ఓడీఎఫ్‌గా జిల్లాను మార్చాలి

18 Jul, 2016 00:40 IST|Sakshi
ఓడీఎఫ్‌గా జిల్లాను మార్చాలి
 
  • కలెక్టర్‌ జానకి
ముత్తుకూరు:
 2017 మార్చి నాటికి నెల్లూరును బహిరంగ మల విసర్జన రహిత(ఓపెన్‌ డిఫికేషన్‌ ఫ్రీ) జిల్లాగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు కలెక్టర్‌ ఎం.జానకి అన్నారు. ఆత్మగౌరవంలో భాగంగా జిల్లాలోని అన్ని మండలాల ఎంపీడీఓలు, తహసీల్దార్లకు రెండు రోజుల పాటు పోర్టులోని ఓ హోటల్లో నిర్వహించిన వర్క్‌షాపు ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా జేసీ ఇంతియాజ్‌తో కలసి కలెక్టర్‌ విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని కష్ణ, తూర్పుగోదావరి, విజయనగరం, నెల్లూరు జిల్లాలను బహిరంగ మల విసర్జన రహిత జిల్లాలుగా చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 102 పంచాయతీలను ఓడీఎఫ్‌గా ప్రకటించామన్నారు. మిగిలిన 839 పంచాయతీల్లో డిసెంబరు నెలాఖరుకు మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయించామన్నారు. ప్రతి బుధవారం మండల స్థాయి అధికారులు గ్రామాల్లో బస చేసి, మరుగుదొడ్ల నిర్మాణంపై అవగాహన కలిగిస్తున్నారన్నారు. దీని వల్ల అధికారులపై ఒత్తిగి పెరిగిందన్నారు. ఇందుకోసం రెసిడెన్షియల్‌ ప్రోగ్రాం ద్వారా పోర్టులో శిక్షణ తరగతులు నిర్వహించామన్నారు. ఉద్యోగుల్లో ఒత్తిడి తగ్గించేందుకు యోగా, ధాన్యం కూడా చేయించామన్నారు. ఓడీఎఫ్‌ పూర్తయిన పంచాయతీల్లో గ్రీన్‌ చానల్‌ ద్వారా 48 గంటలల్లో మరుగుదొడ్లకు బిల్లులు చెల్లిస్తున్నామన్నారు. కష్ణపట్నంపోర్టు, టీపీసీఐఎల్, ఏపీజెన్‌కో, మీనాక్షి పవర్‌ ప్రాజెక్టులు, బొల్లినేని ఆసుపత్రి యాజమాన్యం సైతం గ్రామాల్లో మరుగుదొడ్లు నిర్మించేందుకు ముందుకు వచ్చాయన్నారు. కష్ణపట్నంపోర్టు సహకారంతో శిక్షణ తరగతులు నిర్వహించామన్నారు. పోర్లు నిర్వాహకులు ప్రీకాస్ట్‌ మరుగుదొడ్ల నిర్మాణంపై కసరత్తు చేస్తున్నారన్నారు. జిల్లాను ఓడీఎఫ్‌గా రూపొందించే విషయంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా భాగస్వామ్యం వహిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా పోర్టు ఆవరణలో కలెక్టర్‌ మొక్కలు నాటారు. కార్యక్రమానికి సహకరించిన వారికి జ్ఞాపికలు అందజేశారు.
 
మరిన్ని వార్తలు