రెంట్‌కు ఆశపడితే వారెంటే..

13 Sep, 2017 06:46 IST|Sakshi
రెంట్‌కు ఆశపడితే వారెంటే..

అధిక అద్దెలు భద్రతకు ముప్పు
అధిక అద్దెలకు ఆశపడితే దగా తప్పదు
చిరుద్యోగులే నిజాయితీ పరులు, నమ్మకస్తులు
యజమానులూ జాగ్రత్త సుమా!


తిరుపతి ఎమ్మార్‌పల్లెలో ఉంటున్న పురుషోత్తం ఓ ప్రయివేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. 2005లో తన జీతానికి తగినట్లుగా సింగిల్‌ బెడ్రూం ఇంటిలో భార్యతో కలిసి అద్దెకు దిగారు. అప్పట్లో నెలకు రూ.2000 చొప్పున అద్దె చెల్లించేవారు.  ప్రతి నెలా 6వ తేదీన అద్దె చెల్లిస్తున్నారు. చుట్టుపక్కల వాళ్లతోనూ ఎలాంటి గొడవలూ లేవు. 13 ఏళ్లుగా అదే ఇంటిలో ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన చెల్లిస్తున్న అద్దె నెలకు రూ.3500. ఇప్పుడు ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు. ఇల్లు ఇరుకుగా ఉన్నప్పటికీ సర్దుకుని పోతాం కానీ.. వేరే ఇంటికి వెళ్లే ఉద్దేశం మాత్రం లేదంటున్నారు. ఆ యజమాని కూడా  అద్దె తక్కువైనా వారి వల్ల మాకు ఎలాంటి సమస్యా లేదని చెప్పారు. అసలు ఆ ఇంటి గురించి ఆలోచించే అవసరమే రాలేదంటున్నారు.

రాజీవ్‌ గాంధీ కాలనీలో ఓ భవన యజమాని సుబ్రమణ్యం తన డబుల్‌ బెడ్రూం ఇంటిని 2015 వరకు రూ.6 వేలకు అద్దెకు ఇచ్చాడు. మార్చి 2015లో అద్దెను రూ.10 వేలు చేశాడు. ఒకాయన వచ్చి ఇంటిని చూసిన వెంటనే అడ్వాన్సు ఇచ్చి వెళ్లాడు. నెల నెలా రూ.10వేలు అద్దె వస్తుండడంతో, మరుసటి ఏడాది 12 వేలు చేశాడు. అయినా అద్దె నెల నెలా వచ్చేస్తోంది. ఇక వచ్చే ఏడాది 15 వేలు చేద్దామని అనుకున్నాడు. అంతలోనే ఒక రోజు తెల్లవారుజామున అద్దెకు ఇచ్చిన ఇంటిని పోలీసులు తనిఖీ చేశారు. ఆ ఇంటిలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తేలింది. అప్పటివరకు నెల నెలా అద్దె ఇచ్చిన వ్యక్తి మాయమయ్యాడు. పోలీసులు యజమానిని అదుపులోకితీసుకున్నారు.

తిరుపతి క్రైం :
జిల్లాలోని నగరాలు, పట్టణాల్లో ఇళ్ల యజమానులు అధిక అద్దెలకు ఆశపడి మోసపోతున్నారు. అప్పు చేసి ఇళ్లు కట్టుకున్న వాళ్లు ఆ సొమ్మును అద్దె రూపంలో తొందరగా వసూలు చేసుకోవాలనుకుంటారు. మరికొందరు ఆ ప్రాంతాన్ని బట్టి అద్దెను పెంచుతుంటారు. మరి కొందరు యజమానులు వారి అవసరాలను బేరీజు వేసుకుని అద్దె వసూలు చేస్తుంటారు. ఇలా అద్దె వసూలుపై దృష్టి పెట్టే యజమానులు ఇంటిలో చేరిన వాళ్లపై పెట్టడం లేదు. ఫలితంగా ఆ ఇళ్లలో హత్యలు, వ్యభిచారం, ఆత్మహత్యలు వంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

అలాంటి సంఘటనల తరువాత యజమానులు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు జరిగిన ఇళ్లల్లో ఎవరూ చేరడానికి ముందుకు రారు. ఒక వేళ విషయం తెలియకుండా చేరినా చుట్టుపక్కల వాళ్లు చెప్పిన తరువాత ఆ ఇంటిలో ఉండడానికి ఇష్టపడరు. అప్పుడు యజమానులు సంవత్సరాలపాటు అద్దెను కోల్పోయే పరిస్థితి ఉంటుంది. అందుకే యజమానులు అధిక అద్దెలకు ఆశపడకుండా ఇళ్లల్లో చేరే వ్యక్తులు ఎలాంటివాళ్లో తెలుసుకోవాలి. వీలైతే వారి గత చరిత్రను కూడా తెలుసుకోవాలి.

