పుట్ ఓవర్‌బ్రిడ్జి కలేనా?

31 Jul, 2016 19:47 IST|Sakshi
పుట్ ఓవర్‌బ్రిడ్జి కలేనా?
  •  సంవత్సరాల తరబడి జాప్యం
  •  ఉదాసీన వైఖరిని అవలంభిస్తున్న రైల్వే శాఖ
  • ఇబ్బందులు పడుతున్న ప్రజలు
  • ప్రమాదకర పరిస్థితిలో ప్రజలు పట్టాలు దాటుకుంటూ రాకపోకలు సాగిస్తున్నారు. నిర్మించిన రెండు బ్రిడ్జిలు ప్రజలకు ఉపయోగపడటంలేదు. నిధులు మంజూరైనా నిర్మాణం చేపట్టకపోవడంపై సామాజిక వేత్తలు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. అనుకోని ఘటన జరగకముందే అధికారులు చర్యలు తీసుకుని ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిన నిర్మించాల్సిన అవసరం ఉంది.

    జహీరాబాద్‌ టౌన్‌:జహీరాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఫుట్‌ ఓవర్‌బ్రిడ్జిని నిర్మించే విషయంలో తీవ్ర జాప్యం జరుగుతోంది.  సంవత్సరాలు గడుస్తున్నా నిర్మాణం చేపట్టడంలేదు. దీంతో నిత్యం ప్రయాణికులు, పట్టణ ప్రజలు ఇబ్బందులుపడుతున్నారు. పట్టణం విస్తరించడంతో  ప్రస్తుతం రైల్వేస్టేషన్‌ పట్టణం నడిమధ్యలో ఉంది. దీంతో రాకపోకలు సాగించేందుకు పట్టాలను దాటాల్సి వస్తుంది. ప్రమాదమని తెలిసినా విధిలేని పరిస్థితుల్లో ప్రజలు పట్టాలను దాటుకుంటూ వెళుతున్నారు.

    ఫ్లాట్‌ఫాంపైకి వెళ్లాలంటే వృద్ధులు, మహిళలు, చిన్నారుల ఇబ్బంది వర్ణనాతీతం. ఒక్కోసారి గూడ్సు రైలు ఆగి ఉన్నసమయంలో రైలుకింద నుంచి వెళ్లా‍ల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఏడాది ‍క్రితం రైలు కింద నుంచి వెళుతున్న మహిళ అకస్మాత్తుగా రైలు కదలడంతో రైలు కింద పడి మృతిచెందింది. మరో ఘటనలో ఆరునెలల క్రితం ఓ వృద్ధుడు పట్టాలు దాటుతుండగా రైలు వస్తున్న విషయాన్ని గమనించలేదు. స్టేషన్‌ మాస్టర్‌ గమనించి ఆ వృద్ధుడిని పక్కనెట్టి ప్రాణాలు కాపాడాడని స్థానికులు చెబుతున్నారు. ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నా రైల్వేఅధికారులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

    ఫుట్‌ ఓవర్‌  బ్రిడ్జితో సౌకర్యం
    ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిని నిర్మిస్తే ప్రయాణికులు, ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది. గతంలో రైల్వే గేటును మూసి వేస్తే శాంతినగర్‌, హౌసింగ్‌ బోర్డు కాలనీ, బాగారెడ్డి పల్లి, రాంనగర్‌, గాంధీనగర్‌, డైవ్రర్‌ కాలనీ, హమాలి కాలనీ వాసులు రాక పోకలు సాగించేందుకు ఇబ్బందులు పడేవారు.  ప్రత్యామ్నాయంగా పట్టణం చివరన బ్రిడ్జిని నిర్మించారు. ఇది పట్టణ ప్రజలకు ఏ మాత్రం ఉపయోగపడకుండా పోయింది.

    అయితే ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రైల్వేస్టేషన్‌కు ఇరువైపులా అండర్‌ బ్రిడ్జిలను నిర్మించారు. ఇవి వాహన చోదకులకు మాత్రమే ఉపయోగకరంగా ఉన్నాయి. పాదచారులకు ఉపయోగపడడం లేదు. దీంతో అరకిలోమీటరు అదనంగా నడవాల్సి  వస్తోంది. దీంతో పాదచారులు రైలు పట్టాలను‌ దాటుతూ రాకపోకలు సాగిస్తున్నారు.
     బ్రిడ్జి నిర్మాణంలో జాప్యం
    రైల్వే ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం కోసం గత నాలుగేళ్ల క్రితం నిధులు మంజూరైనా ఇప్పటికీ పనులు ప్రారంభించలేదు. జహీరాబాద్‌ రైల్వే స్టేషన్‌ను 2010లో అప్పటి రైల్వే శాఖ సహాయమంత్రి కె.హెచ్‌.మునియప్ప ప్రారంభించారు. ఆదర్శ రైల్వే స్టేషన్‌ నిర్మాణంలో భాగంగా జహీరాబాద్‌ రైల్వే స్టేషన్‌కు రైల్వే శాఖ ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిని సైతం మంజూరు చేసింది. అయినా పనులు ప్రారంభించే విషయంలో మాత్రం రైల్వే శాఖ తీవ్ర జాప్యం చేస్తుండటంపై ప్రయాణికులు, ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.  

    మోకాలికి దెబ్బతగిలింది
     రైల్వే గేటు మూయడంతో పట్టాలు దాటుకుంటు పోతున్నాం. ఫ్లాట్‌ ఫాం ఎత్తుగా ఉండడంతో కాలు జారిపడ్డా. దీంతో మోకాలికి దెబ్బతగిలింది. అయినా తప్పని పరిస్థితిలో పట్టాలను దాటుతూ వస్తూపోతున్నాం. అధికారులు చొరవతీసుకుని బ్రిడ్జి నిర్మిస్తే చాలా బాగుంటుంది.
    -జనార్థన్‌, శాంతినగర్‌

    ఫుట్ ఓవర్‌ బ్రిడ్జి నిర్మించాలి
    ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి నిర్మించాలి. రైలు పట్టాల అవతల వైపుఉన్న శాంతినగర్‌, బాగారెడ్డిపల్లి, హౌసింగ్‌బోర్డు, హమాలీ కాలనీ తదితర కాలనీ ప్రజలు రైలు పట్టాలు దాటుకుంటు రాకపొకలు చేయాల్సి వస్తుంది. కొన్ని సందర్బాల్లో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అధికారులు స్పందించి బ్రిడ్జిని నిర్మించాలి.
    -నాగరాజ్‌, శాంతినగర్

మరిన్ని వార్తలు