మా ఇష్టం !

30 Aug, 2016 00:05 IST|Sakshi
మా ఇష్టం !
  • ఇండస్ట్రియల్‌ ఏరియాలో అక్రమాలు
  • వరంగల్‌లో నిబంధనలకు తిలోదకాలు
  • పరిశ్రమలకు ఇచ్చిన భూములు దుర్వినియోగం
  • ఇష్టారాజ్యంగా వాణిజ్య భవనాల నిర్మాణం
  • అన్నింటిపైనా చర్యకు పరిశ్రమల శాఖ ఆదేశం
  • సాక్షిప్రతినిధి, వరంగల్‌ : వరంగల్‌ నగరం ములుగు రోడ్డులోని పారిశ్రామిక ప్రాంతంలో భారీగా అక్రమాలు జరిగాయి. పరిశ్రమలు స్థాపిస్తామని ప్రభుత్వానికి చెప్పి భూములు తీసుకున్న కొందరు.. పూర్తిగా నిబంధనలు ఉల్లంఘించారు. ప్రభుత్వ స్ఫూర్తిని పక్కనబెట్టి తమకు లాభమైన పనులు చేశారు. ప్రభుత్వం కేటాయించిన భూముల్లో పరిశ్రమలు స్థాపించి స్థానిక యువతకు ఉపాధి కల్పించాలనే విషయాలను పట్టించుకోకుండా ఆ భూముల్లో ఇష్టం వచ్చినట్లుగా భారీ భవంతులు నిర్మించి, బడా వాణిజ్య సంస్థలకు కిరాయికి ఇచ్చారు. సొంత లాభం మాత్రమే చూసుకుంటూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.

    పరిశ్రమల శాఖ అధికారులు సైతం.. పరిశ్రమలను మూసివేసిన వారికే మద్దతు పలికారు. నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య భవనాలు నిర్మిస్తున్నా పట్టించుకోకుండా అక్రమార్కులకు అంటకాగారు. పారిశ్రామిక ప్రాంతంలో నిబంధనల ఉల్లంఘనపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలు కాగా, దీనిపై స్పందించాలని హైకోర్టు పరిశ్రమల శాఖను ఆదేశించింది. దీంతో పరిశ్రమల శాఖ తాజాగా ఇచ్చిన ఆదేశాలు సంచలనం కలిగిస్తున్నాయి.

    ‘పరిశ్రమల స్థాపన కోసం భూములు తీసుకుని... సొంత అవసరాల కోసం భవనాలు నిర్మించిన అంశంలో చర్యలు తీసుకోవాలి. వరంగల్‌ నగరం ములుగురోడ్డు పారిశ్రామిక ప్రాంతంలో 2009 ఫిబ్రవరి 7, అక్టోబరు 1 తేదీల్లో అనుమతులు పొందిన కంది జితేందర్‌రెడ్డి, కంది సరళాదేవి నిర్మించిన భవనాల అనుమతులను రద్దు చేయాలి. వాణిజ్య భవనాలు నిర్మిస్తున్న సమయంలో చర్యలు తీసుకోకుండా వ్యవహరించిన పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ వరంగల్‌ జోనల్‌ మేనేజర్‌ సి.హెచ్‌.ఎస్‌.ఎస్‌ ప్రసాద్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. వరంగల్‌ ములుగు రోడ్డులోని పారిశ్రామిక ప్రాంతంలో పరిశ్రమల స్థాపన కోసం భూములు పొంది ఇతర అవసరాల కోసం వినియోగిస్తున్న వారి విషయంలో విచారణ జరపాలి’ అని పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్‌కుమార్‌ ఈ నెల 12న తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(టీఎస్‌ఐఐసీ) సీఎండీని ఆదేశించారు. దీనిపై తదుపరి చర్యలు త్వరలోనే మొదలుకానున్నాయి.


        ‘వరంగల్‌ నగరం ములుగురోడ్డులోని పారిశ్రామిక ప్రాంతంలో పరిశ్రమల స్థాపన కోసం కేటాయించిన భూమి(715 సర్వే నంబర్‌)లో శ్రీ వెంకటేశ్వర ఆటోమోటివ్స్‌కు చెందిన కంది జితేందర్‌రెడ్డి, కంది సరళాదేవి వాణిజ్య భవనం(15–1–422/ఎ,బి) నిర్మించారు. ఎల్‌ఐసీ, ఓరియంటల్‌ ఇన్సూరెన్స్, హెచ్‌డీఎఫ్‌సీ, ఎర్గో, టాటా మోటార్స్‌ ఫైనాన్స్‌ వంటి సంస్థలకు లీజుకు ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా చేసిన ఈ వ్యవహారంపై స్పందించి భవన నిర్మాణ అనుమతులు రద్దు చేయాలని కోరుతున్నాము’ అని వరంగల్‌ నగరానికి చెందిన ఓ వ్యక్తి హైకోర్టులో రిట్‌ పిటిషన్‌(13/2016) వేశారు. హైకోర్టు దీన్ని స్వీకరించింది.

    ఈ వ్యవహారాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని పరిశ్రమల శాఖ కార్యదర్శిని ఈ ఏడాది ఫిబ్రవరి 15న ఆదేశించింది. నెలలు గడిచినా దీనిపై పరిశ్రమల శాఖ నిర్ణయం తీసుకోలేదు. దీంతో పిటిషనర్‌ మళ్లీ హైకోర్టును ఆశ్ర యించారు. హైకోర్టు ఆదేశాల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని పిటిషనర్‌ కోరారు. పరిశ్రమల శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. దీంతో పరిశ్రమల శాఖ చర్యలు మొదలుపెట్టింది. భవన నిర్మాణదారును, పిటిషనర్‌ను పిలిచి రికార్డులు స్వీకరించింది. అన్ని అంశాలను పరిశీలించి నిబంధనల ఉల్లంఘించారని నిర్ధాణకు వచ్చింది. చర్యలు తీసుకోవాలని టీఎస్‌ఐఐసీ సీఎండీని ఆదేశించింది.


    చర్యలు తీసుకుంటాం
    వరంగల్‌ ములుగురోడ్డు పారిశ్రామిక ప్రాంతానికి సంబంధించి ఓ కేసు ఉంది. హైకోర్టు ఆదేశాల ఉల్లంఘన అంశంపై ఈ కేసులో పరిశ్రమల శాఖ కార్యదర్శి నుంచి ఆదేశాలు వచ్చాయి. దీనిపై చర్యలు తీసుకుంటాం.
    – ఇ.వి.నర్సింహారెడ్డి, టీఎస్‌ఐఐసీ సీఎండీ.

మరిన్ని వార్తలు