అద్దె కోసం కక్కుర్తి వద్దు
అద్దెకు దిగేవాళ్లు అద్దె కాస్త తగ్గించమని అభ్యర్థిస్తున్నారంటే వారు మధ్య తరగతికి చెందినవారుగా పరిగణించవచ్చు.
వారు అదే ప్రాంతంలో ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ చేస్తుంటే ఆ ఇంట్లో ఎక్కువ కాలం వారు అద్దెకు ఉంటారని భావించవచ్చు.
ఆ ఇంటి చుట్టుపక్కలున్న విద్యా సంస్థల్లో వారి పిల్లలు చదువుతుంటే అలాంటి వాళ్లకు నిర్భయంగా అద్దెకు ఇవ్వవచ్చు. ఎందుకంటే వారి అసలు వివరాలు ఆ స్కూలు రికార్డుల్లో ఉంటాయి.
అద్దె చెప్పగానే ఎంతైనా ఓకే అంటూ అడ్వాన్సు ఇస్తున్నారంటే, వాళ్ల గురించి మరో సారి ఆలోచించాలి. అద్దె ఎక్కువ వస్తుందనుకుంటే కష్టాలు తప్పవు.
వారు ఉపయోగించే వాహనాల నంబర్లు, ఆధార్‌ కార్డు నంబర్లు వంటివి సేకరించాలి.
కొంత మంది ధనవంతుల ఇళ్లను గమనించి ఖాళీ అయిన సమయంలో అద్దెకు దిగుతారు. ఇంటి యజమానితో ఆప్యాయంగా ఉన్నట్లుగా నటించి, ఎవరూ లేని సమయంలో వారిని చంపో, బెదిరించో వారి నగదును దోచుకుని పరారవుతారు.  
హైటెక్‌ మోసగాళ్లు ఉన్నందున యజమానులు మరింత అప్రమత్తంగా ఉం డాలి.

అద్దెకు దిగేవారు గుర్తుంచుకోండి
తరచూ ఒక ఇంటికి టులెట్‌ బోర్డు వేలాడుతోందంటే.. ఆ ఇంటిలో ఏదో లోపం ఉందని గుర్తించండి.  
ఎక్కువ కాలం ఆ ఇల్లు ఖాళీగా ఉందంటే ఏదో సమస్య ఉంటుందని భావించాలి. చుట్టుపక్కల వారిని విచారిస్తే తెలిసే అవకాశం ఉంటుంది.
చాలా ఇళ్లలో యజమానులు సవాలక్ష షరతులను విధిస్తుంటారు. అలాంటివేమైనా ఉన్నాయేమో తెలుసుకోవాలి.
ప్రధానంగా నీటి సమస్య ఏదైనా ఉందేమో తెలుసుకోవాలి.
అది లోతట్టు ప్రాంతమైతే వర్షా కాలంలో ఇబ్బందులు తప్పవని గ్రహించాలి.
ఆ వీధిలో కానీ, ఆ ప్రాంతంలో కానీ తరచూ గొడవలు లాంటివి ఏవైనా జరుగుతున్నాయా? ఏ నేపథ్యంలో జరుగుతున్నాయో కూడా తెలుసుకోవడం మంచిది.
ఆ ప్రాంతంలో చోరీలు జరుగుతున్నాయా, రాత్రుల్లో రాకపోకలు సాగించడానికి వీలుగా ఉంటుందా లేదా వంటివి ముందే తెలుసుకోవడం మంచిది.
సాధారణంగా ప్రధాన రోడ్ల పక్కన ఉండే ఇళ్లకు అద్దె ఎక్కువగా ఉంటుంది. వాస్తవానికి అలాంటి ఇళ్లలో ఉండే వారు రణగొన ధ్వనులతోపాటు, సమ్మెలు, బంద్‌లు వంటి సమయాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు.
కాస్త లోపలకు ఉన్న ఇళ్లయితే అద్దె తక్కువతోపాటు కాస్త ప్రశాంతతకు అవకాశం ఉంటుంది.  
అన్నీ ముందే తెలుసుకుని తరువాతే ఇంట్లో దిగడం మంచిది. తరచూ ఇళ్లు మారాలంటే కూడా సాధ్యమయ్యే పని కాదు.

యజమానులదే బాధ్యత
అధిక అద్దెలకు ఆశపడి మోసగాళ్లకు ఇళ్లు ఇచ్చి వారు పరారైపోతే యజమానులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఆ ఇంట్లో అసాంఘిక కార్యకలాపాలను నిర్వహిస్తుంటే యజమానులు గుర్తించాలి. అందుకే అద్దెకు వచ్చినవారి గురించి తెలిసిన వారితో వాకబు చేసి వీలైనంత వరకు వారి వ్యక్తిత్వాన్ని నిర్ధారించుకోవాలి. ముఖ్యం గా గుర్తింపుకార్డు జిరాక్స్‌ తీసుకోవాలి. వారి ఆధార్‌ జిరాక్స్‌ ఉంటే చాలు. వారి వివరాలు  తెలిసినట్లే. వారు ఉపయోగించే కార్లు, ద్విచక్ర వాహనాల నంబర్లు వేరుగా రాసుకుని ఉంచుకోండి. వారి కదలికను గమనించండి. ఏమాత్రం తేడా వచ్చినా పోలీసులకు సమాచారం ఇవ్వండి. మీకు ఎటువంటి ఇబ్బందులూ ఉండవు.                  
– మునిరామయ్య, ఈస్ట్‌ సబ్‌ డివిజినల్‌ డీఎస్పీ

మరిన్ని వార్తలు