ఆర్థిక సంక్షోభంలో ఉద్యమాల గడ్డ

21 Jul, 2016 21:35 IST|Sakshi
ఆర్థిక సంక్షోభంలో ఉద్యమాలగడ్డ

 ►   జీతాలు, పెన్షన్లు ఇవ్వలేని దుస్థితి
 ►   వర్సిటీ స్వయం వనరుల నిధులు జీతాలకు మళ్లింపు
 ►   డిమాండ్ల సాధనకు ఉద్యోగుల ఆందోళన

సాక్షి, సిటీబ్యూరో:  ఎందరో మేథావులను ప్రపంచానికి అందించిన ప్రఖ్యాత ఉస్మానియా యూనివర్సిటీ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల చెల్లింపుల కోసమూ జేబులు తడుముకోవాల్సిన దీనస్థితికి దిగజారిపోయింది. దీంతో విద్యార్థుల పరిశోధనలకు వినియోగించాల్సిన నిధులను వేతనాలకు మళ్లించాల్సి వస్తోంది. ప్రభుత్వం ఏటా బ్లాక్‌ గ్రాంట్‌ రూపంలో కేటాయిస్తున్న నిధులు ఏమూలకు చాలడం లేదు. ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లకు ఏడాదికి రూ. 370 కోట్ల వరకు అవసరం కాగా, గత రెండేళ్లుగా ప్రభుత్వం రూ. 238 కోట్ల చొప్పున కేటాయించింది. దీనికితోడు గత ఏడాది నిధులు పూర్తిస్థాయిలో విడుదల కాకపోవడం గమనార్హం. ఓయూ చరిత్రలోనే ఇలాంటి పరిస్థితి ఎదురుకావడం ఇదే తొలిసారని పలువురు పేర్కొంటున్నారు.

ప్రతి నెలా ఎదురు చూపులే..
గతేడాది ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించిన ప్రభుత్వం దానిని పరిగణలోకి తీసుకోకుండా ఎప్పటిలానే  రూ. 238 కోట్లు విడుదల చేసింది. దీంతో ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు సకాలంలో అందడం లేదు.

తగ్గిన వనరులు..
ఓయూ పరిధి మూడు జిల్లాలకే పరిమితం కావడం, కళాశాలల సంఖ్య తగ్గడంతో ఆదాయం రూ. 80 కోట్లకు పడిపోయింది. ఈ నిధులను విద్యాభివృద్ధికి, పరిశోధనలకు వినియోగించాల్సి ఉండగా, ప్రభుత్వం నుంచి  అదనపు నిధులు అందకపోవడంతో వాటిని వేతనాలకు మళ్లిస్తున్నారు.

బ్లాక్‌ గ్రాంట్స్‌ పెంచాలి..
ప్రస్తుతం వర్సిటీలో పర్మినెంట్, కాంట్రాక్ట్‌ ఉద్యోగులు 1,800, టైం స్కేల్‌ ఉద్యోగులు 283 మంది ఉన్నారు. బ్లాంక్‌ గ్రాంట్‌కు ఈ ఏడాది అదనంగా రూ. 100 చెల్లించాలని, టైం స్కేల్‌ ఉద్యోగులను క్రమబద్దీకరించి పదో పీఆర్‌సీ అమలు చేయాలని పట్టుబడుతున్నారు.

 

మరిన్ని వార్తలు