ఇక ‘పునర్వసు’లోనే..

3 Jul, 2017 04:37 IST|Sakshi
ఇక ‘పునర్వసు’లోనే..
- మృగశిర కార్తెలో అందని నీరు
- డెల్టాలో వరిసాగు.. జాగు
- ‘ఆరుద్ర’ రాకతో నారుమళ్లలో మరింత జాప్యం
- అదును దాటుతున్న ఖరీఫ్‌
- రబీకి తప్పని ఆలస్యం
- మూడో పంట ప్రశ్నార్థకం
అమలాపురం : డెల్టాలో ఏరువాకకు ఆరుద్ర కార్తె పెద్ద గుదిబండ. ఈ కాలంలో నారుమడులు వేస్తే.. తుపాన్ల సమయంలో పంట చేతికి వచ్చే అవకాశముంటుంది. ఒకవిధంగా చెప్పాలంటే ఇప్పుడు నారు వేయడమంటే గాలిలో దీపం పెట్టడమే. ఈ పరిస్థితుల్లో కుదిరితే మృగశిర.. లేదా తుపాన్లు దాటిన తరువాత పంట చేతికి వచ్చేలా పునర్వసు కార్తెలో నారుమడులు వేయడం ఖరీఫ్‌ సాగు చేసే డెల్టా రైతులకు పరిపాటి. అయితే, ఈ ఏడాది కూడా మృగశిర కార్తెలో నీరందించకపోవడంతో ఎప్పటిలానే ‘పునర్వసు’లో నారు వేసేందుకు ఖరీఫ్‌ రైతులు సిద్ధమవుతున్నారు. దీంతో ఈ ఏడాది కూడా గోదావరి డెల్టాలో ఖరీఫ్‌ సాగు ఆలస్యం కానుంది.
ముందస్తు ఖరీఫ్‌కు షెడ్యూలుకంటే ముందే నీరంటూ రైతులను ఊరించిన ప్రభుత్వ పెద్దలు.. ఎప్పటిలానే పొలాలకు సాగునీరు ఆలస్యంగా విడుదల చేశారు. ఫలితంగా ఖరీఫ్‌ వరి సాగులో జాప్యం జరుగుతోంది. జూన్‌ ఒకటిన సాగునీరు విడుదల చేసినా.. ఆధునికీకరణ, నీరు - చెట్టు అంటూ కాలువలకు అడ్డుకట్ట వేస్తూ 20వ తేదీ వరకూ పొలాలకు నీరందకుండా చేశారు. ఈ కారణంగా డెల్టాలో నారుమడులు ఆలస్యమవుతున్నాయి. తూర్పు, మధ్య డెల్టాల్లో 4.80 లక్షల ఎకరాల ఆయకట్టు ఉందన్నది అధికారుల లెక్కలు కాగా, ఇప్పటివరకు 70 శాతం పొలాల్లో కూడా నారుమడులు వేయలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
మృగశిర కార్తె గత నెల 21 వరకూ ఉన్నా ఆ సమయంలో నీరందకపోవడంతో రైతులు నారుమడులు వేయలేకపోయారు. 22 నుంచి ఆరుద్ర కార్తె మొదలైంది. ఈ నెల ఏడు వరకూ ఇది ఉంటుంది. అయితే, ఐదు నెలల పంటకాలం కావడంవల్ల.. ఈ సమయంలో నారుమడులు వేస్తే అక్టోబరు నెలాఖరు నుంచి నవంబరు 15 మధ్యన పంట చేతికి వచ్చే అవకాశముంది. కానీ, ఆ సమయంలోనే ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయి. తుపాన్లు వస్తుంటాయి. ఫలితంగా ఆ సమయంలో పంట నష్టపోవడం డెల్టాలోని శివారు రైతులకు పరిపాటిగా మారింది. దీనిని దృష్టిలో పెట్టుకుని పునర్వసు మొదలైన తరువాత అంటే ఈ నెల రెండో వారం తరువాతే రైతులు నారుమడులు వేయనున్నారు. అదే కనుక జరిగితే జూలై నెలాఖరు, ఆగస్టు మొదటి వారంలో కూడా ఖరీఫ్‌ నాట్లు పడే అవకాశముంటుంది. దీనివల్ల ఎప్పటిలాగానే రబీ సాగు ఆలస్యం కానుంది. దీంతో షరా మామూలుగానే మూడో పంట అపరాలు సాగు చేసే అవకాశం రైతులకు లేకుండా పోనుంది.
శివారులో మరింత ఆలస్యం
- తూర్పు డెల్టా పరిధిలోని రామచంద్రపురం నియోజకవర్గంలో సాధారణ సాగు విస్తీర్ణం 58 వేల ఎకరాలు కాగా, 20 శాతం మాత్రమే నారుమడులు వేశారు. ఇక్కడ జూలై నెలాఖరు, ఆగస్టులో నాట్లు పడే అవకాశముంది.
- సామర్లకోట గోదావరి కాలువ మీద సామర్లకోట మండలంలో 20 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా, 20 శాతం మాత్రమే నారుమడులు వేశారు.
- కరప, కాకినాడ రూరల్‌ మండలాల్లో 28,700 ఎకరాల ఆయకట్టు ఉండగా, సుమారు 40 శాతం ఆయకట్టులో మాత్రమే నారుమడులు వేశారు.
- మధ్య డెల్టాలో వ్యవసాయ సబ్‌ డివిజన్లవారీగా చూస్తే పి.గన్నవరంలో 14,900 ఎకరాలకుగాను 70 శాతం, అమలాపురం 42 వేల ఎకరాలకుగాను 30 శాతం, ముమ్మిడివరం 23,500 ఎకరాలకుగాను 25 శాతం, రాజోలు 17 వేల ఎకరాలకుగాను 10 శాతం కూడా నారుమడులు పడలేదు. రాజోలు సబ్‌ డివిజన్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో రైతులు సాగు చేస్తారనే నమ్మకం కలగడం లేదు. దీనికితోడు నారుమడులు వేసిన శివారు ప్రాంతాల్లో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల నారు నీట మునిగిన విషయం తెలిసిందే. ముంపునీరు దిగే అవకాశం లేదని ఇక్కడ రైతులు పంట విరామానికి మొగ్గు చూపుతున్నారు. వీటన్నింటి నేపథ్యంలో ఈ ఏడాది డెల్టాలో ఖరీఫ్‌ సాగు ఆరంభంలోనే ఒడుదొడుకులకు లోనవుతోంది.
ఎగువన కొంతవేగం
- తూర్పు డెల్టాలోని అనపర్తి వ్యవసాయ సబ్‌ డివిజన్‌ పరిధిలో 48 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా, ఇప్పుడిప్పుడే నాట్లు ఆరంభించారు. అది కూడా మొత్తం ఆయకట్టులో 10 శాతమే. ఇక్కడ సుమారు 80 శాతం నారుమడులు పడ్డాయి. బోర్ల కింద నారు వేసిన రైతులు మాత్రమే నాట్లు వేస్తున్నారు.
- ఆలమూరు సబ్‌ డివిజన్‌ పరిధిలో 38 వేల ఎకరాలు కాగా, ఇక్కడ కూడా 80 శాతం నారుమడులు పడ్డాయి. నాట్లు 15 శాతం మాత్రమే అయ్యాయి.
- మధ్య డెల్టాలోని కొత్తపేట సబ్‌ డివిజన్‌లో సుమారు 30 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా, ఇక్కడ ఆత్రేయపురం మండలంలో మాత్రమే కొంతవరకూ నాట్లు పడుతున్నాయి. మొత్తం నియోజకవర్గంలో ఐదు శాతం నాట్లు కూడా పడలేదన్నది అంచనా. నారుమడులు కూడా 40 శాతం మాత్రమే పడ్డాయి.
మరిన్ని వార్తలు