై ఇక సమరమే

9 Mar, 2017 00:28 IST|Sakshi

- 12న ఢిల్లీకి ఒంటేరు శ్రీనివాసులరెడ్డి
ప్రొద్దుటూరు కల్చరల్‌ : ఉపాధ్యాయ, ఉద్యోగ కుటుంబాల్లో వెలుగులు నింపే ఉమ్మడి సర్వీసు రూల్స్‌ సాధన కోసం ఈ నెల 12న తన మద్దతుదారులతో ఢిల్లీకి వెళ్లనున్నట్లు పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గ అభ్యర్థి ఒంటేరు శ్రీనివాసులరెడ్డి తెలిపారు. బుధవారం ఆయన  విలేకరుల సమావేశంలో మాట్లాడారు.  ఏడాది కిందట ముఖ్యమంత్రిని కలిసి సర్వీసు రూల్స్‌కు చర్యలు తీసుకోవాలని కోరానన్నారు. సీఎం కార్యాలయ అధికారులతో అనేక పర్యాయాలు సంప్రదించి.. కేంద్రానికి రాష్ట్రం తరఫున పూర్తి స్థాయి నివేదిక పంపాలని విన్నవించానన్నారు. అయితే..అధికారులు నిర్లక్ష్యం వహించి చిత్తుకాగితంపై కేంద్రానికి లేఖ పంపారన్నారు.

దీనిపై ఎలాంటి స్పందనా లేకపోవడంతో 2016 డిసెంబర్‌ 9న కేంద్ర హోంశాఖ మంత్రి రాజనాథ్‌సింగ్‌ను కలిసి పరిస్థితిని వివరించానన్నారు. కేంద్ర హోంశాఖ వారు వెంటనే రాష్ట్రానికి ప్రభుత్వ గెజిట్‌ ఉన్న లేఖపై సవరణ ఉత్తర్వు కోసం వివరాలు పంపాలని ఆదేశించారన్నారు. అప్పుడు మేల్కొన్న రాష్ట్రాధికారులు డిసెంబర్‌ 20న కేంద్రానికి అధీకృతంగా వివరాలు పంపారని చెప్పారు. కేంద్ర హోంశాఖ ముసాయిదాను సవరించి ఆ ఉత్తర్వును రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి పంపే పనిలో ఉందన్నారు. ఎన్నికలు ఉండటంతో దీనిపై  డిసెంబర్‌ తర్వాత పూర్తిగా దృష్టి సారించలేకపోయామని ఒంటేరు చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం ఈ విషయంపై తాడోపేడో తేల్చుకునేందుకు  సిద్ధమయ్యామన్నారు. తనకు మద్దతు ఇస్తున్న ఉపాధ్యాయ సంఘాల నాయకులతో కలిసి ఈనెల 12న ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు