పాదగయ గోశాలకు రక్షణ కరువు

17 Oct, 2016 23:25 IST|Sakshi
పిఠాపురం : 
స్థానిక పాదగయ కుక్కుటేశ్వరస్వామి దేవస్థానంలో గోశాలలో అప్పుడే పుట్టిన లేగదూడలు కుక్కల బారిన పడి ప్రాణాలు వదులుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాదగయ పుష్కరిణికి తూర్పు వైపున ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షెడ్లలో గోశాల నిర్వహిస్తున్నారు. వీటిలో సుమారు 16 గోవులు ఉన్నాయి. వీటి పోషణకు భక్తులు రూ.లక్షల్లో విరాళాలు సమర్పిస్తుంటారు. పలు పర్వదినాలలో సైతం ఈ గోవులకు పూజలు చేస్తుంటారు. రాత్రిళ్లు కాపలా ఉండేవారు నిర్లక్ష్యం వహిస్తుండడంతో కుక్కలు ఆలయ పరిసరాలు, గోశాలలోకి ప్రవేశించి లేగదూడలను పీక్కు తీనేస్తున్నాయి. ఇప్పటివరకూ మూడు దూడలు చనిపోయినట్టు గోసంరక్షణ సమితి సభ్యులు గుర్తించారు. ఈ విషయంపై ఆలయ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గోదాతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు లేగదూడల మరణాలపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుని గోవులకు రక్షణ కల్పించాలని భక్తులు కోరుతున్నారు. 
ఇది వాస్తవమే...
ఈ విషయంపై ఆలయ ఈఓ చందక దారబాబును వివరణ కోరగా లేగదూడలను కుక్కలు పీక్కుతినడం వాస్తవమేనని అంగీకరించారు. ఈ విషయం తన దృష్టికి వచ్చిందని, విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు.
 
మరిన్ని వార్తలు