అధునాతన పరిశోధనలతో శస్త్ర చికిత్సలు సులభతరం

14 Sep, 2016 23:29 IST|Sakshi
అధునాతన పరిశోధనలతో శస్త్ర చికిత్సలు సులభతరం
అమలాపురం రూరల్‌ :
ఎనస్తీషియా రంగంలో అధునాతన పరిశోధనలతో శస్త్ర చికిత్సలు సులభతరం కానున్నాయని ఇండియా ఎనస్తీషియా డాక్టర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, అమలాపురం కిమ్స్‌ వైద్య కళాశాల డీన్‌ డాక్టర్‌ ఏఎస్‌ కామేశ్వరరావు తెలిపారు. గత నెల 25 నుంచి 28వ తేదీ వరకూ చైనా దేశం ఘాంజూలో జరిగిన 16 దేశాల ఎనస్తీషియా డాక్టర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుల అంతర్జాతీయ సదస్సులో డాక్టర్‌ కామేశ్వరరావు పాల్గొన్నారు. అనంతరం ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్‌ రెండో తేదీ వరకూ హాంకాంగ్‌లో జరిగిన ప్రపంచ మత్తు వైద్యుల సదస్సుకు ఆయన హాజరయ్యారు. ఈ రెండు సదస్సుల్లో కూడా డాక్టర్‌ కామేశ్వరరావు మత్తుపై వస్తున్న ఆధునిక పరిశోధనలు, ప్రక్రియలపై ప్రసంగించారు. క్యాన్సర్‌ నొప్పిపై విశ్లేషాత్మక ఉపన్యాసం చేశారు. ఈ రెండు అంతర్జాతీయ సదుస్సుల్లో పాల్గొని తిరిగి వచ్చిన డాక్టర్‌ కామేశ్వరరావు స్థానిక కిమ్స్‌ వైద్య కళాశాలలో బుధవారం సాయంత్రం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. చైనాలో జరిగిన మత్తు వైద్యుల సదస్సులో 16 దేశాల అసోసియేషన్ల అధ్యక్షులు పాల్గొంటే మన దేశం తరఫున తాను పాల్గొన్నానని ఆయన చెప్పారు. హాంకాంగ్‌లో జరిగిన ప్రపంచ మత్తు వైద్యుల సదస్సులో మన దేశం నుంచి వంద మంది వైద్యులు పాల్గొన్నారని చెప్పారు. ఈ సదస్సులోనే తాను  ఇంటర్నేషనల్‌ ఎనస్తీషియా ఎడ్యుకేషన్‌ కమిటీ సభ్యునిగా ఎన్నికయ్యానని తెలిపారు. ఆసియా దేశాల నుంచి ఈ కమిటీకి తానొక్కడినే సభ్యుడిగా ఎన్నికయ్యానని వివరించారు. ఇండియా ఎనస్తీషియా డాక్టర్స్‌ అసోసియేషన్‌లో 23 వేల మంది డాక్టర్లు సభ్యులుగా ఉన్నారని డాక్టర్‌ కామేశ్వరరావు తెలిపారు. డాక్టర్‌ కామేశ్వరరావును కిమ్స్‌ చైర్మన్‌ చైతన్యరాజు, ఎండీ, ఎమ్మెల్సీ రవికిరణ్‌వర్మ అభినందించారు.
 
మరిన్ని వార్తలు