పొదుపులో ఓర్వకల్లు మహిళలు ఆదర్శం

21 Sep, 2016 22:51 IST|Sakshi
పొదుపులో ఓర్వకల్లు మహిళలు ఆదర్శం
– రూ.15వేల కోట్లతో రైతుమిత్ర గ్రూపుల ఏర్పాటు
– ఓర్వకల్లు మహిళలకు బాధ్యతలు  
– మొక్కజొన్న పంటకు ఫసల్‌ బీమా వర్తింపు
– వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
 
ఓర్వకల్లు: పొదుపు సంఘాల ద్వారా ఓర్వకల్లు మహిళలు సాధించిన ఆర్థిక స్వాలంబన ఆదర్శనీయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఓర్వకల్లులో పొదుపు ఉద్యమాన్ని స్థాపించి 22 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం వార్షికోత్సవాన్ని నిర్వహించారు. వేడుకలకు మంత్రితో పాటు ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి, జెడ్పీ చైర్మెన్‌ మల్లెల రాజశేఖర్, వ్యవసాయ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ విజయకుమార్, కమిషనర్‌ ధనుంజయరెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. రాష్ట్ర మహిళా సాధికార సమన్వయకర్త విజయభారతి నేతృత్వంలో నిర్వహించిన వేడుకల్లో మంత్రి మాట్లాడుతూ..రైతులను నష్టాల బారినుంచి తప్పించేందుకు రూ.15 వేల కోట్లతో మిత్ర గ్రూపులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. తొలి విడతగా రాష్ట్రంలో 131 క్లస్టర్లలో 2లక్షల మంది రైతులతో 20వేల సంఘాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా ఎంచుకున్నామన్నారు. వీటి నిర్వహణ బాధ్యతలను ఓర్వకల్లు పొదుపు సమాఖ్య మహిళలకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. రైతులు రసాయన ఎరువుల వాడకం తగ్గించి, ప్రకతి వ్యవసాయంపై ఆసక్తి కనబరచాలని సూచించారు.
 
ఈ ఏడాది రబీ సీజన్‌కు సంబంధించి 98వేల క్వింటాళ్ల శనగ విత్తనాలను పంపిణీకి సిద్ధం చేశామన్నారు. ఉల్లి ధర పతనమైన తరుణంలోకిలో రూ.7 నుంచి రూ.8 చొప్పున కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత విజ్ఞప్తి మేరకు ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా పథకాన్ని మొక్కజొన్న పంటకు కూడా వర్తింపజేస్తామన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా ఓర్వకల్లు రైతాంగానికి సాగునీరు అందించే విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామన్నారు. శనగ ఉత్పత్తులను నిల్వ ఉంచుకునేందుకు ఓర్వకల్లు ప్రాంతంలో ప్రభుత్వ గోదామును ఏర్పాటు చేస్తామన్నారు.
 
మండలంలో ఐదేళ్లకు పైబడి ఎలాంటి బకాయిలు లేని మహిళా సంఘాలకు పొదుపు ద్వారా వచ్చిన రూ.కోటి రివాల్వింగ్‌ ఫండ్‌ను(ఒక్కొక్క సంఘానికి రూ.50 వేల చొప్పున )చెక్కు రూపేణ అందజేశారు. జిల్లా కలెక్టర్‌ సీహెచ్‌ విజయమోహన్, జేసీ హరికిరణ్, జేడీఏ ఉమామహేశ్వరమ్మ, కేడీసీసీ బ్యాంకు చైర్మెన్‌ మల్లికార్జున రెడ్డి, మాజీ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్, పాణ్యం, ఆళ్లగడ్డ, ఆలూరు నియోజకవర్గాల టీడీపీ ఇన్‌చార్జ్‌లు ఏరాసుప్రతాపరెడ్డి, గంగుల ప్రభాకర్‌రెడ్డి, వీరభద్రగౌడ్, టీడీపీ జిల్లా ప్రధానకార్యదర్శి నాగేశ్వరరావుయాదవ్, ఆర్‌డీఓ రఘుబాబు తదితరులు పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు