‘స్వచ్ఛ’త వైపు..

19 Sep, 2017 08:59 IST|Sakshi
‘స్వచ్ఛ’త వైపు..

సాక్షి, కామారెడ్డి : బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా కామారెడ్డిని ప్రకటించడానికి అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. మరు గుదొడ్లు లేని ఇళ్ల జాబితాను రూపొందించిన అధికారులు.. అన్ని ఇళ్లల్లో మరుగుదొడ్లు నిర్మించేలా టార్గెట్లు విధించారు. కలెక్టర్‌ సత్యనారాయణ వంద శాతం స్వచ్ఛత సాధించాలన్న పట్టుదలతో అధికారులను ఉరుకులు, పరుగులు పెట్టిస్తున్నారు. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం జిల్లాలో 1,61,224 కుటుంబాలు ఉన్నాయి. అందులో ప్రభుత్వ పథకాలు, సొంత డబ్బులతో 1,18,014 మంది మరుగుదొడ్లు నిర్మించుకున్నారు. ఇంకా 43,210 ఇళ్లలో మరుగుదొడ్లు నిర్మించుకుంటే వంద శాతం లక్ష్యం సాధించినట్లవుతుంది. ఇందుకోసం అధికారులకు టార్గెట్లతో పాటు గడువు విధించారు.

కాగా జిల్లాలో ఇప్పటి వరకు 114 గ్రామ పంచాయతీల పరిధిలో వంద శాతం మరుగుదొడ్లు నిర్మించుకున్నారు. 229 పంచాయతీలు మిగిలి ఉన్నాయి. అక్టోబర్‌ 2 నాటికి 67 పంచాయతీల్లో 4,668 మరుగుదొడ్లు నిర్మించడం ద్వారా వాటిని వంద శాతం ఓడీఎఫ్‌ గ్రామాలుగా ప్రకటించాలని నిర్ణయించారు. అక్టోబర్‌ 31 లోగా 76 పంచాయతీల్లో 11,906 మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యం విధించారు. నవంబర్‌ 15 నాటికి మిగిలిన 86 పంచాయతీల్లో 26,636 మరుగుదొడ్లు నిర్మించి బహిరంగ మల విసర్జన రహిత జిల్లాగా ప్రకటించాలని నిర్ణయించారు. ఇందుకోసం అధికారులకు టార్గెట్‌లు విధించారు.

పరుగులు తీస్తున్న అధికారులు...
మరుగుదొడ్ల నిర్మాణాలకు సంబంధించి టార్గెట్లు విధించడంతో అధికారులు పరుగులు తీస్తున్నారు. ముఖ్యంగా ఉపాధిహామీ, మండల పరిషత్‌ అధికారులు, సిబ్బంది గ్రామాల వారీగా మరుగుదొడ్లు లేనివారితో మాట్లాడుతున్నారు. మరుగుదొడ్లను నిర్మించుకోకుంటే సంక్షేమ పథకాల లబ్ధి నిలిచిపోతుందని అధికారులు హెచ్చరికలు కూడా చేస్తున్నారు. దీంతో మరుగుదొడ్లు లేనివాళ్లు నిర్మించుకోవడానికి ముందుకు వస్తున్నారు. మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.12 వేలు ఉపాధి హామీ ద్వారా అందుతుంది. కొన్ని చోట్ల ముందు పెట్టుబడికి డబ్బులు లేవనే మాట చెప్పిన చోట గ్రామ సంఘాల ద్వారా వారికి డబ్బు ఇప్పించి మరీ నిర్మాణాలు చేపడుతున్నారు. అయితే చాలా మంది మరుగుదొడ్డి నిర్మించుకోవడం అనేది తమ బాధ్యత కాదని, అధికారులే కట్టి ఇస్తారన్నట్టుగా వ్యవహరిస్తున్నారని ఓ అధికారి ‘సాక్షి’తో పేర్కొన్నారు.

నిర్మాణాలతో సరిపోదు..
ఇప్పటికీ చాలా గ్రామాల్లో బహిరంగ మలవిసర్జనకే ప్రజలు మొగ్గు చూపుతున్నారు. మొదటి నుంచి ఉన్న అలవాటును మార్చుకోలేకపోతున్నారు. ముఖ్యంగా మారుమూల గ్రామాల్లో బహిరంగ మలవిసర్జన అనేది ఇప్పటికీ కొనసాగుతోంది. చాలా మంది మరుగుదొడ్లు నిర్మించుకోవడానికి ఇష్టపడడం లేదు. మరుగుదొడ్లు నిర్మించుకున్నవారు సైతం వాటిని వినియోగించడంలేదు. వంద శాతం మరుగుదొడ్లు నిర్మించుకుని రికార్డుకెక్కిన దోమకొండ మండలం లింగుపల్లి గ్రామంలో ఇప్పటికీ చాలా మంది ఆరుబయటకే వెళుతున్నారు. ప్రభుత్వం నుంచి నిధులు ఇచ్చినపుడు మరుగుదొడ్డి నిర్మించుకుని మూలన పడేస్తున్నారు. చాలా గ్రామాల్లో మరుగుదొడ్లను వాడడం లేదు. ఆరుబయట మలవిసర్జన ద్వారా కలిగే ఇబ్బందులను గురించి ప్రజలకు మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మరిన్ని వార్తలు